సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ నది ప్రవాహం లాంటిదని.. ఒకరిద్దరు నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయిన నష్టం ఏమీలేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. కొంత మంది నాయకులు పార్టీకి వెన్నుపోటు పొడిచారు.. రానున్న రోజుల్లో వారికి ప్రజలే బుద్దిచెతారని అన్నారు. రాజన్న రాజ్యం కోసం అందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఈరోజు భీమిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, పుష్ప శ్రీవాణి, బొత్స ఝాన్సీ, బొత్స అనూష, కేకే రాజు, వరుదు కళయాణి బెల్లాన చంద్రశేఖర్, భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు.
అనంతరం, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌కు కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారు. ఒకరిద్దరు నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయిన నష్టం ఏమీలేదు. ఒకరు పార్టీ నుంచి వెళ్ళిపోతే వంద మందిని జగన్ తయారు చేస్తారు. నాయకులను లాక్కొని జగన్‌ను భయపెట్టాలని చూస్తున్నారు. వైఎస్ జగన్ భయపడే మనిషి కాదు’ అని అన్నారు.
బొత్స అనూష మాట్లాడుతూ..‘నా మీద జగనన్న పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. భీమిలి నియోజకవర్గానికి బొత్స కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. దేవుడు జగన్న రూపంలో భీమిలి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారు. సూపర్ సిక్స్ హామీలపై ప్రభుతాన్ని నిలదిద్దాం. భీమిలిలో జరుగుతున్న అక్రమాలపై పెద్ద ఎత్తున పోరాటం చేద్దాం. ఒకరు ఇద్దరు పోయినా పార్టీకి నష్టం లేదు. కార్యకర్తలకు అండగా ఉంటాను’ అని హామీ ఇచ్చారు.
మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి మాట్లాడుతూ..‘యువతకు వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారు. తక్కువ కాలంలోనే బొత్స అనూష తనదైన ముద్ర వేసుకున్నారు. తొలి అడుగు భీమిలి నుంచి అనూష వేస్తున్నారు. భీమిలి గడ్డ మీద వైఎస్సార్‌సీపీ జెండాను అనూష ఎగురవేస్తారు. కొంత మంది నాయకులు పార్టీకి వెన్నుపోటు పొడిచారు. రానున్న రోజుల్లో వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. పార్టీని వీడి వెళ్లిపోయిన ఇద్దరు సీనులకు అంత సీను లేదు’ అంటూ విమర్శలు చేశారు.
బొత్స ఝాన్సీ మాట్లాడుతూ..‘అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించడం.. అధికారం పోయాక వెళ్ళిపోవడం కొంతమంది నాయకులు చేస్తున్నారు. నా బిడ్డను దీవించాలని కోరుతున్నాను. రాజన్న రాజ్యం కోసం అందరూ పోరాటం చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి’ అని తెలిపారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే అమ్మకం. రాష్ట్రంలో అతి పెద్ద నియోజక వర్గం భీమిలి. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా అనూష పాల్గొంటున్నారు. అనూషకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. భీమిలిలో వైఎస్సార్‌సీపీకి బలమైన కేడర్ ఉంది. భీమిలిలో కొండలను కూటమి నాయకులు తవ్వేస్తున్నారు. ప్రతీ కొండకి గుండు కొట్టారు. రూపాయి అర్ధ రూపాయికి వేల కోట్ల భూములు కట్టబెడుతున్నారు. చంద్రబాబు అంటేనే అమ్మకం. మెడికల్ కాలేజీలు, విద్య, వైద్యం, ఆర్టీసీ అన్నింటినీ అమ్మేస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.
బుడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ..‘బొత్స అంటే ఒక బ్రాండ్. బొత్స బ్రాండ్ నుంచి మరొక వారసురాలు రాజకీయాల్లోకి వచ్చారు. చిన్న వయసులో సమన్వయకర్తగా అనూష బాధ్యతలు చేపట్టారు’ అని తెలిపారు.
ఇదీ చదవండి: మంత్రి నాదెండ్లకు ఘోర అవమానం!


