వేమా ఝాన్సీరాణి
చీమకుర్తి రూరల్(ఒంగోలు) : నా ఓటమి చీమకుర్తి సీఐకి అంకితమంటూ చీమకుర్తి మండలంలోని బండ్లమూడి ఎంపీటీసీ స్థానానికి పోటీచేసిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి వేమా ఝాన్సీరాణి అన్నారు. చీమకుర్తి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఎక్కడా ప్రశాంతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోలేదన్నారు. పోలీసులు, అధికారుల సహకారంతో అధికార టీడీపీ నాయకులు యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారని ఆరోపించారు.
ప్రధానంగా చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్ ఎన్నికల్లో పూర్తిగా టీడీపీకి వారికి సహకరించి రిగ్గింగ్ చేసుకునేందుకు కారణమయ్యారన్నారు. తన ఓటమితో పాటు మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఓటమికి సీఐ దుర్గాప్రసాద్ కారణమంటూ ఝాన్సీరాణి మండిపడ్డారు. శనివారం కౌంటింగ్ అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. తన భర్త అయిన చీమకుర్తి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా పోలింగ్ బూత్‌లో ఉన్న ఏజెంట్లను స్వయంగా చీమకుర్తి సీఐ బయటకు లాగి రిగ్గింగ్‌కు పూర్తి సహకారం అందించి తన ఓటమికి కారణమయ్యాడని వివరించారు.
కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు నిర్వహించిందని, అందులో చీమకుర్తి మండలంలో ప్రధాన పాత్రధారుడిగా చీమకుర్తి సీఐ పనిచేశారని ఆరోపించారు. తన భర్త వేమా శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి అగ్రహారం పోలింగ్ బూత్‌లో చీమకుర్తి నుంచి వచ్చిన రౌడీ మూకలతో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, ఇది పోలీస్ వ్యవస్థకు సంబంధించిన అంశం కాదని, కేవలం చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్ చర్యలే కారణమని దుయ్యబట్టారు. సుమారు 200 ఓట్లపైచిలుకు మెజారిటీతో గెలవాల్సిన తనను ఓడిపోయేలా చేయడంలో సీఐ కీలకపాత్ర పోషించడం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటని అన్నారు.
ఇదీ చదవండి: ఇన్‌వ్యాలీడ్ ఓటూ టీడీపీ ఖాతాలో..


