breaking news
disability pension
-
పింఛన్‌దారుల్లో టెన్షన్!
సాక్షి, అమరావతి: అనర్హుల పేరుతో నెల రోజులుగా కూటమి ప్రభుత్వం లక్షల సంఖ్యలో పంపుతున్న నోటీసులతో పింఛన్ లబ్ధిదారుల్లో కలకలం రేగుతోంది. నేడు పింఛన్ డబ్బులు అందుతాయో లేదో అంతు చిక్కక నోటీసులు అందుకున్న వారిలో గందరగోళం నెలకొంది. దివ్యాంగులు కానివారికి, దొంగలకు పింఛన్లు ఇస్తున్నారని... పెన్షన్లు తొలగిస్తామని స్వయంగా సీఎం చంద్రబాబే ఈ ప్రచారానికి తెర తీయడంతో వాటినే నమ్ముకుని బతుకీడుస్తున్న కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.గతంలో వైద్యులే ధ్రువీకరించి ఇచ్చిన సర్టీఫికెట్లు ఇప్పుడు చెల్లవని చెప్పడం ఏమిటని నివ్వెరపోతున్నారు. ఆయా లబ్ధిదారుల పెన్షన్లు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వారికి పంపుతున్న నోటీసుల్లోనే తేల్చి చెబుతోంది. దీంతో ఒకటో తారీఖు వచ్చిందంటే.. గతంలో సంతోషంగా పెన్షన్ల కోసం ఆరాటంగా ఎదురు చూసిన గ్రామాల్లో ఇప్పుడు ఆందోళన తాండవిస్తోంది. ఈ ప్రభుత్వం ఎవరి పింఛన్ ఎగరగొట్టిందోననే ఆదుర్దా నెలకొంది. లక్ష పింఛన్లపై కత్తి..! నెలనెలా చేతికందే పింఛను డబ్బులనే నమ్ముకుని జీవిస్తున్న దివ్యాంగులతో టీడీపీ కూటమి సర్కారు పూటకో రకంగా ఆటలాడుకుంటోంది. రాష్ట్రంలో మొత్తం 7.86 లక్షల మంది దివ్యాంగ పింఛను లబ్ధిదారుల్లో 5.50 లక్షల మందికి కొత్తగా వైద్య పరీక్షలు నిర్వహించగా దాదాపు లక్ష మంది అనర్హులుగా నిర్ధారణ అయినట్లు చెబుతుండటంతో నెల రోజులుగా కంటిపై కునుకు లేకుండా గడుపుతున్నారు. నోటీసులు అందుకున్న వారంతా సోమవారం చేపట్టనున్న సెపె్టంబరు నెల పింఛన్ల పంపిణీలో తమ చేతికి డబ్బులు అందుతాయో లేదో అనే భయాందోళనలో ఉన్నారు. 2024 ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ హయాంలో ఇచ్చిన పింఛన్లతో పోలిస్తే టీడీపీ కూటమి సర్కారు వచ్చాక గత 15 నెలలలోనే ఏకంగా దాదాపు నాలుగున్నర లక్షల మేర పెన్షన్లు తగ్గిపోవడం గమనార్హం. 2011 జన గణన ప్రకారమే 12.19 లక్షల మంది దివ్యాంగులు.. కేంద్ర ప్రభుత్వం చివరిసారి దేశవ్యాప్తంగా నిర్వహించిన జనగణన వివరాల ప్రకారం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 12,19,785 మంది దివ్యాంగులున్నారు. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ప్రస్తుతం మొత్తం దివ్యాంగులకిచ్చే పింఛన్లు 7,86,091 మాత్రమే. గత జనగణన నాటికి నాలుగేళ్ల వయసులో ఉన్నవారికి ప్రస్తుతం 18 ఏళ్లు నిండి ఉంటాయి. అంటే రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల్లో మూడో వంతు కంటే ఎక్కువ మందే ఇంకా పింఛన్లు పొందడం లేదని స్పష్టమవుతుంది. అయితే రాష్ట్రంలో పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగుల్లో పెద్ద సంఖ్యలో అనర్హులు ఉన్నారంటూ సీఎం చంద్రబాబు స్వయంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. పింఛన్లను ఎగరగొట్టేందుకే రీ వెరిఫికేషన్ చేపట్టి దీన్ని ప్రచారంలోకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. పంపిణీపై సందిగ్ధం.. అనర్హుల పేరిట దాదాపు లక్ష మంది దివ్యాంగ పింఛనుదారులకు నోటీసులు జారీ చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం సెపె్టంబరు నెలలో వారి పింఛన్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అయితే ప్రతి చోటా దివ్యాంగ పింఛన్‌దారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతుండడంతో ఉలిక్కిపడింది. పింఛన్ల పంపిణీ చేపట్టే సెర్ప్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ నోటీసులిచ్చిన వారికి తిరిగి వైద్య పరీక్షలు జరిగి కొత్తగా అర్హులుగా తేలితే పింఛను పునరుద్ధరణ ఉంటుంది.. అప్పటిదాక ఆగిపోతుందని చెప్పారు. అయితే పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా పంపిణీ చేయనున్నట్లు టీడీపీ అనుకూల మీడియాకు లీకులిచ్చింది. దీంతో నోటీసులు అందుకున్న లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది.చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం కొత్త వెంకటాపురంలో నివసించే గురజాల గోపినాయుడు చిన్నతనంలో పోలియో సోకడంతో రెండు కాళ్లు కోల్పోయాడు. ఊహ కూడా తెలియని వయసులో అతడి భవిష్యత్తుతో విధి ఆడుకుంది. తండ్రి దేవేంద్రనాయుడు పొలంలో పాము కాటుకు గురై రెండు కళ్లు కోల్పోయాడు. తల్లి జయమ్మకు వెన్నెముక సమస్యతోపాటు సరిగా వినపడదు.ఆ కుటుంబంలో ముగ్గురి వద్దా వైద్యాధికారులు ధ్రువీకరించిన సదరం సర్టీఫికెట్లు ఉన్నాయి. దేవేంద్రనాయుడు, గోపినాయుడు దశాబ్దాలుగా పింఛన్లు పొందుతుండగా వాటిని తొలగిస్తున్నట్లు ఇటీవల అధికారులు నోటీసులు పంపారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వద్ద చిన్నబంకు నిర్వహిస్తున్న దివ్యాంగుడు గోపినాయుడును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు బెదిరించి వెళ్లగొట్టారు. ఇటు బతుకు దెరువుకోల్పోయి.. అటు పింఛన్లు రద్దై ఎలా బతకాలో అంతుబట్టడం లేదని ఆ కుటుంబం చిత్రవధకు గురవుతోంది. జగన్ హయాంలో సులభంగా సదరం సరిఫికెట్ల జారీ.. దివ్యాంగులకు అర్హత ఉండి పింఛను పొందాలంటే ముందుగా వైకల్యాన్ని నిర్ధారిస్తూ వైద్యులు సదరం సర్టీఫికెట్లు జారీ చేయాలి. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఇది పెద్ద ప్రహసనంగా ఉండేది. దీనికి హాజరు కాలేక, ఆ తిప్పలు పడలేక టీడీపీ పాలనలో చాలా మంది దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు పొందలేకపోయారన్న విమర్శలున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివ్యాంగ పింఛన్ల మంజూరులో కీలకమైన సదరం సర్టీఫికెట్ల జారీ ప్రక్రియను సరళతరం చేశారు. అర్హులైన వారికి సదరం సర్టీఫికెట్ల జారీకి వీలుగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి మూడు నెలలకు స్లాట్లను విడుదల చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల్లో బుకింగ్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది.సదరం సర్టీఫికెట్ల జారీ పెరగడంతో అర్హులైన దివ్యాంగులు కొత్త పింఛను పొందడానికి వీలు ఏర్పడింది. దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పింఛన్ల మంజూరు, ధ్రువపత్రాల జారీలో గత ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా 29.51 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గతంలో ప్రకటించింది. ఎప్పటికప్పుడు కొత్త పింఛన్లు మంజూరు చేస్తూ నిరంతర ప్రక్రియగా చేపట్టింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 2.07 లక్షల మంది దివ్యాంగులకు కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నాలుగు రోజుల క్రితం స్వయంగా విలేకరుల సమావేశంలోనే చెప్పారు. తల్లిదండ్రులు లేరు ఆపై వైకల్యంవైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో ఉంటున్న సాకె సాయిలక్ష్మి పుట్టుకతోనే మూగ, చెవుడు బాధితురాలు. కంటి చూపులో లోపాలున్నాయి. 15 ఏళ్ల క్రితమే ఆమె తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడంతో చిన్నాన్న రామాంజనేయులు వద్ద ఉంటోంది. 2005 నుంచి ఆమెకు దివ్యాంగ పింఛన్ వస్తోంది. కూటమి ప్రభుత్వం సాయిలక్ష్మీ పింఛన్‌ను తొలగిస్తూ నోటీసు పంపింది. స్పష్టంగా మూడు శారీరక లోపాలు ఉన్నప్పటికీ రీ వెరిఫికేషన్ పేరుతో వైకల్యం 20 శాతమేనంటూ నిర్ధారించడం గమనార్హం. కాలు తొలగించారు అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కుడ్డంగి (గాలగొండ)లో నివసిస్తున్న గిరిజనుడు పూజారి నానాజీ నాయుడుకి ముల్లు గుచ్చుకుని సెప్టిక్ కావడంతో కాలు తొలగించారు. ఆయనకు 90 శాతం అంగవైకల్యం ఉన్నట్లు 2022 ఆగస్టులో వైద్యులు ధ్రువీకరిస్తూ సర్టీఫికెట్ జారీ చేశారు. అప్పటి నుంచి రూ.6 వేలు పెన్షన్ పొందుతున్నాడు. గత ప్రభుత్వంలోనే ఆ కుటుంబానికి ఇల్లు కూడా మంజూరు కావడంతో కొంత భాగం నిర్మాణం కూడా జరిగింది. తాజాగా రీ వెరిఫికేషన్ అనంతరం ఆయనకు 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉందని, పింఛన్ తొలగిస్తున్నామంటూ ఆగస్టు 14న జి.మాడుగుల ఎంపీడీవో నోటీసు జారీ చేశారు. కాలు తొలగించినా.. వైకల్యం తాత్కాలికమట.. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు మండలం సాతానువారిపాళేనికి చెందిన దివ్యాంగుడు అశోక్‌కుమార్‌కు ఓ ప్రమాదంలో కాలు పూర్తిగా దెబ్బ తినడంతో తొలగించారు. ఒంటి కాలిపై ఊత కర్ర సాయంతో కాలం వెళ్లదీస్తున్నాడు. ఆయనకు 59 శాతం వైకల్యం ఉందంటూ 2015లో జిల్లా ఆస్పత్రి నుంచి సదరం సర్టిఫికెట్ ఇవ్వడంతో దివ్యాంగ పింఛన్ పొందుతున్నారు. రీ వెరిఫికేషన్ అనంతరం ఆయన పింఛన్ రద్దు చేస్తున్నట్లు కూటమి సర్కారు ప్రకటించింది. మోకాలి వరకు ఒక కాలు పూర్తిగా తొలగించినా.. అది తాత్కాలిక వైకల్యమని నోటీస్‌లో పేర్కొనడం పట్ల ఆ కుటుంబం నివ్వెరపోతోంది. తానెలా బతకాలంటూ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆక్రోశిస్తున్నాడు.23 ఏళ్లుగా ఘనాహారం లే దు..విశాఖ జిల్లా ఆనందపురం మండలం ముచ్చర్ల పంచాయతీకి చెందిన చెరుకూరి గున్నేష్ పుట్టుకతోనే ఉలుకు పలుకు లేకుండా మంచానికే పరిమితమయ్యాడు. 23 ఏళ్లుగా ఘనాహారం తీసుకున్నది లేదు. ఆహారం గొంతు దిగని కారణంగా నిత్యం పాలే ఇస్తుంటారు. 2008లో వైఎస్సార్ హయాం నుంచి దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నాడు. ప్రస్తుతం రూ.6 వేలు వస్తుండగా దాన్ని హఠాత్తుగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. రోజుకు నాలుగు లీటర్లు పాలు ఆహారం కింద ఇచ్చేందుకు నెలకు దాదాపు రూ.9 వేలు దాకా ఖర్చు అవుతోంది. ఇంట్లోవారినే గుర్తించలేక మంచాన పడ్డ పిల్లాడి పెన్షన్ ఆపడం ఈ ప్రభుత్వం చేస్తున్న పాపం కాదా? అని నానమ్మ సన్యాసమ్మ ప్రశి్నస్తోంది. మంచంలోనే అన్నీ.. 40 శాతమే వైకల్యమంట!ఈ ఫొటోలో కనిపిస్తున్న ఎనిమిదేళ్ల చిన్నారి బధిరుడు.. ఆపై అంగవైకల్యం.. మతిస్థిమితం లేదు. మల మూత్రాలు వచ్చినా చెప్పలేడు. మంచంలోనే అన్నీ.. నాలుగేళ్లుగా దివ్యాంగ పింఛన్ పొందుతుండగా 90 శాతం ఉన్న వైకల్యాన్ని ప్రభుత్వం ఇటీవల 40 శాతానికి మార్చేసింది. ఏకంగా పింఛన్‌ను ఎత్తివేస్తున్నట్లు నోటీసు ఇవ్వడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గంగపాలెం గ్రామానికి చెందిన మొగల్ షబ్బీర్, సోనీ దంపతుల దయనీయ పరిస్థితి ఇదీ! తమ కుమారుడు మొగల్ మహమ్మద్ రసూల్‌ను పుట్టుకతోనే వైకల్యం వెంటాడితే కూటమి సర్కారు పింఛన్ తొలగించి పొట్టగొడుతోందని కూలి పనులకు వెళ్లి జీవిస్తున్న ఆ కుటుంబం ఆక్రోశిస్తోంది. కుడికాలు, చెయ్యి పనిచేయవుబాపట్ల మండలం కొండు»ొట్లవారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన మల్లెల మనోజ్ పుట్టుకతోనే పోలియో బాధితుడు. కుడి కాలు, చెయ్యి పనిచేయవు. అతడి తల్లిదండ్రులు వలస కూలీలు. 70 ఏళ్ల వయసున్న నాయనమ్మ, చెల్లిపైనే ఆధారపడి రోజువారీ పనులు చేసుకోవాలి. అన్నం తినడంతోపాటు చిన్నచిన్న పనులన్నీ ఎడమ చేతితోనే. మనోజ్‌కు 76 శాతం వైకల్యం ఉన్నట్లు గతంలో తెనాలి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరణ పత్రం ఇవ్వగా అతడికి 18 శాతం వైకల్యం మాత్రమే ఉన్నట్లు ఇటీవల సదరం సర్టీఫికెట్ జారీ అయింది. నీ పింఛన్ తొలగిస్తున్నామంటూ తాజాగా ప్రభుత్వం నుంచి నోటీసు రావడంతో మనోజ్ మానసికంగా కుంగిపోతున్నాడు. పెన్షనే ఆధారం..మంచానికే పరిమితమైన 60 ఏళ్ల షేక్ జిలానీ ఆరేళ్ల క్రితం పక్షవాతానికి గురి కావడంతో కాలు, చేతులు పని చేయకుండా పోయాయి. కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా మంచం పైనుంచి లేవలేని పరిస్థితి. వితంతువు కావడంతో జిలానీ కుమార్తె కూడా తన పిల్లలతో కలసి ఆయన వద్దే ఉంటోంది. నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెంలో ఓ చిన్న ఇంట్లో ఉంటున్న వీరందరికీ ఆయన పెన్షనే ఆధారం. ఇన్నాళ్లూ రూ.15 వేలు పెన్షన్ పొందుతుండగా కూటమి ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరుతో వైకల్యాన్ని 59 శాతానికి తగ్గించి పెన్షన్ రూ.6 వేలకు కుదిస్తున్నట్లు నోటీసు పంపడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. వైకల్యం ఆపై హృద్రోగంశ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం లుకలాం గ్రామానికి చెందిన పిల్ల చిన్నబాబుకు ఎడమ కాలు, చేయి పనిచేయదు. దీనికి తోడు గుండె ఆపరేషన్ జరిగింది. ఆయనకు 80 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరిస్తూ గతంలో వైద్యులు సదరం సర్టీఫికెట్ ఇచ్చారు. మూడేళ్ల నుంచి ఆయనకు దివ్యాంగ పింఛను వస్తోంది. ఆ డబ్బులే వారికి జీవనాధారం. రీ వెరిఫికేషన్ అనంతరం పింఛన్ రద్దు చేస్తామని తాజాగా ప్రభుత్వం నోటీసులు పంపడంతో ఆ కుటుంబంలో కలకలం రేగుతోంది. శారీరక ఎదుగుదల లేదుఅన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం కందుకూరుకు చెందిన ఈ బాలిక పేరు షేక్ కురవపల్లి ఆరీఫా. జన్యుపరమైన లోపాలతో జని్మంచింది. శరీరంలో సత్తువ లేదు. మెడ నిలబడదు. నడుములు పని చేయవు. ఎక్కడ పడుకోబెడితే అక్కడే ఉంటుంది. మాటలు కూడా రావు. తొమ్మిదేళ్ల వయసు వచ్చినా శారీరక ఎదుగుదల లేదు. ఆ చిన్నారికి వంద శాతం వైకల్యం ఉండటంతో ఇన్నాళ్లూ రూ.15 వేల దివ్యాంగ పింఛన్ అందేది. ఇటీవల రీవెరిఫికేషన్లో భాగంగా దాన్ని రద్దు చేసి రూ.6 వేల పింఛన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు నోటీసులు ఇచ్చారు. పుట్టుకతోనే మనోవైకల్యంఅనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామానికి చెందిన ఈ బాలుడి పేరు అరుణ్ తేజ్. పుట్టుకతోనే మానసిక వైకల్యం బారిన పడ్డాడు. జీవితాంతం అలాగే ఉంటుందని డాక్టర్లు నిర్ధారించారు. అరుణ్ తేజ్‌కు తోడుగా ఇంట్లో ఇప్పటికీ ఎవరో ఒకరు ఉండాల్సిందే. గత ప్రభుత్వంలో మానసిక దివ్యాంగుడి కోటాలో నెలకు రూ.3,000 పింఛన్ వచ్చేది. ఇప్పుడు 40 శాతం కన్నా తక్కువ వైకల్యం ఉందని, పింఛన్ తొలగిస్తున్నామంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా మానవత్వం లేదా? అని ఆ కుటుంబం వాపోతోంది. -
దివ్యాంగులకు మళ్లీ పింఛన్ ‘పరీక్షలు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులకు ఈ నెల 23 నుంచి అసలు సిసలు కష్టాలు మొదలుకానున్నాయి. ఇప్పటివరకూ దీర్ఘకాలిక, తీవ్ర అనారోగ్యంతో పింఛన్లు పొందుతున్న వారి ఇంటివద్దకే డాక్టర్లను పంపి వైద్యపరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ వారి అర్హతను గుర్తించేందుకు మరోసారి వారిని పరీక్షించనుంది. ఏరియా లేదా జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరీక్షలకు హాజరుకావాలంటూ వారికి నోటీసులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం అన్ని జిల్లాల డీఆర్డీఏ, వైద్యశాఖ అధికారులను ఆదేశించింది.దీంతో రాష్ట్రంలో ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్న 7,87,976 మంది వివిధ కేటగిరీల దివ్యాంగ పింఛనర్లతో పాటు మరో 6,833 మంది కుష్ఠువ్యాధి పింఛన్ లబ్ధిదారులు కనీసం 60–100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏరియా లేదా జిల్లా ప్రభుత్వాసుపత్రులకు వ్యయ ప్రయాసలతో వెళ్లి పరీక్షలకు హాజరుకావాలి. కొన్ని జిల్లాలో సంబంధిత వైద్యులు లేకపోవడం లేదా వైద్య పరికరాలు లేనందున పొరుగు జిల్లాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈనెల 20 నుంచి నోటీసులిచ్చి 23 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. 8,000 మందికి ఇంటివద్దే పరీక్షలు పూర్తి.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లలో కోత పెట్టడమే లక్ష్యంగా 8,18,900 దివ్యాంగ పింఛనుదారుల అర్హతను పరీక్షించేందుకు ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. వీరిలో 24,091 మంది పెరాలసిస్, తీవ్ర కండరాల వ్యాధులతో బాధపడేవారు కాగా.. 7,87,976 మంది దివ్యాంగ పింఛను లబ్ధిదారులు.. 6,833 మంది కుష్టు వ్యాధిగ్రస్తులున్నారు. పెరాలసిస్, తీవ్ర కండరాల వ్యాధులతో బాధపడే వారికి ఈనెల 6 నుంచి వారి ఇంటి వద్దకే వైద్యులు వచ్చి అర్హత పరీక్షలు నిర్వహించే ప్రక్రియ ప్రారంభమైంది. వీరిలో ఇప్పటివరకు 8,010 మందికి పూర్తయ్యాయి.మిగిలిన వారికి ఈనెల 29లోగా పూర్తిచేయనున్నారు. అలాగే, నేత్ర సంబంధిత కేటగిరి లబ్ధిదారులకు ఆసుపత్రుల వద్దే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆయా జిల్లాల అధికారులకు సూచించింది. దీంతో.. ఈనెల 23 నుంచి అన్ని జిల్లాల్లోని 90,302 మంది కంటిచూపు సమస్యతో బాధపడుతున్న లబ్ధిదారులతో పాటు 1,09,232 మంది వినికిడి లోపం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఆర్థో సంబంధిత పింఛనుదారులకు కూడా ఆయా జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లోనే పరీక్షలు నిర్వహిస్తారు.కొత్త సర్టిఫికెట్ల జారీ తర్వాత రద్దు నోటీసులు.. వైద్య పరీక్షలు పూర్తయిన పింఛనుదారులకు కొత్త సదరం సరి్టఫికెట్ల జారీ నిమిత్తం ప్రభుత్వం వెబ్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచి్చంది. వైద్యులు ఆ వెబ్ అప్లికేషన్లో పరీక్షల వివరాలను నమోదుచేశాక ప్రమాణాల ప్రకారం కొత్త సదరం సర్టిఫికెట్లను లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైనట్లు అధికారులు చెప్పారు. అలాగే, వైద్య పరీక్షలు పూర్తయిన వారికి కొత్త సదరం సరి్టఫికెట్ల జారీ అనంతరం, అర్హత ఆధారంగా పింఛను రద్దు నోటీసులు జారీచేస్తామన్నారు. -
