కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కూటమిలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డిపై జనసేన ఎన్నికల సమన్వయకర్త చల్లా శ్రీ వరుణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో జనసేన, బీజేపీని దెబ్బతిసేలా ఎమ్మెల్యే అరాచకాలు చేశారని ఆరోపించారు.
‘‘మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి ధర్మంలో 13 సీట్లు జనసేన ఇవ్వాల్సి ఉండగా ఒక్క సీటు కూడా కేటాయించలేదు. పార్టీ ఆదేశాల మేరకు ఆరు వార్డులో జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేస్తే, ఐదు చోట్ల టీడీపీ అభ్యర్థులను పోటీలో దించి, జనసేనను ఎమ్మెల్యే ఓడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని ఎమ్మెల్యే తుంగలోతొక్కారు.
ఎమ్మిగనూరు జడ్పీటీసీని జనసేనకు కేటాయించి క్రాస్ ఓటింగ్ ద్వారా జనసేన అభ్యర్థిని ఎమ్మెల్యే ఓడిచ్చారు. నందవరం, గోనెగండ్ల మండలాల్లో జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు పోటుగా టీడీసీ అభ్యర్థులను దింపి జనసేన ఓటమికి ఎమ్మెల్యే కారణమయ్యారు. ఎమ్మిగనూరులో జనసేన ఫ్లెక్సీలు జెండాలు దిమ్మలు పడగొట్టిస్తూ పార్టీని సర్వనాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు’’ అని చెప్పారు.


