బిహార్‌లో విద్యార్థులపై కాల్పులు అమానుషం: రాహుల్
న్యూఢిల్లీ: బిహార్‌లో విద్యా రంగంలో సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం, తుపాకులతో కాల్పులు జరపడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. విరిగిన ఎముకలను సరిచేయవచ్చు గానీ చెదిరిపోయిన విద్యార్థుల కలలను పునరుద్ధరించగలరా? అని ప్రధాని మోదీ, బిహార్ సీఎం సామ్రాట్‌లను ప్రశ్నించారు.
బిహార్ విద్యార్థులు, యువతతో తాను ఇటీవల సమావేశమైన వీడియోను రాహుల్ గాంధీ ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. పరీక్షల విధానంలో అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు గళమెత్తినందుకు పోలీసులు లాఠీలతో చావబాదారని, కాల్పులు జరిపారని మండిపడ్డారు. పిల్లలు చేసిన పాపం ఏమిటి? కాల్పులు జరిపేటంత నేరం వారు ఏం చేశారు? అని నిలదీశారు.
బిహార్‌లో ఏకే–47 బుల్లెట్ తాకడంతో ఒక విద్యార్థి కాలి ఎముక విరిగిపోయిందని, దాంతో సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న అతని కల కరిగిపోయిందని రాహుల్‌అన్నారు. మరో ఇద్దరు విద్యార్థుల భుజాల గుండా బుల్లెట్లు దూసుకెళ్లాయని తెలిపారు. విద్యార్థులు నేరస్తులు కాదని తేలి్చచెప్పారు. కుటుంబాల ఆశయాలను మోస్తూ చదువుకోవడానికి బయటకు వచి్చన పేద పిల్లలపై కాఠిన్యం ప్రదర్శించడం ఏమిటని ప్రశ్నించారు. తూటా గాయాలు మానుతాయి గానీ పిల్లల మనసుల్లో లోతుగా పాతుకుపోయిన భయానికి చికిత్స చేసే ఆసుపత్రి ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఛిద్రమైన కలలను మళ్లీ నిలబెట్టగలరా? అని నిలదీశారు.


