ఆకట్టుకున్న ఎయిర్‌షో  | PM Narendra Modi attended the Indian Air Force air show | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ఎయిర్‌షో 

Oct 26 2026 1:55 AM | Updated on Oct 26 2026 1:55 AM

PM Narendra Modi attended the Indian Air Force air show

తిలకించిన ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్, ఆనందీ బెన్, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ 

వారణాసి: సొంత నియోజకవర్గం వారణాసిలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) ఆదివారం నిర్వహించిన భారీ ఎయిర్‌ షోను ప్రధాని మోదీ స్వయంగా హాజరై తిలకించారు. ‘వింగ్స్‌ ఆఫ్‌ గాంజెస్‌’పేరుతో నమోఘాట్‌ వద్ద జరిగిన ఈ షోలో కీలకమైన ఐఏఎఫ్‌ బృందాలు గంగా నదిపై ఆకాశంలో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలను ప్రదర్శించాయి. 

ఐఏఎఫ్‌ 94వ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులపాటు కొనసాగిన విన్యాసాలకు ఆఖరు రోజైన ఆదివారం ప్రధాని మోదీతోపాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, యూపీ గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హాజరయ్యారు. తెల్లని ఎయిర్‌ ఫోర్స్‌ క్యాప్, నల్ల కళ్లద్దాలు ధరించి ప్రధాని మోదీ దాదాపు గంటపాటు కొనసాగిన విన్యాసాలను తిలకించారు. 

ఈ విన్యాసాల్లో సుఖోయ్‌–ఎంకేఐ, దేశీయంగా రూపుదిద్దుకున్న తేజస్, ఎల్‌సీహెచ్‌ ప్రచండ్‌ యుద్ధ విమానాలతోపాటు, హెలికాప్టర్లు పాల్గొన్నాయని ఓ అధికారి తెలిపారు. కాశీ ఫార్మేషన్‌లో భాగంగా మూడు కిరణ్‌ విమానాలు వీ ఆకారంలో ఏర్పడి ఆకాశంలో మువ్వన్నెలను సాక్షాత్కరింపజేయగా, జనం కేరింతలు కొట్టారు. అదేవిధంగా, ఎంఐ–17 హెలికాప్టర్లు జాతీయ జెండాను ఆకాశంలో ఎగురవేసి ఓంకార్‌ ఫార్మేషన్‌తో కనువిందు చేశాయి.

 విన్యాసాల్లో రఫేల్, సుఖోయ్, మిరాజ్‌ 2000, తేజస్, మిగ్‌–29, జాగ్వార్‌లతోపాటు రవాణా విమానం, పలు హెలికాప్టర్లు పాలుపంచుకున్నాయని, వైమానిక దళం కార్యాచరణ సన్నద్ధతను చాటాయని అధికారులు వివరించారు. సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ బృందం, సారంగ్‌ హెలికాప్టర్‌ ఆకాశంలో ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. 

ఈ సందర్భంగా కొందరు త్రివర్ణ పతాకాలను చేబూని భారత్‌ మాతా కీ జై, వందే మాతరమ్‌ అంటూ చేసిన నినాదాలతో గంగా ఘాట్లు ప్రతిధ్వనించాయి. ఎయిర్‌ షోను తిలకించేందుకు వచ్చిన వారి కోసం పలు ప్రాంతాల్లో టెంట్లు ఏర్పాటు చేశారు. మోదీని ఆహ్వానించేందుకు పోలీస్‌ లైన్స్‌ నుంచి నమో ఘాట్‌ వరకు బారులు తీరిన ప్రజలుహర హర మహాదేవ, జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలు ప్రధానిపై పూలవర్షం కురిపించారు. 

ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం లాల్‌ బహదూర్‌ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన హెలికాప్టర్‌లో మిర్జామురాద్‌కు చేరుకున్నారు. మిర్జామురాద్‌ ప్రాంతంలో వస్త్ర తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా 300 మంది మహిళలతో ముచ్చటించారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లోనే పోలీస్‌ లైన్స్‌కు, అటు నుంచి రోడ్డు మార్గంలో నమో ఘాట్‌కు వచ్చారు.  

వారణాసిలో వింగ్స్‌ ఆఫ్‌ గాంజెస్‌ ఎయిర్‌ షోకు హాజరైన ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, గవర్నర్‌ ఆనందీ బెన్, సీఎం యోగి  ∙ విన్యాసాల్లో పాల్గొన్న హెలికాప్టర్‌  ∙ నమోఘాట్‌లో విన్యాసాలను తిలకిస్తున్న ప్రజలు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement