కాగడాలతో నిరసన తెలుపుతున్న దబ్బలపాడు గిరిజనులు
సాక్షి,పాడేరు: అనంతగిరి మండలం రొంపిలి పంచాయతీ గిరిశిఖర గ్రామమైన దబ్బలపాడులో 12 కుటుంబాల గిరిజనులు గత 10 రోజుల నుంచి అంధకారంలో మగ్గుతున్నారు. చీకటి పడగానే గాఢాంధకారంలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.
సోలార్ విద్యుత్ పథకం తరచూ మరమ్మతులకు గురవుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. తమకు సోలార్ వద్దని, స్తంభాలతో కొత్తగా లైన్ వేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలని గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం దీపావళి పండగనాడు కాగడాల ప్రదర్శన చేపట్టి వినూత్నంగా నిరసన తెలిపారు.


