హే‘రామ్‌’..! | Rajya Sabha Adjourned Amid Uproar Over Ayodhya Ram Temple Theft Allegations | Sakshi
Sakshi News home page

హే‘రామ్‌’..!

Aug 5 2026 1:48 AM | Updated on Aug 5 2026 1:48 AM

Rajya Sabha Adjourned Amid Uproar Over Ayodhya Ram Temple Theft Allegations

మంగళవారం రాజ్యసభలో నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష పార్టీల సభ్యులు

రాజ్యసభను కుదిపేసిన రామాలయ విరాళాల చోరీ అంశం 

అధికార, విపక్ష ఎంపీల నిరసనలు, వాగ్వాదాలతో సభలో తీవ్ర దుమారం 

కాంగ్రెస్, ఎస్పీలు రాముడి విరోధులన్న మంత్రి రిజిజు 

విరాళాల చోరీ విషయంలో సీబీఐ, ఈడీ, విజిలెన్స్‌ ఏం చేశాయని ఖర్గే ప్రశ్న 

తీవ్ర గందరగోళం, నిరసనల మధ్య కొనసాగిన వాయిదాలు

సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో భక్తులు సమర్పించిన కోట్లాది విలువైన విరాళాల చోరీ అంశం మంగళవారం పార్లమెంట్‌ను కుదిపేసింది. చందాచోరీలో పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరపాలని ప్రతిపక్షం పట్టుబట్టింది., శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌పై వచ్చిన ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేయడంతో రాజ్యసభలో పెను దుమారం రేగింది. మంగళవారం ఉదయం పార్లమెంట్‌ ఉభయసభలు ప్రారంభమైన వెంటనే రామాలయ విరాళాల చోరీ అంశంపై చర్చకు పట్టుబడుతూ విపక్ష పార్టీల ఎంపీలు నిరసనలకు దిగారు. లోక్‌సభలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు విరాళాల చోరీపై ప్లకార్డులు ప్రదర్శించారు. 

స్పీకర్‌ ఓం బిర్లా వారించే ప్రయత్నం చేసినా వారు వెనక్కి తగ్గలేదు. దీంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమయ్యాక విపక్ష సభ్యుల వైఖరిలో మార్పురాకపోవడంతో లోక్‌సభను బుధవారానికి వాయిదా పడింది. ఇక రాజ్యసభలోనూ విపక్ష ఎంపీలు తమ స్థానాల్లోంచి వెల్‌లోకి వచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ట్రస్ట్‌లో విలువైన కానుకలు, నగదు విరాళాలు, భూముల కొనుగోలు, ట్రస్ట్‌ నిర్వహణలో అక్రమాలు జరిగాయి. వీటిపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి. ట్రస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ఏర్పాటును ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంట్‌లో ప్రకటించారు. 

70 ఎకరాలకు పైగా భూమిని కేంద్రమే ట్రస్ట్‌కు అప్పగించింది. భూమి పూజ నుంచి ప్రాణ ప్రతిష్ఠ వరకు ప్రతి కీలక క్రతువులో మోదీ స్వయంగా పాల్గొన్నారు. అన్నీ తానై ముందుండి నడిపించిన మోదీ తీరా విరాళాల చోరీపై మౌనమెందుకు? ఆరోపణలను నివృత్తిచేసే బాధ్యత నుంచి మోదీ తప్పించుకోలేరు. 

చోరీ కేసులో ఈడీ, సీబీఐ, ఐటీ, విజిలెన్స్‌ 
వంటి దర్యాప్తు సంస్థలు ఎంత లోతైన దర్యాప్తు చేశాయో నివేదించాలి’’అని ఖర్గే డిమాండ్‌ చేశారు. ఖర్గే వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తీవ్రస్థాయిలో స్పందించారు. చట్టాలు రూపొందించాల్సిన పార్లమెంట్‌ను విపక్షాలు నినాదాలు, ఆందోళనలకు వేదికగా మార్చాయని వ్యాఖ్యానించడంతో విపక్షసభ్యులు తీవ్రస్వరంతో నినాదాలు చేశారు. విరాళాల దొంగలు అంటూ నినాదాలు చేయడంతో రిజిజు మరోసారి కల్పించుకున్నారు. ‘కాంగ్రెస్, సమాజ్‌వాదీ, కమ్యూనిస్టు పారీ్టలకు శ్రీరాముడిపై విశ్వాసం లేదు, రాముడిని విశ్వసించని వారే ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు.

వీరంతా ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాముడిని కించపరిచిన వీళ్లు క్షమాపణ చెప్పి మాట్లాడాలి’’అని రిజిజు డిమాండ్‌ చేశారు. ఈయనకు అధికార కూటమి సభ్యులు వంతపాడారు. దీంతో వీళ్లకు పోటీగా విపక్ష ఎంపీలు నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో సభను చైర్మన్‌ మధ్యాహ్నం 12 గంటలకు తర్వాత 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభం అయ్యాక సైతం విపక్షాల ఆందోళనల మధ్యే పలు బిల్లులను సభ ఆమోదించింది. మంగళవారం పార్లమెంట్‌ ప్రాంగణంలో ఇండియా కూటమికి చెందిన ప్రతిపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించారు.  

రాజ్యసభలో జనన, మరణాల నమోదు బిల్లు ఆమోదం
న్యూఢిల్లీ: జనన, మరణాల నమోదు(సవరణ)బిల్లు,2026కు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లుకు గత శుక్రవారమే లోక్‌సభలో ఆమోదించగా మంగళవారం రాజ్యసభలోనూ బిల్లుకు మోక్షం లభించింది. అయోధ్యలో రామమందిరంలో కోట్లాది విలువైన విరాళాలు చోరీకి గురైన ఉదంతంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్వయంగా రాజ్యసభలో ప్రకటన చేయాలని మంగళవారం విపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తుండగా ఆ నినాదాల మధ్యే ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

ఉద్దేశపూర్వకంగా తప్పుడు జనన, మరణ తేదీలను చాలా ఆలస్యంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ పాస్‌పోర్ట్, స్కూల్‌ అడ్మిషన్, ఓటర్‌ కార్డ్, ఆధార్‌ అనుసంధానం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వారసత్వం, పెన్షన్, చట్టపరమైన రక్షణలను పొందాలని చూస్తున్న వారి ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం జననమరణాల చట్టం,1969లోని 13(3) సెక్షన్‌కు సవరణ చేస్తూ కొత్త బిల్లు తెచ్చింది.

కొత్త బిల్లు ప్రకారం రెండేళ్లు దాటిన జనన, మరణాల నమోదుకు తొలుత ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ‘‘పుట్టే ప్రతి బిడ్డ జననం రికార్డుల్లో నమోదుకావాల్సిందే. మరణించే వ్యక్తి వివరాలూ నమోదుకావాలి. లేదంటే అతను ఘోస్ట్‌ ఓటరుగా కొనసాగుతూ బుజ్జగింపు రాజకీయాలకు పావుగా పనికొస్తాడు’’అని బిల్లుపై చర్చ సందర్భంగా హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వ్యాఖ్యానించారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement