రాయితీపై విక్రయించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ
న్యూఢిల్లీ: దేశంలో ఉల్లిపాయల కొరత నానాటికీ పెరిగిపోతోంది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాయితీ అమ్మకాల్లో భాగంగా 17 నగరాల్లో సుమారు 4,000 టన్నుల బఫర్ స్టాక్ ఉల్లిపాయలను విక్రయించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే ఆదివారం తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్ ద్వారా 2026 సంవత్సరం కోసం బఫర్ స్టాక్ కింద 1.21 లక్షల టన్నుల ఉల్లిపాయలను నిల్వ చేసింది. కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో ఉల్లిపాయలను కిలోకు రూ.35 చొప్పున రాయితీ ధరకు ప్రభుత్వం విక్రయిస్తోంది. కాందా ఎక్స్‌ప్రెస్ ద్వారా భారీ సరుకు ఇప్పటికే ఢిల్లీ, చెన్నై నగరాలకు చేరుకుందని, రాబోయే రోజుల్లో గౌహతికి తరలించేందుకు మూడో రైలును చేస్తున్నామని నిధి ఖరే చెప్పారు.
రాయితీపై ఉల్లిపాయల విక్రయాలతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించిందని, బయటి మార్కెట్‌లో ధరలు స్వల్పంగా తగ్గాయని అన్నారు. సెపె్టంబర్ 5న ఢిల్లీలో కిలో ఉల్లిపాయల చిల్లర ధర రూ.58, ముంబైలో రూ.53, చెన్నైలో రూ.63, రాంచీలో రూ.40గా ఉండగా, సగటు టోకు ధర కిలోకు రూ.42.79గా నమోదైంది. కొత్త ఖరీఫ్ ఉల్లి పంట పరిస్థితి ఆశాజనకంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ రెండో వారం నుంచి ఈ పంట మార్కెట్‌కు వస్తుందని, తద్వారా సరఫరాపై ఒత్తిడి తగ్గి, ధరల విషయంలో మరింత ఉపశమనం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.


