Strategic Oil Reserve
-
నో టెన్షన్.. భూగర్బ రహస్య గుహల్లో చమురు నిల్వలు
పశ్చిమాసియా యుద్ధం భారతదేశ చమురు పరాధీనతను కళ్లకు కట్టింది. విదేశాల నుంచి ముడిచమురు, ద్రవరూప పెట్రోలియం గ్యాస్, ద్రవరూప సహజవాయువు దిగుమతులు హఠాత్తుగా ఆగిపోతే భారత్ కష్టాలకడలిలో పడిపోవడం ఖాయమని వార్తలు వినవస్తున్నాయి. ఈ పరిస్థితిని చాన్నాళ్ల క్రితమే ఊహించిన భారత్ ముందుజాగ్రత్తగా భారీ స్థాయిలో పెట్రో ఉత్పత్తులను నిల్వచేసుకునే రహస్య భూగర్భ నిల్వ కేంద్రాలను నిర్మించుకుంది. వీటిల్లో మిలియన్ల మెట్రిక్ టన్నుల కొద్దీ ముడిచమురు ఉత్పత్తులను దాచిపెడుతోంది.భారత్ తన 90 శాతం ముడిచమురు, 60 శాతం ఎల్పీజీ, 50 శాతం సీఎన్జీ (CNG) అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ సరకును నిల్వచేసుకోవడంపై దృష్టిసారించింది. ఈ కారణంగానే హార్మూజ్ జలసంధి వంటి కీలక చమురు సరఫరా మార్గాలు మూతబడినా వెంటనే కంగారుపడకుండా తన చమురు నిల్వలను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ వంటి దేశాలు ఏకంగా లాక్డౌన్ ప్రకటించి చేతులెత్తేసి చేష్టలుడిగి చూస్తున్నాయి.మూడు చోట్ల మహా గుహలు! చమురు ఉత్పత్తుల దిగుమతులు ఆగిపోయాయనే దిగులుతో భారత్ నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, తమిళనాడులోని పాడూర్‌లో కేంద్రప్రభుత్వం మూడు భూగర్భ రహస్య నిల్వకేంద్రాలను నిర్వహిస్తోంది. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో పదేళ్ల క్రితమే 4 కోట్ల బ్యారెళ్ల ముడిచమురును నిల్వచేసే భారీ భూగర్భ కేంద్రాన్ని నిర్మించారు.ఇందులోని ముడిచమురు (Crude Oil) పది రోజులపాటు యావత్ భారతదేశ అవసరాలను తీర్చగలదు. బాంబు, డ్రోన్ దాడులను తట్టుకునేలా అత్యంత లోతులో వీటిని నిర్మించారు. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, చమురు ఒలికిపోవడం వంటి లీకేజీ సమస్యలూ ఇక్కడ దాదాపు ఉండవు. గతంలోలాగా ఒకటి రెండు దేశాలపై ఆధారపడకుండా ఏకంగా 40 దేశాల నుంచి ముడిచమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఏదో ఒకటి రెండు దేశాలు యుద్ధసంక్షోభంలో చిక్కుకున్నాసరే మిగతా దేశాల నుంచి నిరాటంకంగా దిగుమతులు కొనసాగే ఏర్పాట్లు భారత్ చేసుకుంది.అంతర్జాతీయ చమురు సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశంతో తాత్కాలికంగా రష్యా చమురును కొనేందుకు భారత్‌కు అమెరికా అనుమతి ఇవ్వడంతో వేగంగా భారత్ పావులు కదిపింది. దక్షిణాసియాలో ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన 30 మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్ కొనుగోలుచేసింది. దీనికితోడు గత పది రోజుల్లోనే ఒక్క అంగోలా నుంచే 34 లక్షల బ్యారెళ్ల ముడిచమురును భారత్ కొనేసింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి మరో 19 లక్షల బ్యారెళ్ల చమురు కొనుగోలుచేసింది. ఇలా వచ్చిన సరకును వీలైనంత వరకు భూగర్భం కేంద్రాల్లో దాచేస్తోంది. ఎల్పీజీ స్టోరేజీ సైతం ఊపందుకుంది.అరకిలోమీటర్ లోతులో..