కొటొనౌ: పశ్చిమ ఆఫ్రికా దేశం బెనిన్‌లో ఆదివారం జరిగిన తిరుగుబాటు యత్నం విఫలమైంది. ఆదివారం, డిసెంబర్ 7వ తేదీ ఉదయం కొందరు సైనికులు దేశాన్ని, రాజ్యాంగ సంస్థలను అస్థిరపరిచేందుకు ప్రయత్నించారు. అయితే, బెనిన్ సైనిక బలగాలు, వాటి నాయకత్వం, తమ ప్రమాణానికి కట్టుబడి ఉన్నాయి. దేశం కోసం నిలబడ్డాయి. కుట్రను భగ్నం చేశాయి’అని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అంతకుముందు, మిలటరీ కమిటీ ఫర్ రీ¸ఫౌండేషన్ అని చెప్పుకుంటూ కొందరు సైనికులు ప్రభుత్వ టీవీలో తిరుగుబాటు ద్వారా ప్రభుత్వాన్ని రద్దు చేశామని ప్రకటించుకున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ పాస్కల్ టిగ్రిని మిలటరీ కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు తెలిపారు. అధ్యక్ష భవనం పరిసరాల్లో కాల్పులు శబ్దాలు వినిపించాయి. ఈ పరిణామాల నడుమ అధ్యక్షుడు పాట్రిస్ టలోన్ ఎక్కడున్నారనేది తెలియరాలేదు.
కొద్దిసేపు ప్రభుత్వ టీవీ, రేడియో సిగ్నళ్లు ఆగిపోయాయి. అనంతరం ప్రసారాలు తిరిగి మొదలయ్యాయి. బెనిన్‌లో తిరుగుబాటు వార్తలపై ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్(ఎకోవాస్) స్పందించింది. బెనిన్‌లోని పాస్కల్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించింది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచి్చంది. 2016 నుంచి అధికారంలో కొనసాగుతున్న పాస్కల్ వచ్చే మార్చిలో అధ్యక్ష ఎన్నికల అనంతరం వైదొలగాల్సి ఉంది.
1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన బెనిన్‌లో తరచూ తిరుగుబాట్లు జరుగుతున్నాయి. 1991 నుంచి దేశంలో స్థిరత్వం నెలకొంది. టలోన్ పార్టీకి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రొమువాల్డ్ వడగ్ని వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలున్నాయి. ప్రతిపక్ష నేత రెనాడ్ అగ్బొజోకు తగినంత మంది మద్దతు తెలపలేదనే కారణంతో అధికారులు అనర్హుడిగా ప్రకటించారు.
2024లో తిరుగుబాటుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై టలోన్ సన్నిహితులిద్దరికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గత నెలలో దేశ పార్లమెంట్ అధ్యక్షుడి పదవీ కాలాన్ని ఐదు నుంచి ఏడేళ్లకు పెంచింది. అయితే, రెండు పర్యాయాలు మాత్రమే పనిచేయాలనే నిబంధన విధించింది. మరో పశ్చిమాఫ్రికా దేశం గినియా బిస్సావులో ఇటీవల సైనిక తిరుగుబాటు జరగడం తెల్సిందే.


