సుగాలి పార్వతి అడ్డగింత.. కర్నూలులో ఉద్రిక్తత | Police obstructed Sugali Preethi's wheel chair rally | Sakshi
Sakshi News home page

సుగాలి పార్వతి అడ్డగింత.. కర్నూలులో ఉద్రిక్తత

Aug 19 2026 1:18 PM | Updated on Aug 19 2026 1:56 PM

Police obstructed Sugali Preethi's wheel chair rally

సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసుకు తొమ్మిదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఆమె తల్లి పార్వతి చేపట్టిన యాత్రను బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. యాత్ర చేపట్టకుండా అడ్డుకోవడంతో పాటు బంధువులతోనూ వాగ్వాదానికి దిగారు. దీంతో కర్నూలులో ఉద్రిక్తత నెలకొంది.

సుగాలి ప్రీతి కేసులో న్యాయం జరగాలనే డిమాండ్‌తో ఆమె తల్లి పార్వతి చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు నుంచి అమరావతి వరకు వీల్‌చైర్‌ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. తన గోడును ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు అమరావతికి వెళ్లాలని భావించారు.

అయితే యాత్రకు అనుమతి లేదని పోలీసులు ఆమెకు తెలిపారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటూ ముందుగానే ఆమె నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. యాత్రకు సిద్ధమైన సమయంలోనూ పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నేటితో తొమ్మిదేళ్లు..
సుగాలి ప్రీతి కేసుకు నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. 2017లో కర్నూలులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. అప్పటి నుంచి ఆమె కుటుంబ సభ్యులు తమ కుమార్తెకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు. కేసులో దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని వారు పలుమార్లు ప్రభుత్వాలను కోరారు. సంవత్సరాలు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని ప్రీతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌ మోసంపై పార్వతి ఆవేదన
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గతంలో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పార్వతి గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ తన కుమార్తె కేసులో న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘న్యాయం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మా సమస్యను పట్టించుకోవడం లేదు’’ అంటూ ఆమె వాపోయారు.

జగన్‌ హయాంలో న్యాయం
వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. సుగాలి ప్రీతి కేసులో న్యాయం అందించేందుకు ప్రయత్నించారు. కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించే ప్రయత్నం చేయడంతో పాటు ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి ఆర్థిక చేయూత కూడా అందించారు. అయితే తిరిగి కూటమి అధికారంలోకి వచ్చాక కేసును పక్కన పడేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

పోరాటం కొనసాగిస్తా
తన కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని పార్వతి చెబుతున్నారు. వీల్‌చైర్‌ యాత్రను పోలీసులు అడ్డుకోవడంపై ఆమె, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనుమతి లేకుండా యాత్ర చేపట్టేందుకు వీలు లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సుగాలి ప్రీతి కేసుకు తొమ్మిదేళ్లు పూర్తయిన రోజే.. న్యాయం కోసం ఆమె తల్లి చేపట్టిన యాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టించడం మరోసారి ఈ కేసును చర్చలోకి తెచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement