చేజర్ల మండలం తూర్పుపల్లి 25వ నంబరు పోలింగ్ కేంద్రంలో 86.91 శాతం పోలింగ్ జరిగినట్లు ఆర్వో వెల్లడించిన మరో నివేదిక
తూర్పుపల్లెలో 104.27 శాతం కాదు.. 86.91 శాతమే
ఇష్టారాజ్యంగా రిగ్గింగ్‌తో దొరికిపోయిన వైనం
తప్పును ఒప్పు చేసేందుకు మరో తప్పిదం
చేజర్ల: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పుపల్లె పోలింగ్ కేంద్రం 25లో టీడీపీ నేతలు బరితెగించి చేసిన రిగ్గింగ్ బట్టబయలు కావడంతో తలలు పట్టుకున్న అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఓట్లే కాదు.. రికార్డులు కూడా తారుమారు చేసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ బూత్‌లో 104.27 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించడం తెలిసిందే. బూత్ వారీగా వెల్లడించిన జాబితాలో స్పష్టంగా 586వ ఓటరు నుంచి 1,171 ఓటరు వరకు మొత్తం 586 మంది ఓటర్లు ఉండగా 611 ఓట్లు పోల్ అయినట్లు 104.27 శాతం పోలింగ్ జరిగినట్లు పేర్కొన్నారు.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో కూటమి నేతలు, పోలింగ్ అధికారులు చరిత్ర సృష్టించడంపై ‘సాక్షి’ పత్రికలో శుక్రవారం ‘వారెవ్వా.. 104.27 శాతం పోలింగ్’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ఖంగుతిన్న టీడీపీ పెద్దలు.. అధికారులపై చిందులు తొక్కినట్లు సమాచారం. దీంతో ఆ తప్పిదాన్ని సరిదిద్దేందుకు మరోసారి తప్పిదానికి పాల్పడ్డారు. ఈ బూత్‌లో 104.27 శాతం కాదు.. 86.91 శాతమే పోలింగ్ జరిగినట్లు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
64.10 నుంచి 80.13 శాతానికి పెరిగిన ఓటింగ్
వాస్తవానికి తూర్పుపల్లె పంచాయతీలో మొత్తం 1,171 ఓట్లు ఉండగా తూర్పుపల్లి, పుల్లనీళ్లపల్లెలో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. పుల్లనీళ్లపల్లెలో 1వ ఓటరు నుంచి 585 ఓటరు వరకు ఓట్లే వేసే విధంగా, 586 నుంచి 1,171 వరకు ఓటర్లు తూర్పుపల్లిలో ఓట్లు వేసే విధంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం వెల్లడించిన పోలింగ్ నమోదు శాతాల్లో పుల్లనీళ్లపల్లెలో 64.10 శాతం, తూర్పుపల్లెలో 104.27 పోలింగ్ జరిగినట్లు ప్రకటించారు.
అయితే రిగ్గింగ్ అక్రమాలు వెలుగులోకి రావడంతో పుల్లనీళ్లపల్లెలో 1 నుంచి 468 వరకు ఓటర్లు ఉన్నారని.. అక్కడ 80.13 శాతం పోలింగ్ జరిగినట్లు వెల్లడిస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అంటే ఇక్కడ ఏకంగా 16.03 శాతం పోలింగ్ శాతాన్ని పెంచారు. తూర్పుపల్లెలో 469 నుంచి 1,171 ఓటరు వరకు ఓటర్లు ఉన్నారని... ఇక్కడ పోల్ అయిన ఓట్ల లెక్క ప్రకారం 86.91 శాతంగా మార్చేశారు. పుల్లనీళ్లపల్లిలోని ఓటర్లను తెచ్చి తూర్పుపల్లి బూత్‌లో కలిసి.. రికార్డులను కూడా తారుమారు చేశారు.