మన తెలుగువాడి బయోపిక్
చూపు లేకపోయినా అంట్రప్రెన్యూర్‌గా విజయం సాధించిన మన తెలుగువాడు శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ఫస్ట్‌లుక్ వైరల్ అయ్యింది. రాజ్ కుమార్ రావు శ్రీకాంత్ పాత్ర పోషిస్తున్నాడు. పుట్టుకతో అంధత్వం వెంటాడినా విజయాలు అందుకోవడానికి అది అడ్డుకాదని నిరూపించిన తెలుగు పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ‘శ్రీకాంత్’ ఫస్ట్‌లుక్ విడుదలైంది. మంచి నటుడిగా పేరు గడించిన రాజ్‌కుమార్ రావు శ్రీకాంత్ పాత్రను పోషిస్తుండటం విశేషం. మచిలీపట్నంలో జన్మించిన శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదువు విషయంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నాడు. అంధుడైన కారణాన ఐఐటీలో సీటు ΄÷ందలేకపోయాడు. అయితే పట్టుదలతో మసాచూసెట్స్ యూనివర్సిటీలో తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా దఖలయ్యి చదువుకున్నాడు. భారత్‌కు తిరిగి వచ్చి పారిశ్రామిక రంగంలో కీర్తి గడించాడు. బొల్లా జీవితం ఇప్పటికే ఎందరికో ఆదర్శం అయ్యింది. వెండితెర మీద ఆయన జీవితం చూసి మరెందరో స్ఫూర్తి ΄÷ందుతారు. తుషార్ హీరానందాని ఈ సినిమా దర్శకుడు. -
సీఎం జగన్ వల్లే మాకు మేలు
పిఠాపురం: కాకినాడ జిల్లా తాటిపర్తికి చెందిన టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యుడు నున్న సత్యనారాయణకు చేనేత పింఛన్, ఆయన మనవరాలికి దివ్యాంగ పింఛన్ వచ్చింది. ఎమ్మెల్యే పెండెం దొరబాబు బుధవారం పింఛన్లు అందించారు. తొలిసారి పింఛన్ అందుకున్న సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం వైఎస్ జగన్ దయ వల్లే తనకు పింఛన్ రావడంతో పాటు తన మనవరాలు వైకల్యాన్ని జయించిందన్నారు. ‘నా మనవరాలు లిఖితశ్రీ పుట్టుక నుంచే దివ్యాంగురాలు(మూగ, చెవుడు). మాది నిరుపేద కుటుంబం. ఆపరేషన్ చేయించాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుందని చెప్పారు. పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా ఆపరేషన్లు చేయించి ఆదుకుంటోందని తెలిసి.. అధికారులను కలిశాను. వారు ఒక చెవికి ఆపరేషన్ మాత్రమే చేస్తామని, సీఎం జగన్‌ను కలుసుకుంటే పూర్తిగా ఆపరేషన్ చేసే అవకాశం ఉందన్నారు. తాను టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యుడిని అయినందున తనకు సాయం చేస్తారో లేదోనని భయపడ్డాను. కానీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు చొరవతో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కష్టాలు చెప్పుకొన్నాం. విపక్ష పార్టీ వాడినని చూడకుండా ఆయన వెంటనే ఎంత ఖర్చయినా పాపకు వినికిడి, మాట వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మా మనవరాలికి చెవులకు ప్రభుత్వమే రూ.14 లక్షలు ఖర్చుపెట్టి ఆపరేషన్ చేయించడమే గాక, ఏడాదిన్నర పాటు ఉచితంగా మందులు కూడా ఇచ్చింది. ఇప్పుడు నా మనవరాలు కోలుకుంది. దానికి సీఎం వైఎస్ జగనే కారణం’ అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. -
కనికరించిన పింఛన్!
పెరవలి: ఆమె పేరు దోనెల కృష్ణవేణి. స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఖండవల్లి. 35 ఏళ్ల వయసున్న ఆమె పుట్టుకతో దివ్యాంగురాలు(మూగ,చెవుడు). అవివాహితురాలైన ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. పేద కుటుంబం. తండ్రి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కృష్ణవేణికి వికలాంగ పింఛన్ కోసం ఏళ్ల తరబడి తల్లిదండ్రులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలో వైకల్యం 30 శాతమేనంటూ తిరస్కరించారు. జన్మభూమి కమిటీలు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు ఇక ప్రయత్నాలు మానుకున్నారు. అయితే వీరి విషయం తెలుసుకున్న పెరవలి ఎంపీపీ కార్చెర్ల ప్రసాద్ చొరవ తీసుకుని ఎంపీడీవో రమేష్‌కు చెప్పి కృష్ణవేణి వికలాంగ పింఛన్ దరఖాస్తును ఆన్లైన్ చేయించారు. నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్నాయుడి దృష్టికి కూడా ఈ విషయాన్ని ఎంపీపీ తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఈ దరఖాస్తును తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత దృష్టికి తీసుకెళ్లి పింఛన్ మంజూరు చేయించారు. బుధవారం ఖండవల్లిలో నిర్వహించిన కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తల్లి లక్ష్మీపార్వతితో కలసి కృష్ణవేణి పింఛన్ అందుకుంది. ఆ సమయంలో తల్లీ కూతుళ్ల ముఖాల్లో చెప్పలేని ఆనందం తొణికిసలాడింది. సభలో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ‘ఈ రాష్ట్రానికి జగనే సీఎంగా ఉండాలి.. అప్పుడే మాలాంటోళ్లకి మేలు జరుగుతుంది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. -
అంతా హంబక్, ఓ నటన!
