డిక్లరేషన్ ఫారంతో దొనపాటి శ్రావణి
మార్కాపురం జిల్లా: టీడీపీ గూండాలు ఐదు సార్లు దాడి చేసి నామినేషన్ పత్రాలు చించేసినా.. ఏ మాత్రం వెనక్కితగ్గకుండా నామినేషన్ వేసిన ప్రకాశం జిల్లా సూదనగుంట వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఘన విజయం సాధించారు. మార్కాపురం జిల్లా పొదిలి మండలం సూదనగుంట ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని దొనపాటి శ్రావణి నామినేషన్ వేసేందుకు వెళ్లిన ప్రతిసారీ పోలీసుల అండతో టీడీపీ గూండాలు చీర పట్టుకొనిలాగి, దాడి చేసి.. నామినేషన్ పత్రాలను లాక్కొని చించేశారు. టీడీపీ గూండాల దాడిలో శ్రావణి చేతికి గాయమైంది.
ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఉండి పోయారే తప్ప.. టీడీపీ రౌడీలపై చర్యలు తీసుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన టీడీపీ గూండాలు ఐదుసార్లు ఆమె నామినేషన్ పత్రాలను చించేశారు. అయినా పట్టువదలకుండా అతికష్టం మీద శ్రావణి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు వచి్చనా నామినేషన్ ఉపసంహరించుకోలేదు. టీడీపీ గూండాలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా చివరకు టీడీపీ అభ్యర్థిని బీరం ధనలక్ష్మిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని శ్రావణి 44 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమెను వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు, నియోజకవర్గ పరిశీలకుడు కేవీ రమణారెడ్డి అభినందించారు.


