
కర్నాటకలో యాప్ ఆధారిత అగ్రిగేటర్లు నడుపుతున్న టూ-వీలర్ టాక్సీ సర్వీసుల కార్యకలాపాలకు నిన్నటి(జూన్16) నుంచి బ్రేకులు పడ్డాయి. కోర్టు తీర్పు.. ప్రభుత్వం నుంచి విధానాల రూపకల్పనపై సరైన స్పందన లభించకపోవడంతో ప్రస్తుతం బైక్ ట్యాక్సీలపై నిషేధం అమలు అవుతోంది. దీంతో లక్ష మంది గిగ్ వర్కర్లపై ప్రభావం పడుతోంది. ఇందులో.. ఇదే తమ జీవనోపాధి అని వాపోతున్నారు వేలమంది రైడర్లు.
కర్నాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం వేలాది మంది రైడర్లను తీవ్రంగా ప్రభావం చేస్తోంది. కాలేజీ ఫీజులు చెల్లించేందుకు బైక్‌లు నడుపుతున్న విద్యార్థుల దగ్గరి నుంచి.. ఉద్యోగాలు పొగొట్టుకున్న టెక్కీల దాకా ఈ సేవలనే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కొందరికి ఇది పార్ట్ టైం జాబ్ కాగా.. మరికొందరికి ఫుల్ టైం ఆదాయం అందించే వనరు.
👉కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువు మధ్యలోనే మానేసిన ఓ యువకుడు మాట్లాడుతూ.. ప్రతీ రైడ్ ఒక కొత్త వ్యక్తిని కలవడానికి కలిగించిన అవకాశం. ఈ ప్రయాణం నా ఒంటరితనాన్ని అధిగమించడంలో సహాయపడింది. నేను ఆనందంగా చేసే పనిలో ఆదాయం కూడా వచ్చింది. అలాంటి ఆదాయ వనరుకు ఇప్పుడు గండిపడింది.
👉ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రాలేదు. బిజినెస్ ప్రారంభించాలన్న కల ఉంది. కానీ నెలవారీ జీతంతో పొదుపు కష్టం. అందుకే బైక్ టాక్సీల వైపు వచ్చాను. టార్గెట్లు లేవు, ఒత్తిడి లేదు, పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ నిషేధం నా వంటి కలలవాళ్లను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అవసరమైతే హైదరాబాద్‌కు మారిపోతాను, కానీ ఈ పని వదలను
:::మహదేవపురకు చెందిన ఇంద్ర శేఖర్(25)
👉బైక్ రైడ్లతో రోజుకు రూ.3,000 సంపాదించేవాడిని. అందులో కనీసం రూ.2,000 పొదుపు చేసేవాడిని. ఈ రోజుల్లో ఖర్చులకు ఫుల్ టైం ఉద్యోగం ఒక్కటే సరిపోవడం లేదు. పెద్ద నగరాల్లో జీవించాలంటే అదనపు ఆదాయం కచ్చితంగా అవసరం. అలాంటి ఆదాయం లేకుండా పోయింది
:::జగదీష్(24), నాన్-ఐటీ ప్రొఫెషనల్
👉సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు సాగర్ బైక్ ట్యాక్సీలతో రైడ్లు కొడుతూ సంపాదించుకుంటున్నాడు. ఈ సేవలు నా జీవన విధానాన్ని మార్చేశాయి. ఇప్పుడు ఒక్కసారిగా ఆగిపోవడం చాలా నిరాశ కలిగిస్తోంది. నా ఆదాయ మార్గం పూర్తిగా కోల్పోయాను. ఇప్పుడు మరో ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అని తెలిపాడు.
👉వైట్‌ఫీల్డ్‌లో నివసించే 27 ఏళ్ల టెకీకి ఇది పార్ట్‌టైం జాబ్. ఆఫీస్ తర్వాత బైక్ టాక్సీ రైడ్లు చేస్తాను. ట్రాఫిక్‌లో ఒంటరితనాన్ని తగ్గించేందుకు ఇది మంచి మార్గం. కానీ, ఇప్పుడది లేకుండా పోతోంది అని అంటున్నాడు.
నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ స్పందన
బైక్ ట్యాక్సీ డ్రైవర్లను ఏదో నేరస్తుల్లాగా పరిగణించడం అన్యాయం. ఇక్కడి ఆర్థిక వ్యవస్థలో మేమూ భాగమే. మమ్మల్ని చర్చ లేకుండానే ఎందుకు బయటకు తోసేస్తున్నారు?. లైసెన్సింగ్, ఇన్సూరెన్స్, భద్రతపై స్పష్టమైన నిబంధనలు కావాలి. లక్షకు పైగా గిగ్ వర్కర్ల జీవనాధారాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి.
ఇప్పటికే నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వినతిపత్రం సమర్పించింది.
తీర్పు ఇలా..
కర్ణాటక వ్యాప్తంగా బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే.. గత శుక్రవారం ( జూన్ 13న) ఉబర్, ఓలా, రాపిడో యాప్ సంస్థలు దాఖలు చేసిన స్టే అభ్యర్థనలను డివిజన్ బెంచ్ తిరస్కరించింది. అయితే, నిబంధనల రూపకల్పనలో పురోగతి కనిపిస్తే స్టే ఇచ్చేందుకు సుముఖత చూపిస్తామని కోర్టు తెలిపింది. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి నిబంధనలను రూపొందించేది లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు జూన్ 24కు వాయిదా వేసింది.
మాకు అవసరం
బెంగుళూరులో నిత్యం తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యను ప్రస్తావిస్తూ అనేకమంది ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫోటోలు, వ్యాఖ్యలతో తమ ఆవేదనను, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాశ్వతంగా ట్రాఫిక్‌తో స్తంభించిపోయే బెంగుళూరుకు బైక్ టాక్సీలు సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రజా రవాణా మార్గాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కోర్టు తీర్పును, ప్రభుత్వవ విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
వా.. ఎన్ను ఐడియా
ఇలాంటి నిర్ణయాలతో సంబంధం లేకుండా తమ దారులు తమకు ఉన్నాయని యాప్ ఆధారిత అగ్రిగేటర్లు అంటున్నాయి. రాపిడో తమ యాప్‌లో 'బైక్' సర్వీసును 'బైక్ పార్శిల్'గా మార్చినట్టు తెలుస్తోంది. ప్రయాణికులు తమను తామే 'పార్శిల్'గా బుక్ చేసుకుని ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నారు. ‘‘రైడ్ బుక్ చేసుకోలేకపోతున్నారా? ఫర్వాలేదు, మిమ్మల్ని మీరే పార్శిల్‌గా పంపించుకోండి. దీనిని 'ప్యాస్ - ప్యాసింజర్ యాజ్ ఏ సర్వీస్' అనొచ్చు" అంటూ ఓ యూజర్ ఇందుకు సంబంధించిన బుకింగ్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. అలాగే.. ఉబెర్ 'మోటో'ను 'మోటో కొరియర్'గా మార్చింది. వా.. ఎన్ను ఐడియా(వా.. ఏం ఐడియా!) తెలివైన ఎత్తుగడ" అని మరో యూజర్ పేర్కొన్నారు.