సాక్షి,నల్గొండ: కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసును నల్గొండ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ దారుణ ఘోరానికి ఒడిగట్టింది మరెవరో కాదు.. అదే పాఠశాలలో చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులని పోలీసులు నిర్ధారించారు. 27సార్లు కత్తితో పొడిచేసి ప్రాణం తీసిన నిందితుల్ని కేవలం ఒకే ఒక్క క్లూ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి మీడియాకు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
'బాబు' అనే పిలుపే హంతకులను పట్టించింది!
హత్య జరగడానికి కొద్దిసేపటి ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో హంతకులు ఇంట్లోకి ప్రవేశించగా, రూపారెడ్డి ఫోన్ కట్ చేయకుండానే ‘బాబు’ అని పిలిచారు. ఆ తర్వాత ఫోన్ కట్ అయిపోయింది. రూపారెడ్డి చిన్నమ్మ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సాధారణంగా పాఠశాల విద్యార్థులను ‘బాబు’అని పిలవడం రూపారెడ్డికి అలవాటు. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించగా, అసలు నిందితులు సొంత స్కూల్ విద్యార్థులేనని తేలింది.
హత్యకు దారితీసిన కారణాలు
నిందితులిద్దరూ నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటున్నారు. వీరి వయస్సు కేవలం 16 సంవత్సరాలు. జల్సాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన వీరు.. హాస్టల్‌లో నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ ఫోన్లు వాడుతూ ప్రిన్సిపాల్ రూపారెడ్డికి దొరికిపోయారు. అంతేకాకుండా, సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో ‘తేలికగా డబ్బు సంపాదించడం ఎలా?’ అని వెతుకుతుండగా గమనించిన ప్రిన్సిపాల్.. వారి తల్లిదండ్రులను పిలిపించి సమక్షంలోనే గట్టిగా మందలించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న ఆ విద్యార్థులు ప్రిన్సిపాల్‌పై తీవ్ర కక్ష పెంచుకున్నారు.
యూట్యూబ్‌లో హత్యకు స్కెచ్.. పక్కాగా రెక్కి
ప్రిన్సిపాల్ రూపారెడ్డి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని భావించిన నిందితులు, ఆమెను అంతమొందించి ఆ డబ్బు దోచుకోవాలని ప్లాన్ చేశారు. హత్య చేసి పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి? అనే విషయాలపై సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో వారం రోజుల పాటు అన్వేషించారు. సాంకేతికంగా దొరకకుండా ఉండేందుకు పక్కాగా రెక్కి నిర్వహించారు. ప్రణాళికలో భాగంగా కొండమల్లేపల్లిలోనే ఒక కత్తి, చేతి గ్లౌజులు కొనుగోలు చేశారు.
రక్తపు మరకల నోట్లతో దొరికిపోయారు
హత్య జరిగిన రోజు రూపారెడ్డి ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి ఇద్దరు నిందితులు ఆమె ఇంటికి చేరుకున్నారు. ఒక విద్యార్థి ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద నిలబడి ఎవరైనా వస్తున్నారా అని నిఘా పెట్టగా .. మరొకరు ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించాడు. అనంతరం రూపారెడ్డిపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. హత్య అనంతరం ఇంట్లో ఉన్న రూ. 1.54 లక్షల నగదుతో పాటు, ఆధారాలు దొరకకుండా రూపారెడ్డి వ్యక్తిగత ఫోన్‌ను తీసుకుని నిందితులు పారిపోయారు. విచారణలో భాగంగా ఇద్దరు మైనర్ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి హత్య సమయంలో రక్తపు మరకలు అంటుకున్న రూ. 1.54 లక్షల నగదును, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, హత్య జరిగిన తర్వాత ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు 50 మందికి పైగా అనుమానితులను విచారించారు. చివరకు, రూపారెడ్డి ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, ఎరుపు రంగు షర్ట్ ధరించిన ఒక మైనర్ బాలుడు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. ఆ క్లూ ఆధారంగా పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, తన స్నేహితుడితో కలిసి చేసిన ఈ ఘోర హత్యోదంతాన్ని పూర్తి వివరాలతో ఒప్పుకున్నాడు.
ప్రస్తుతం నిందితులైన ఇద్దరు మైనర్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు. గురువు స్థానంలో ఉన్న ప్రిన్సిపాల్‌ను విద్యార్థులే ఇంత ఘోరంగా చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


