ఫైటర్‌ జెట్లను పెంచుతాం! | Prioritises indigenous capabilities, joint operations and restoration, New IAF | Sakshi
Sakshi News home page

ఫైటర్‌ జెట్లను పెంచుతాం!

Nov 2 2026 6:14 AM | Updated on Nov 2 2026 6:14 AM

Prioritises indigenous capabilities, joint operations and restoration, New IAF

తేజస్, ఆమ్కా వంటి దేశీయ ప్రాజెక్టులకు ప్రోత్సాహం 

త్రివిధ దళాల సమన్వయాన్ని ఇనుమడింప జేయడం 

‘వాయు’దార్శనికత.. ఇవే ప్రాథామ్యాలు 

ఏఐఎఫ్‌ నూతన అధిపతి అశుతోష్‌ దీక్షిత్‌ వెల్లడి

న్యూఢిల్లీ: భారత వైమానిక దళాని(ఐఏఎఫ్‌)కి మంజూరైన యుద్ధ విమానాలను పూర్తి స్థాయిలో తిరిగి సమకూర్చుకోవడం, తేజస్, అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌(ఆమ్కా)వంటి దేశీయ ప్రాజెక్టులను ప్రోత్సహించడం తన ప్రాథామ్యాలని ఐఏఎఫ్‌ చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌ చెప్పారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని ఇనుమడింపజేయడం కూడా ఇందులో ఒకటని ఆయన వివరించారు.

 ‘వాయు’దార్శనికతలో భాగాలైన నిరంతర అప్రమత్తత, కార్యాచరణ సంసిద్ధత(విజిలెన్స్, ఆపరేషనల్‌ రెడీనెస్‌), ఆత్మనిర్భరత, యుద్ధ తంత్రంలో వినూత్న ఆలోచనలు, సాంకేతిక ఆవిష్కరణలు, త్రివిధ దళాల సమన్వయం, ఉమ్మడి భాగస్వామ్యంపై ప్రధానంగా దృష్టి సారిస్తానన్నారు. శనివారం ఐఏఎఫ్‌ 29వ అధిపతిగా అశుతోష్‌ దీక్షిత్‌ బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. ఆదివారం ఆయన రేస్‌ కోర్స్‌ ఎయిర్‌ పోర్స్‌ స్టేషన్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో గౌరవ వందన స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 

యుద్ధ విమాన పైలెట్‌గా 3,500 గంటల అనుభవం కలిగిన దీక్షిత్‌..‘తేజస్‌ ఎంకే1ఏ, 2తోపాటు ఆమ్కా, దేశీయంగా తయారయ్యే సెన్సార్లతోపాటు ఇతర ఆయుధ సామగ్రిని సమకూర్చుకోడానికి ప్రాముఖ్యత ఇస్తానని చెప్పారు. యుద్ధరంగంలో ఎదురయ్యే సవాళ్లకు దేశీయపరమైన పరిష్కారాలను కనుగొంటామని వివరించారు. పోరాడి గెలవడం మన బాధ్యత, అదే సమయంలో అత్యంత నమ్మదగిన వైమానిక శక్తి ద్వారా శత్రువు వెనక్కి తగ్గేలా బలమైన నిరోధక శక్తిగా ఉంటూ సంఘర్షణను నివారించడం కూడా అవసరమేనని ఆయన వివరించారు. 

‘వైమానిక దళానికి 42 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు మంజూరు కాగా, ప్రస్తుతం వీటి సంఖ్య 30కి తగ్గిపోయింది. తిరిగి 42 స్క్వాడ్రన్ల ఫైటర్‌ జెట్లను తక్షణం సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’అని దీక్షిత్‌ అన్నారు. రక్షణ పరంగా మనం కొత్త శక్తుల్ని సమకూర్చుకోవడం నేడు తప్పనిసరి అంశంగా మారిందని చెప్పారు. నూతన సాంకేతికతలు, డ్రోన్లు, లాంగ్‌ రేంజ్‌ ఆయుధాలు, స్పేస్, సైబర్, ఏఐ, ఎలక్ట్రోమాగ్నెటిక్‌ రంగం.. ఇలాంటి వాటితో యుద్ధక్షేత్ర స్వభావమే మారిపోయిందని ఆయన వెల్లడించారు. 

పోరాడి, గెలుపు సాధించాలటే వచ్చే దశాబ్ద అవసరానికి అనుగుణంగా భారత వైమానిక శక్తి మార్పులు సంతరించుకోవడం తప్పనిసరని తెలిపారు. తాజాగా బాధ్యతల నుంచి వైదొలగిన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ సేవలను దీక్షిత్‌ కొనియాడారు. ఏపీ సింగ్‌ నాయకత్వంలో ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఐఏఎఫ్‌ కచ్చితమైన, నిర్ణయాత్మకమైన పోరాట పటిమను చాటిందని దీక్షిత్‌ పేర్కొన్నారు. అధిక–స్థాయి సన్నద్ధతలో ఉన్న దళాన్ని తనకు అప్పగించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన దీక్షిత్‌..గౌరవ వందనం స్వీకార కార్యక్రమానికి ముందుగా తల్లి నిర్మలా దీక్షిత్, అత్త కమలా పాండేల పాదాలకు నమస్కరించి, ఆశీస్సులు తీసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement