సాక్షి,విజయవాడ: దివంగత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వివాదంలో రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8వ తేదీన కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌కు వచ్చి విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు.
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యులు అధికార లాంఛనాలు వద్దని ముందే స్పష్టం చేశారు. అయినప్పటికీ, పోలీసులు నిబంధనల పేరుతో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు.
పోలీసుల తీరును మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు ముద్రగడ అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించి, వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై అంబటి రాంబాబుతో పాటు మరికొందరు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


