మూడేళ్లలో 401 రెడ్‌కార్నర్ నోటీసులు జారీ
వివరాలను వెల్లడించిన కేంద్ర హోం శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్ర నేరాలకు పాల్పడిన విదేశాలకు పరారైన 274 మంది నేరగాళ్లను తిరిగి రప్పించినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. 2019 నుంచి ఈ ఏడాది జూలై వరకు మొత్తం 36 దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరిపి వీరిని తీసుకొచ్చామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంలో ఐబీ, సీబీఐ, రా, ఎన్‌ఐఏ, ఈడీ, విదేశాంగ శాఖ, ఎన్‌సీబీ, డీజీజీఐ, రాష్ట్ర పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపింది.
అప్పట్లో ఏడాదికి నలుగురే..
విదేశాలకు పారిపోయిన నేరస్తులను తిరిగి తీసుకు వచ్చే అంశాన్ని గత ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని తెలిపింది. అప్పట్లో నేరగాళ్ల అప్పగింతకు సంబంధించి భారత్ కేవలం 37 దేశాలతో మాత్రమే ఒప్పందాలు చేసుకుందని తెలిపింది. 2004–13 మధ్య కాలంలో ఏడాదికి కేవలం నలుగురు నేరస్తులను మాత్రమే రప్పించగలిగిందని, 110 అప్పగింత అభ్యర్థనలు పెండింగ్‌లో ఉండిపోయాయని వివరించింది.
అమల్లోకి పలు చట్టాలు
పరారీలో ఉన్న నేరగాళ్ల సమస్య దేశ సార్వభౌమాధికారం, ఆర్థిక స్థిరత్వం, శాంతిభద్రతలు, జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న అంశంగా మోదీ ప్రభుత్వం భావించిందని వివరించింది. నేరగాళ్లను తిరిగి తీసుకు వచ్చేందుకు గ్లోబల్ ఆపరేషన్స్, రోబస్ట్ కో–ఆర్డినేషన్, స్మార్ట్ డిప్లొమసీ అనే మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తోందని పేర్కొంది. 2018లో తీసుకొచ్చిన ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ చట్టం, 2019లో ఎన్‌ఐఏ (సవరణ) చట్టం, యూఏపీఏ (సవరణ) చట్టంతోపాటు 2024లో అమల్లోకి వచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాల్లో పరారీలో ఉన్న నిందితులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు చేర్చినట్లు పేర్కొంది.
భారత్‌పోల్ ఏర్పాటు
ఇంటర్‌పోల్ మాదిరిగా కేంద్రం 2025 జనవరిలో భారత్‌పోల్‌ను ప్రారంభించింది. దీంతో, సీబీఐ, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాల యాలు, జిల్లా పోలీసు కార్యాలయాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 1,400కు పైగా విభాగాలను ఒకే వేదికపై అనుసంధానం వీలైదంది. దీంతో సమాచార మార్పిడి సమయం గణనీయంగా తగ్గిందని, గతంలో 20 రోజుల వరకు పట్టే సమాచారం ఇప్పుడు 10 రోజుల్లోపే అందుబాటులోకి వస్తోందని పేర్కొంది.
పెరిగిన రెడ్ కార్నర్ నోటీసుల జారీ
ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు 2022లో 40, 2023లో 100, 2024లో 107, 2025లో 112 జారీ కాగా, 2026లో ఇప్పటివరకు 182 నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. మూడేళ్లలో మొత్తం 401 మంది కోసం రెడ్ కార్నర్ నోటీసులిచ్చినట్లు తెలిపింది. విదేశాల్లో పేర్లు, గుర్తింపులు మార్చుకుని దాక్కున్న నేరగాళ్ల గుర్తింపునకు ప్రత్యేకంగా ఆపరేషన్ త్రిశూల్‌ను చేపట్టినట్లు హోంశాఖ వెల్లడించింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టు విచారణలను నిర్వహించడం వల్ల అప్పగింత ప్రక్రియ వేగం పుంజుకుందని తెలిపింది.


