ఉక్రెయిన్‌లో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. కూరగాయలు విక్రయిస్తున్న ఓ సాధారణ పౌరుడిని డ్రోన్ వెంటాడి దాడి చేసిన వీడియోను ఉక్రెయిన్ విడుదల చేసింది. చేతులు జోడించి ప్రాణాలు కాపాడాలని వేడుకున్నా.. డ్రోన్ అతడిని వెంబడించింది. చివరకు అతని మీద పడిపోయి పేలినట్లు వీడియోలో కనిపిస్తోంది.
వీడియోలో ఓ వ్యక్తి వీధిలో పరుగులు తీస్తూ డ్రోన్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. డ్రోన్ అతడిని చుట్టుముట్టి వెంటాడగా.. అతడు ఓ వాహనం చుట్టూ తిరుగుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు డ్రోన్ అతడి సమీపంలో పేలినట్లు కనిపించింది. ఈ దాడిలో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడని తెలుస్తోంది. అయితే అతడికి గాయాలయ్యాని.. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాడని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.
Today, many were shocked by yet another video of the drone “safari” Russians are carrying out against civilians in Kherson. A Russian drone deliberately hunted down a man selling vegetables and detonated right next to him. The Russians even admitted to the crime, showing zero… pic.twitter.com/uGjC7esFwR
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 4, 2026
ఈ ఘటనను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను ఉపయోగించడం యుద్ధ నేరమని పేర్కొంది.ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇది రష్యా డ్రోన్ దాడికి నిదర్శనమని ఆరోపించారు. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖెర్సన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. అయితే ఇది సరిగ్గా ఎప్పుడు జరిగిందనేది మాత్రం ఆయన వెల్లడించలేదు.
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహా దీనిని “కిరాతక చర్య”గా అభివర్ణిస్తూ.. పౌరులను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై రష్యా ఇంకా స్పందించలేదు.
యుద్ధ ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. సాంకేతిక ఆయుధాలు సాధారణ పౌరుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయనే ఆందోళనలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాజాగా ఉక్రెయిన్ రష్యా భూభాగంలో జరిపిన దాడుల్లో.. చిన్నారులు సహా పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. ఓ వైపు యుద్ధం కొనసాగుతుండగా.. మరోవైపు పౌరులపై దాడుల ఆరోపణలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.