కర్ణాటకలోని మంగళూరులో (Mangaluru) ఏర్పాటుచేసిన స్టోరేజీ సామర్థ్యం ఏకంగా 80,000 టన్నులు. ఇది అరకిలోమీటర్ లోతులో ఉంది. ఇదిగాక విశాఖపట్నంలో మరో ఎల్పీజీ నిల్వకేంద్రం ఉంది. దీని సామర్థ్యం 60,000 టన్నులు. ఇవిగాక మరికొన్ని రహస్య భూగర్భ రాతి గుహలను నిర్మించి మరింత ఎక్కువ చమురును నిల్వచేయాలని కొన్ని నెలల క్రితం పార్లమెంట్లో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను తమిళనాడులోని పాడూర్‌లోనూ దాచేస్తోంది. ఒడిశాలోని ఛందీఖోల్‌లో మరో దానిని నిర్మించనున్నారు.చదవండి: సిలిండర్లు దాచారో.. జైలుకే!భూగర్భ గుహలు అనేవి వ్యూహాత్మకంగా సురక్షితమైనవి. భూమి మీది నిల్వకేంద్రాల నుంచి ఎండాకాలంలో కొంతమేర పెట్రో ఉత్పత్తులు వేడికి ఆవిరవుతాయి. భూగర్భంలో ఆ నష్టభయం ఉండదు. యుద్ధకాలంలో తొలిసారిగా స్వీడన్లో ఈ ప్రణాళికను అమలుచేశారు. తర్వాత ఫిన్లాండ్, జపాన్, దక్షిణకొరియా తదితర దేశాలు ఇదే బాటలో పయనించాయి. 1990లో గల్ఫ్ యుద్ధం నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో భారత్ ఈ అండర్‌గ్రౌండ్ స్టోరేజీలకు అంకురార్పణ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చమురు ధరలకు భారత్ చెక్!
న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా మండుతున్న ముడిచమురు ధరలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకు వీలుగా అత్యవసర వినియోగానికి పక్కనపెట్టే చమురు నిల్వల నుంచి 5 మిలియన్ బ్యారళ్లను విడుదల చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా యూఎస్, చైనా, జపాన్ బాటలో నడవనుంది. దేశ చరిత్రలోనే తొలిసారి కేంద్ర ప్రభుత్వం 3.8 కోట్ల బ్యారళ్ల(5.33 మిలియన్ టన్నులు) ముడిచమురును నిల్వ చేసింది. ఇందుకు తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో ఏర్పాటు చేసిన భూగర్భ బిలాలను వినియోగించుకుంది. వీటి నుంచి తాజాగా నిర్ణయించిన 5 మిలియన్ బ్యారళ్ల చమురును విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో 1.33 మిలియన్ టన్నులు, కర్ణాటకలోని మంగళూరులో 1.5 మిలియన్ టన్నులు, పాడూర్‌లో 2.5 మిలియన్ టన్నులు చొప్పున చమురు స్టోరేజీలున్నాయి. కాగా.. దేశీయంగా రోజుకి 4.8 మిలియన్ బ్యారళ్ల చమురును వినియోగిస్తుండటం గమనార్హం! అమెరికా రెడీ ప్రపంచ ఇంధన ధరలు తగ్గేందుకు వీలుగా నిల్వల నుంచి చమురును విడుదల చేయవలసిందిగా గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో గత వారం యూఎస్ ప్రభుత్వం అభ్యర్థించింది. ఇందుకు ప్రపంచంలోనే చమురును అత్యధికంగా వినియోగించే దేశాలు చైనా, ఇండియా, జపాన్ తదితరాలనుద్ధేశించి కలసికట్టుగా వ్యవహరించాలంటూ సూచించింది. చమురు ఉత్పత్తిని పెంచమంటూ పలుమార్లు చేసిన అభ్యర్థనలను పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య(ఒపెక్), తదితర దేశాలు తిరస్కరించిన నేపథ్యంలో యూఎస్ వినియోగ దేశాలకు చమురు విడుదలకు సూచించింది. ఇందుకు మార్గదర్శకత్వాన్ని వహిస్తూ 50 మిలియన్ బ్యారళ్లను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ బాటలో వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వుల నుంచి 5 మిలియన్ బ్యారళ్ల విడుదలకు భారత్ సైతం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఇతర ప్రధాన వినియోగ దేశాలతో చర్చల ద్వారా భారత్ ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు వివరించాయి. చమురు వినియోగంలో భారత్ ప్రపంచంలోనే మూడో పెద్ద దేశంగా నిలుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా 72.7 కోట్ల బ్యారళ్ల చమురును నిల్వ చేయగా.. జపాన్ 17.5 కోట్ల బ్యారళ్ల చమురును రిజర్వులో ఉంచుతోంది. సహేతుకంగా లిక్విడ్ హైడ్రోకార్బన్ల ధరలు సహేతుకంగా, బాధ్యతాయుతంగా ఉండాలని బలంగా విశ్వసిస్తున్నట్లు ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మార్కెట్ శక్తులు ధరలను నిర్ణయించవలసి ఉన్నట్లు అభిప్రాయపడింది. చమురు ఉత్పాదక దేశాలు డిమాండ్ కంటే తక్కువగా సరఫరాలను కృత్రిమంగా సర్దుబాటు చేయడంపై పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేసింది. ఇది ధరల పెంపునకు దారితీస్తున్నట్లు పేర్కొంది. అయితే చమురు విడుదల తేదీని వెల్లడించనప్పటికీ రానున్న 7–10 రోజుల్లోగా నిర్ణయానికి వీలున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యూహాత్మక రిజర్వుల నుంచి పైపులైన్లు కలిగిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్(ఎంఆర్‌పీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్)కు చమురును విక్రయించనున్నట్లు పేర్కొన్నాయి. అమెరికా ప్రకటన... వాషింగ్టన్: దేశ వ్యూహాత్మక రిజర్వుల నుంచి 5 కోట్ల బ్యారళ్ల చమురు విడుదలకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా నిర్ణయించినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తద్వారా అమెరికన్ల ఇంధన వ్యయాలను తగ్గించనున్నట్లు తెలియజేసింది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఇండియా, జపాన్, చైనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యూకేలతో సంప్రదింపుల తదుపరి బైడెన్ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడుతున్న సమయంలో తగినంత చమురు సరఫరాలు లేకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి ఇతర దేశాలతో బైడెన్ చర్చలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. ఈ అంశంపై కొద్ది వారాలుగా ఇతర దేశాలతో నిర్వహిస్తున్న చర్చలు వెల్లడవుతున్న నేపథ్యంలో ధరలు 10% దిగివచ్చినట్లు ఈ సందర్భంగా తెలియజేసింది. ఇటీవల గ్యాస్ ధరలు గ్యాలన్‌కు 3.4 డాలర్లను తాకినట్లు పేర్కొంది. ఇది ఏడాదిక్రితం ధరలతో పోలిస్తే 50% అధికమని తెలియజేసింది. ధరలు దిగివస్తాయ్.. ప్రపంచంలోనే చమురును అత్యధికంగా వినియోగించే దేశాలు యూఎస్, చైనా, భారత్ తదితరాలు చేతులు కలపడంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివచ్చే అవకాశమున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరాల్లో కోతలకు వ్యతిరేకంగా యూఎస్, భారత్ అత్యవసర నిల్వల నుంచి చమురును దేశ వ్యవస్థలలోకి విడుదల చేయనుండటంతో ధరలకు కొంతమేర చెక్ పడే వీలున్నట్లు తెలియజేశాయి. చమురు సరఫరాలు పెరిగితే.. దిగుమతులను తగ్గించుకోవలసి ఉంటుంది. దీంతో ముడిచమురుకు తాత్కాలికంగా డిమాండ్ తగ్గనుంది. వెరసి ధరలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు కోవిడ్–19 పరిస్థితుల నుంచి బయటపడుతున్న నేపథ్యంలో తగినంత చమురు సరఫరాలు లేకపోవడం పలు దేశాలలో అసంతృప్తికి కారణమవుతున్నట్లు యూఎస్ ప్రభుత్వం తాజాగా వ్యాఖ్యానించింది. డిమాండుకు తగిన రీతిలో సరఫరాలను పెంచమంటూ చమురు ఉత్పత్తి, ఎగుమతి(ఒపెక్) దేశాలను అభ్యర్థించినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇంధన వినియోగ ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలు ఏకంకావడంతో ధరలు బలహీనపడే అవకాశమున్నట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
వాహనదారులకు శుభవార్త.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
రోజు రోజుకి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలను తగ్గించడం కోసం అమెరికా, జపాన్ వంటి ఇతర దేశాల తరహాలోనే అత్యవసర వ్యూహాత్మక నిల్వ కేంద్రాల నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును వెలికి తీయాలని భారతదేశం యోచిస్తున్నట్లు ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని అన్నారు. భారతదేశం, జపాన్‌తో సహా ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థ గల దేశాల సహకారంతో ముడి చమురు అత్యవసర స్టాక్‌ను విడుదల చేయడానికి అమెరికా ప్రణాళిక వేసింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది. భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరంలో మూడు ప్రదేశాలలో ఉన్న భూగర్భ చమురు కేంద్రాలలో సుమారు 38 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును నిల్వ చేస్తుంది. ఇందులో నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెల్స్ విడుదల చేయడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియ 7-10 రోజులలో ప్రారంభం కానున్నట్లు ఆ అధికారి తెలిపారు. వ్యూహాత్మక నిల్వలకు పైప్ లైన్ ద్వారా అనుసంధానించిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్)లకు స్టాక్స్ విక్రయించనున్నారు. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే!) భారత్, అమెరికా, జపాన్, చైనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా వంటి దేశాలు ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యవసర చమురు నిల్వల కేంద్రాల నుంచి ముడి చమురు ఒకేసారి బయటకి తీయడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అత్యవసర చమురు నిల్వల కేంద్రాల నుంచి ముడి చమురును విడుదల చేయాలని అమెరికా ఈ దేశాలను కోరినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చమురు ఉత్పత్తి దేశాలు కావాలనే కృత్రిమ సృష్టించడం పట్ల భారతదేశం పదేపదే ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ధరలు పెరగడం, ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది అని ఒక ప్రకటనలో గతంలో తెలిపింది. (చదవండి: 5 నిమిషాల ఛార్జ్‌తో 4 గంటల ప్లేబ్యాక్ హెడ్‌ఫోన్స్‌ను లాంచ్ చేసిన సౌండ్‌కోర్..!) -
విశాఖలో వ్యూహాత్మక చమురు నిల్వకు ఏర్పాట్లు పూర్తి
పాట్నా: విశాఖలోని వ్యూహాత్మక ఆయిల్ రిజర్వ్‌లో ఈ నెల నుంచి ముడిచమురును నిల్వ చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన ముడి చమురును ఇరాక్ నుంచి తెప్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. వైజాగ్‌లో ప్రాథమికంగా 1.3 మిలియన్ టన్నుల క్రూడ్‌ను నిల్వ ఉంచవచ్చని, క్రమంగా దీన్ని 5 మిలియన్ టన్నులకు పెంచనున్నట్లు మంత్రి వివరించారు. ఒకవేళ ఏవైనా అనూహ్య పరిణామాలు ఎదురైనా దేశీయంగా వినియోగానికి సంబంధించి కనీసం 13 రోజుల అవసరాలకు ఈ నిల్వలు సరిపోగలవని ఆయన తెలిపారు.


