పాట్నా: అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇవ్వడం, తీరా గెలిచాక వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు వెనకంజ వేయడం సర్వసాధారణమైంది. తాజాగా ఇదే కోవలో ఎన్నికల సమయంలో ప్రజలందరికీ ఇచ్చిన 125 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ నుంచి బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఉచితంగా ఇస్తున్న ఆ విద్యుత్‌ను ప్రజలు స్వచ్ఛందంగా వదులుకోవాలని కోరుతుండటం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
బిహార్ రాజధాని పాట్నాలో రెండ్రోజుల పాటు ‘పాటలీపుత్ర నేషనల్ యూత్ పార్లమెంట్ 2.0’ సదస్సు ఘనంగా జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న బిహార్ సీఎం సామ్రాట్ చౌదరి ఈ కీలక అంశంపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో ట్యాక్స్ పేయర్స్ (పన్ను చెల్లింపుదారులు), ఆర్థికంగా ఉన్న ధనికులు తమకు అందుతున్న 125 యూనిట్ల ఉచిత కరెంట్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజల నుంచి భిన్న స్పందనలు
ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి ఇంటికి ఏడాదికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విద్యుత్ సబ్సిడీ రూపంలో చెల్లిస్తోందని, దీనికోసం ప్రభుత్వం ఏటా రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తోందని సామ్రాట్ చౌదరి తెలిపారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుండగా.. ఉచిత కరెంట్‌ను వెనక్కి తీసుకోవాలనే ప్రభుత్వ విజ్ఞప్తిపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి


