సాక్షి,శ్రీకాకుళం: అధికార టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. పెద్దపాడు ప్రాంతానికి చెందిన సుమారు 300 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు సమక్షంలో వీరంతా పార్టీ కండువా కప్పుకుని వైఎస్సార్సీపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కుటుంబాలకు ధర్మాన సాదరంగా ఆహ్వానం పలికారు.
ఈ భారీ చేరికల సంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. పెద్దపాడు నుంచి ఒక్కసారిగా 300 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరడం పార్టీకి శ్రీరామరక్ష లాంటిదని, ఇది కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో మరియు స్థానికంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే సొంత గ్రామంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థే స్పష్టమైన మెజారిటీతో గెలిచినా.. అధికార బలంతో ఫలితాలను పూర్తిగా తారుమారు చేశారని ధ్వజమెత్తారు.ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీ వైపు నిలిచినా, అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అక్రమ పద్ధతులను ఆశ్రయించి, ఓడిపోయిన టీడీపీ అభ్యర్థే గెలిచినట్లు బలవంతంగా ధ్రువీకరణ పత్రాలు ఇప్పించుకున్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అని ధర్మాన ఆరోపించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్య పోరాటం
అధికార పార్టీ అరాచకాలను, అక్రమాలను ప్రజలందరూ గమనించాలని, ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ గట్టిగా ప్రశ్నించాలని ధర్మాన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం వైఎస్సార్సీపీ శ్రేణులంతా భయపడకుండా, మరింత ధైర్యంగా, కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