సాక్షి, న్యూఢిల్లీ : 1971లో పాక్, భారత్ మధ్య జరిగిన యుద్ధం సందర్భంగా ఎం. బవేజా నాయకత్వంలో భారత సైనిక దళం, పాకిస్థాన్ ఆక్రమించుకున్న జమ్మూ కశ్మీర్‌లోని లడక్ శిబిరాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకుంది. ఇందుకుగాను ఆయనకు ‘వీర్ చక్ర’ అవార్డు లభించింది. అయితే ఈ ఆపరేషన్‌లో ఆయన కాలి వేళ్లను కోల్పోయారు. 2000 సంవత్సరంలో బ్రిగేడియర్‌గా సైన్యం నుంచి రిటైరైన బవేజాకు ప్రస్తుతం 75 ఏళ్లు. ఆయనకు 1971లో అప్పగించిన మిషన్‌ను పూర్తి చేయడానికి కనీసం పది రోజులు కూడా పట్టలేదు. అయితే అంగ వైకల్య పింఛను సాధించేందుకు ఆయనకు 10 ఏళ్లు పట్టింది. పింఛను కోసం కాళ్లరిగేలా ఆఫీసులు చుట్టూ తిరిగిన ఆయన కొత్తగా ఏర్పాటయిన సాయుధ దళాల ట్రిబ్యునల్‌ను 2007లో ఆశ్రయించారు. 2010లో ట్రిబ్యునల్ అంగ వైకల్య పింఛను మంజూరు చేసింది. పింఛను కూడా తీసుకుంటున్నారు. అయితే అంతటితో ఆయన పింఛను కష్టాలు తీరలేదు. 2015లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. పింఛను ఆగిపోయింది. 2016లో సుప్రీం కోర్టు ప్రభుత్వం అప్పీల్ కొట్టి వేసింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రిబ్యునల్ ఓకే చేసిన అంగవైకల్య పింఛన్లను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాదాపు 800 అప్పీళ్లను దాఖలు చేసింది. 2014 నుంచి 2018 మధ్య కాలంలో సుప్రీం కోర్టు అంతకుముందు ప్రభుత్వం దాఖలు చేసిన వాటితో సహా దాదాపు వెయ్యి అప్పీళ్లను కొట్టి వేసింది. ఇంకా కొన్ని విచారణలో ఉన్నాయి. ద్వంద్వ ప్రమాణాలంటే ఇదే మరి సైనికుల అంగవైకల్య పింఛన్లపై దాఖలు చేసిన అన్ని అప్పీళ్లను ఉపసంహరించుకోవాలని, కొత్తగా అప్పీళ్లకు వెళ్లరాదంటూ 2014 సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు అప్పటి బీజేపీ ఉపాధ్యక్షులు స్మృతి ఇరానీ యూపీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాయుధ దళాల ట్రిబ్యునల్ సామర్థ్యాన్ని పెంచుతామని, ప్రభుత్వం నుంచి అప్పీళ్లు లేకుండా సాధ్యమైనంత మేరకు ప్రయత్నిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. అందుకు కట్టుబడి ఉండకుండా 2017 వరకు అప్పీళ్లు దాఖలు చేస్తూనే వచ్చింది. 2015లో ఉన్నతస్థాయి కమిటీ సైనిక దళాల సమస్యలు, పింఛను వ్యవహారాల పరిష్కారం కోసం 2015లో అప్పటి కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పర్రీకర్ రిటైరైన ఉన్నత సైనికాధికారులతో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ 75 సిఫార్సులు చేయగా, అందులో 32 సిఫార్సులను ఆమోదించినట్లు పర్రీకర్ ప్రకటించారు. సైనిక అంగ వైకల్య పింఛన్లపై దాఖలు చేసిన అప్పీళ్లును ఉపసంహరించుకోవడం, కొత్తవి దాఖలు చేయక పోవడం వాటిలో ముఖ్యమైనది. అయినా 2017, జూన్ వరకు అప్పీళ్లు దాఖలవుతూ వచ్చాయి. ఇక అప్పీళ్లను నిలిపి వేస్తున్నట్లు 2017, జూన్ 29వ తేదీతో ‘కేంద్ర సైనిక పింఛనుదారుల సంక్షేమ సంఘం’కు కేంద్ర రక్షణ శాఖ ఓ లేఖ రాసింది. అప్పటి నుంచి కొత్తగా అప్పీళ్లను దాఖలు చేయలేదు. కానీ పెండింగ్‌లో ఉన్న పిటిషన్లలో ఒక్కదాన్ని కూడా ఉపసంహరించుకోలేదు. వాటిని ఉపసంహరించుకునే ఆలోచన కూడా తమకు లేదని ఈ ఏడాది జనవరి నెలలో ఇప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అప్పీళ్లను కొట్టివేసినా పింఛన్లు హుళక్కే సుప్రీం కోర్టు 2015లో పది అప్పీళ్లను కొట్టివేయగా వాటిలో ఇద్దరు సైనికులకు నేటికి పింఛను అందడం లేదు. వారిలో 53 ఏళ్ల లీలా సింగ్ ఒకరు. పంజాబ్‌లోని సంగ్రూర్‌కు చెందిన లీలా సింగ్ 2002లో నాయక్‌గా రిటైర్ అయ్యారు. ఆయన 1994లో ఊరి నుంచి తిరిగివస్తూ ప్రమాదానికి గురవడంతో ఆయన రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ఆయనది పాక్షిక అంగవైకల్యంగా గుర్తించిన సైనిక అధికారులు అయనకు అందుకు తగిన విధులనే అప్పగించారు. రిటైరయిన తర్వాత ఆయన అంగవైకల్య పింఛను కోసం దరఖాస్తు చేసుకోగా విధుల నిర్వహణలో గాయపడ్డ వారికి మాత్రమే పింఛను వర్తిస్తుందన్న కారణంగా కేంద్రం తిరస్కరించింది. ఆయన 2008లో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి విజయం సాధించారు. దాన్ని మళ్లీ కేంద్రం సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా, 2015లో కొట్టివేసింది. అయినప్పటికీ ఆయనకు ఇప్పటికీ పింఛను రావడం లేదు. 2007లోనే ట్రిబ్యునల్ ఏర్పాటు సైనిక సిబ్బందికి సంబంధించిన కేసుల పరిష్కారం కోసం దిగువ కోర్టుల నుంచి హైకోర్టులు, సుప్రీం కోర్టుల వరకు వెళ్లడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతుందన్న కారణంగా ‘సాయుధ దళాల ట్రిబ్యునల్’ను ఏర్పాటు చేయాలని 1999లో కేంద్రం నిర్ణయించింది. అయితే 2007లో అమల్లోకి వచ్చింది. దేశభక్తి బోగస్... అంతా రాజకీయమే! ‘భారత మాతా కీ జై, జై జవాన్ అంతా హంబక్. జాతీయ గీతం పాడితే నిలబడడం అంతా ఓ నటన. గత ప్రభుత్వాలకు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాలకు ఎలాంటి తేడా లేదు. మమ్మల్ని నిజంగా పట్టించుకుంటున్న వారు ఎవరూ లేరు. ప్రస్తుత ప్రభుత్వానిది పూర్తిగా రాజకీయం’ అని ‘మాజీ సైనికుల ఫిర్యాదుల విభాగం అధ్యక్షుడు రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ ఎస్ఎస్ సోహి వ్యాఖ్యానించారు. ‘ఈ మోదీ ప్రభుత్వం జాతీయవాదం గురించి ఉద్బోధ చేస్తోంది. అంగవైకల్య సైనికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సాయుధ దళాల వ్యతిరేక వైఖరే కాకుండా జాతీయవాదానికి కూడా వ్యతిరేకం’ అని ‘మాజీ సైనికుల ఐక్య ఫ్రంట్’ ప్రధాన కార్యదర్శి రిటైర్ట్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ దినేశ్ నైన్ విమర్శించారు. -
పురుషుడికి వితంతు పింఛన్
వరంగల్: పురుషుడికి వితంతు పింఛన్ మంజూరైంది. వరంగల్ నగరంలోని 53వ డివిజన్ దేశాయిపేట ఫిల్టర్ బెడ్ సమీపంలో 11-29-197 ఇంటినంబర్లో నివాసం ఉంటున్న రాజయ్య వికలాంగ పింఛన్ కోసం 5 సార్లు దరఖాస్తు చేసుకున్నాడు. 89 శాతం వికలాంగత్వ సరిఫికెట్నూ దరఖాస్తుతో పొందుపరిచాడు. అధికారులు అతనికి వితంతు పింఛన్ మంజూరు చేయడం గమనార్హం. పింఛన్‌పైనే ఆధారపడి బతుకున్న రాజయ్య పరిస్థితి అర్థం చేసుకొని పింఛన్ సరిచేయాలని బంధువులు కోరుతున్నారు. -
మనసున మనసై.. బతుకున బతుకై..
ఇతడి పేరు మూడ్ బాలరాజు. పద్నాలుగేళ్ల క్రితం కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి నుంచి లారీలో వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. 8నెలల గర్భిణిగా ఉన్న భార్య, మూడేళ్ల కుమారుడు అక్కడికక్కడే మరణించగా.. ఇతడి రెండు కాళ్లూ తీసేయాల్సి వచ్చింది. తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్నారు. వారిపైనే ఆధారపడాల్సి రావడం అతడిని బాధిం చింది. ఎలాగైనా కష్టపడి పనిచేయాలనుకున్నాడు. తనకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చిన మేనకోడలు సంపూర్ణమ్మను వివాహం చేసుకున్నాడు. ఆమె సాయంతో ధైర్యాన్నే ఆయుధంగా చేసుకుని జీవిత పయనంలో ముందుకు వెళుతున్నాడు. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెంకు చెందిన బాలరాజు విజయగాథ అతడి మాటల్లోనే... జంగారెడ్డిగూడెం : ‘మాది చింతలేని చిన్న కుటుంబం. అమ్మానాన్న.. భార్య.. మూడేళ్ల కొడుకు. నెల రోజుల్లో మరో బిడ్డ భూమిపైకి రాబోతోంది. కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఉన్నాం. అంతా కలసి ప్లాస్టిక్ పువ్వులు, పంగల కర్రలు తయారు చేసి సంతల్లో అమ్ముకుంటూ బతికేవాళ్లం. 2000వ సంవత్సరంలో ఓ కుదుపు మా కుటుంబాన్ని చెల్లాచెదురు చేసింది. ప్లాస్టిక్ పువ్వులు, పంగల కర్రలు తయారీఇక అవసరమైన ముడిసరుకు తెచ్చుకునేందుకు 8 నెలల గర్భిణిగా ఉన్న నా భార్య శ్రీదేవి (25), మా మూడేళ్ల కుమారుడు అజయ్‌బాబుతో కలసి తిరుపతి వెళ్లాం. సరుకులు కొనుక్కుని లారీలో ఇంటికి బయలుదేరాం. గుంటూరు సమీపంలో ఆ లారీ చెట్టును ఢీకొట్టింది. నా భార్య శ్రీదేవి, కొడుకు అజయ్‌బాబు అక్కడికక్కడే చనిపోయారు. అపస్మారక స్ధితిలో ఉన్న నన్ను అక్కడి వారు విజయవాడ ఆసుపత్రికి తరలించారు. నా రెండు కాళ్లు తొలగిస్తేనే తప్ప బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. విషయం తెలిసి మా బంధువులంతా వచ్చారు. రూ.3 లక్షలు ఖర్చు చేసి నన్ను బతికించారు. రెండు నెలలపాటు ఆసుపత్రిలో మంచానికే అతుక్కుని ఉండిపోయిన నేను ఎట్టకేలకు కోలుకున్నాను. వృద్ధులైన తల్లిదండ్రులపై ఆధారపడాల్సి వచ్చినందుకు బాధపడ్డాను. ఏవిధంగానైనా కష్టపడి పనిచేసి వాళ్లకు ఆసరాగా నిలబడాలనుకున్నాను. మా అక్కా, బావ చనిపోవడంతో మా మేనకోడలు సంపూర్ణమ్మను మేమే పెంచాం. నా దుస్థితిని చూసిన ఆమె నన్ను పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చింది. పెళ్లయ్యాక నా తల్లిదండ్రులతోపాటు ఆమె కూడా మా కుటుంబం కోసం కష్టపడుతూ వచ్చింది. ఆ పరిస్థితుల్ని చూసి తట్టుకోలేకపోయాను. వారందరినీ నేనే పోషించాలనే దృఢ నిశ్చయానికి వచ్చాను. అశ్వారావుపేటలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో రూ.10 వేలు, తెలిసిన వారివద్ద మరికొంత సొమ్ము అప్పు చేశాను. మూడు చక్రాల మోపెడ్ కొన్నాను. దానిని నడపడం నేర్చుకున్నాను. తిరిగి వ్యాపారం మొదలుపెట్టాను. రాత్రీ పగలనక ప్లాస్టిక్ పువ్వులు, పంగల కర్రలు తయారు చూసి ఊరూరా తిరుగుతూ అమ్ముతున్నాను. ఖర్చులు పోను రోజుకు కనీసం రూ.200 సంపాదిస్తున్నాను. ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. రేషన్ కార్డు, ఉండటానికి ఇల్లు, వికలాంగ పింఛను ఇప్పిస్తే మా కుటుంబానికి ఎంతో మేలు కలుగుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో నాకు ప్రతినెలా పింఛను అందేది. మూడు నెలలుగా ఇవ్వటం లేదు. చివరగా మీకో మాట చెప్పాలి. నా కృషి, పట్టుదల, విజయం.. ఇలా ప్రతి విషయంలోనూ నా భార్య సంపూర్ణమ్మ సహకారం ఎంతో ఉంది. ఆమెకు మాటల్లో కృతజ్ఞతలు చెబితే సరిపోదు. ఆమె రుణం తీర్చుకోలేనిది.’ -
ఇది కాదా ‘వైకల్యం’..?
