
ఆక్రా: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాకు చేరుకున్నారు. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామానీ మహామా ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారు. కొటోకా ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో మోదీకి ఘన స్వాగతం లభించింది. సైనికులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఘనా ప్రభుత్వాధి నేతలతో మోదీ సమావేశ మవుతారు. భారత్–ఘనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చిస్తారు.
ప్రధాని మోదీ ఘనాలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. అలాగే గత మూడు దశాబ్దాల్లో భారత ప్రధాని ఘనాలో అడుగుపెట్టడం కూడా ఇదే తొలిసారి. ఇండియా నుంచి బయలుదేరే ముందు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. గ్లోబల్ సౌత్‌లో భారత్‌కు ఘనా అత్యంత విలువైన భాగస్వామి అని పేర్కొన్నారు. ఘనా పర్యటన అనంతరం ఆయన ఈ నెల 3, 4వ తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టోబాగోలో, 4, 5వ తేదీల్లో అర్జెంటీనాలో పర్యటిస్తారు. తర్వాత బ్రెజిల్‌లో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. చివరగా నమీబియాలో పర్యటించి, స్వదేశానికి చేరుకుంటారు.