ఇతని పేరు కడమంచి రాజు(30). వందశాతం వైకల్యం తో నేలపై పాకుతున్న రాజు మెదక్ జిల్లా వాసి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సూరారం సాయిబాబా ఆలయం వద్ద ఉంటు న్నాడు. వికలాంగుల పింఛన్ రాకపోవడంతో భిక్షాటన చేస్తున్నాడు. హైదరాబాద్‌లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఎన్నిసార్లు తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లినా పింఛన్ ఇవ్వడం లేదని వాపోయాడు. రాజు చిన్నాన్న శివయ్యతో కలసి గురువారం సిరిసిల్ల లో భిక్షాటన చేశాడు. రోడ్డుపై తల ను నేలపై ఉంచుతూ ముందుకు కదులుతున్న రాజు దైన్యస్థితి అందరినీ కదిలించింది. - సిరిసిల్ల -
‘ఆధారం’ లేదు..‘ఆసరా’ లేదు!
* పుట్టుకతోనే చేతులు లేని చిన్నారి * చేతివేళ్లు లేనందున ఆధార్ ఇవ్వలేమంటున్న సిబ్బంది * సీఎం జిల్లాలోనే చిన్నారి దీనదుస్థితి నర్సాపూర్: ఈ చిన్నారి పేరు భూలక్ష్మి, వయసు నాలుగేళ్లు. తల్లిదండ్రులు మొగులయ్య, లక్ష్మి. స్వగ్రామం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని అహ్మద్‌నగర్. పుట్టుకతోనే రెండు చేతు లూ లేవు. మొగులయ్య తన కూతురు భూలక్ష్మి కి వికలాంగులకిచ్చే పింఛన్ కోసం ఏడాది నుంచీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. వికలాంగులకిచ్చే పింఛన్ రావాలంటే ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని, అప్పుడే పింఛన్ మంజూ రు చేయిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పా రు. దీంతో మొగులయ్య సదరం క్యాంపు ఏర్పా టు చేసినప్పుడల్లా కూతురిని తీసుకువెళ్లి వికల త్వ పరీక్షలు చేయమంటూ అధికారుల కాళ్లావేళ్లా పడుతున్నాడు. అయితే ఆధార్ లేనిదే ధ్రువీకర ణ పత్రం ఇవ్వలేమని అక్కడివారు చెబుతున్నారు. దీంతో ఆయన ఆధార్ సెంటర్‌కు పలుమా ర్లు తీసుకువెళ్లినా వివరాల నమోదుకు సిబ్బంది అంగీకరించడం లేదు. చేతి వేళ్లు లేనందున తాము ఆధార్ నమోదు చేయలేమని చెబుతున్నా రు. ఈ కారణంతోనే రేషన్‌కార్డులో కూడా భూ లక్ష్మి పేరు నమోదు కాలేదు. శుక్రవారం నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన సదరం క్యాంపునకు భూలక్ష్మిని మళ్లీ తీసుకువెళ్లాడు. అక్కడా చేదు అనుభవమే ఎదురైంది. ఈ సమయంలోనే అక్క డి వచ్చిన జెడ్పీ చైర్పర్సన్ రాజమణిని కలిసి మొగులయ్య తన గోడును వెళ్లబోసుకున్నాడు. అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూ స్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలోని ఈ చిన్నారికి ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందో వేచి చూడాలి మరి. -
ఐదువేల పింఛన్లు గోవిందా!
ప్రగతినగర్ : అధికారుల నిర్లక్ష్యం వికలాంగులకు శాపంగా మారింది. అర్హులైన వికలాంగులు పింఛన్‌కు దూరమవుతున్నారు. బోగస్ పింఛన్లు ఉన్నాయంటూ ప్రభుత్వం 2011లో (సాఫ్ట్వేర్ ఫర్ అస్సెస్మెంట్ ఆఫ్ డిజెబిలిటి యాక్సెస్,రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్) వికలాంగుల వైకల్య నిర్ధారణ కోసం సదరం శిబిరం ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతలను డీఆర్డీఏకు అప్పగించింది. అయితే సదరం శిబిరం నిర్వహణ మొదటి నుంచి అస్తవ్యస్తంగా మారింది. శిబిరం ప్రారంభంకాకముందు జిల్లావ్యాప్తంగా 32,232 వికలాంగుల పింఛన్లు ఉన్నాయి. సదరం శిబిరం ప్రారంభమైన తరువాత పింఛన్లో కోత మొదలైంది. దీంతో సు మారు ఐదు వేల మంది వికలాంగులు అనర్హులం టూ పింఛన్లను తొలగించారు. ప్రస్తుతం 29, 634 మందికి పింఛన్లు అందిస్తున్నారు. అయితే సదరం శిబిరం నిర్వహణను కొన్ని నెలల క్రితం జిల్లా ఆస్పత్రికి బదలాయించారు. నిర్వహణ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తిబాధ్యతలను వారికే అప్పగించారు. ఇక్కడ శిబిరం ప్రారంభం నుంచి 37,113 మందికి పరీక్షలు జరపుగా, 29, 408 మంది వికలాంగులను అర్హులుగా గుర్తించారు. ఇందులో నుంచి సుమారు 25 వేల సదరం సర్టిఫికెట్లు వికలాంగులకు చేరాయని అధికారులు చెబుతుండగా, అది వాస్తవం కాదని వికలాంగులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితం తాము సదరం శిబిరానికి హాజరైనా ఇంతవరకు ధ్రువీకరణ పత్రం అందలేదని పలువురు వికలాంగులు ప్రతి శుక్రవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల సదరం సర్టిఫికెట్ల ఐడీ నంబర్ కంప్యూటకరీంచకుంటే దాదాపు ఐదు వేల మంది అర్హులైన వికలాంగులు పింఛన్ కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా సదరం నిర్వాహకులు మరో నాలుగు వేల సర్టిఫికెట్లు ప్రింటింగ్‌కు ఇచ్చారు. మిగతా ఐదువేల మంది వికలాంగులకు సంబంధించి ఫొటోలు మిస్ చేశారు. దీంతో వారు సదరం శిబిరానికి హాజరైనా ఫలితంలేకుండా పోయింది. ఈ విషయాన్ని డీఆర్డీఏ అధికారులు గోప్యంగా ఉంచి, వికలాంగుల కోసం ఆయ మండలాల్లో వివరాలు సేకరిస్తున్నారు. సర్టిఫికెట్లో ఫొటో లేకుంటే ఇస్తే పింఛన్ రాదు. ఇటీవలే జిల్లా కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో కూడా అధికారులు సదరం సర్టిఫికెట్లు వికలాంగులందరికి అందించామని చెప్పారు. కానీ సర్టిఫికెట్లు వేలల్లో వికలాంగులకు చేరాల్సి ఉన్నా, రహస్యంగా ఉంచి ప్రమాదం మీద కు తీసుకువస్తున్నారు. ఇందులో అప్పటి సీవోలు, ఏంపీఎంల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫొటోలు తీసుకోకుండా లక్ష్య సాధన కోసం తూతూ మంత్రంగా పనిచేయడం ఇప్పుడు 5 వేల మంది వికలాంగులకు శాపంగా మారింది. దీనిని రహస్యంగా ఉంచి గ్రామాల్లో సీఆర్పీలు, సీసీలకు వికలాంగులను గుర్తించే బాధ్యతలను అప్పగించా రు. ఈ నెలాఖరు వరకు సదరంలో హాజరై ఫొటోలు మిస్అయిన వికలాంగులను గుర్తించడానికి గ్రామా ల్లో స్పెషల్ డ్రైవ్టీంలు బయలు దేరాయి. ఈ విషయం ఎక్కడబయటపడుతుందోనని అత్యంత గోప్యంగా ఈ బాగోతాన్ని డీఆర్డీఏ అధికారులు నడిపిస్తున్నారు. నేడు సదరంపై కలెక్టర్ సమీక్ష సదరం శిబిరం నిర్వహణపై బుధవారం జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ, సదరం అధికారులతో సమావేశం కానున్నారు. సదరం శిబిరానికి కేటాయించిన బడ్డెట్,ఇంతవరకు ఎన్ని సదరం ధ్రువీకరణపత్రాలు అందించారు..ఇంకా ఎంత మందికి అందించాలనేది అధికారులతో కలెక్టర్ చర్చించనున్నారు. అలాగే సదరం నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఇటీవల వికలాంగుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. -
ఆ అనుమానాలు నిజమయ్యాయి!: వైఎస్ జగన్
బడ్జెట్ సమావేశాల్లోనే కత్తిరింపుల్ని ఎత్తిచూపిన జగన్ సాక్షి, హైదరాబాద్: నిరుపేదల సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టడానికి ప్రభుత్వం పలు ఎత్తుగడులు వేస్తోందంటూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి పక్ష నేత జగన్మోహన్రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 43,11,688 మం ది వివిధ రకాల పింఛన్లు పొందుతుండగా వీరికి నెలకు రూ.130 కోట్లు చెల్లిస్తున్నారు. అక్టోబర్ నుంచి వృద్ధులు, వికలాంగుల పింఛన్ రూ.వెయ్యికి పెంచిన నేపథ్యంలో ఇప్పటికే పింఛన్ల కోసం పెండింగ్‌లో ఉన్న 15 లక్షల అదనపు దరఖాస్తుల్ని జగన్ ప్రస్తావించారు. ‘‘అక్టోబర్ నుంచి పింఛన్లకు రూ. 431 కోట్లు కావాలి. ఇవికాక 5,36,837 వికలాంగుల పెన్షన్లు రూ.1,500 చొప్పున పెంచితే మరో రూ.10 కోట్లు కావాలి. మొత్తం గా నెలకు రూ.441 కోట్లు చొప్పున వచ్చే ఏడు నెలలకు 3,080 కోట్లు కావాలి. గడిచిన 5 నెలలతో కలిసి మొత్తం రూ. 3,730 కోట్లు కావాల్సి ఉంటే బడ్జెట్లో రూ.1,338 కోట్లు కేటాయించారు. మరి మిగిలిన 2,392 కోట్ల మేరకు కోత పెడతారా? ఆ మేరకు పింఛన్లు ఎగ్గొడతారా?’’ అంటూ అప్పట్లోనే ఆయన ప్రశ్నించారు. 1.4 కోట్ల తెల్లకార్డులకు అమ్మహస్తానికి, అక్టోబర్ నుంచి వచ్చే కొత్త ఫుడ్ పాలసీ అమలుకు రూ.4,671 కోట్లు అవస రం ఉండగా బడ్జెట్లో మాత్రం రూ.2,318 కోట్లు మాత్రమే కేటాయించారు. 2013-14 సంవత్సరానికి స్కాలర్షిప్లు, రీయింబర్స్‌మెంటు కోసం రూ.2,487 కోట్లు అవసరం. గతేడాది బకాయిలు రూ.990 కోట్లు. హైదరాబాద్‌లో చదివే విద్యార్థులకు మరో 200 కోట్లు కావాలి. మొత్తంగా రూ. 3,700 కోట్లు అవసరం ఉండగా బడ్జె ట్లో రూ.2,100 కోట్లే కేటాయించారు. కోతలకు సర్కారు సిద్ధమైందని జగన్ విమర్శించారు. పథకాలన్నిటినీ ఆధార్‌కు లింక్ చేస్తున్నామనే పేరుతో కోతలకు దిగుతుండటంతో ప్రతిపక్ష నేత అనుమానాలన్నీ నిజమవుతున్నాయనేది రాజకీయ వర్గాల మాట. -
వికలాంగుల పింఛన్ రూ. వెయ్యికి పెంచుతాం
వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి పలాస రూరల్, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే వికలాంగులకు వెయ్యి రూపాయల పింఛన్‌ను ఇస్తారని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. పలాస పెద్దవీధిలో శనివారం ఆమె 17, 19వ వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేయనున్న బళ్ల ఉష, నాగరాణిపాత్రోకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులకు ప్రస్తుతం అందజేస్తున్న రూ.200లు పింఛన్‌ను రూ. 700లకు పెంచుతామన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరిస్తామని, నిరుపేద రైతులకు ఎకరా భూమి పంపిణీ చేస్తామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్ర ప్రజలు దిక్కులేని స్థితిలో ఉంటే వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేశారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ విజయం ఖాయమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు, పలాస అసెంబ్లీ సమన్వయకర్త వజ్జ బాబూరావు, పట్టణ, మండల కన్వీనర్లు బళ్ల గిరిబాబు, కుప్పిలి కామరాజు,మాజీ కౌన్సిలర్ డబ్బీరు భవానీశంకర్, యవ్వారి మోహన్‌రావు, దుర్గాప్రసాద్పాత్రో, సాసుమాన చంద్రమౌళి, చింతాడ మాధవరావు పాల్గొన్నారు.