ఢిల్లీలో కుప్పకూలిన ఐదు అంతస్తుల హాస్టల్ భవనం
ఐదుగురు విద్యార్థుల మృతి
మరికొందరికి గాయాలు
ఇంకా శిథిలాల కిందే దాదాపు 20 మంది విద్యార్థులు
న్యూఢిల్లీ: ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీలో హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్‌లోని ఓ హాస్టల్ భవనం ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
శిథిలాల కింద దాదాపు 20 మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అన్వేషణ, సహాయక బృందాలు అంచనావేశాయి. రద్దీగా ఉండే ఒక వీధిలోని 30 ఏళ్ల నాటి ఈ ఐదు అంతస్తుల భవనంలో ‘హాస్టల్ డేజ్’ పేరిట పేయింగ్ గెస్ట్(పీజీ) వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. భవన బేస్‌మెంట్‌లో మరమ్మతు పనులు జరుగుతుండగా ఆదివారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో కూలింది.
తాజా వర్షాలతో బేస్‌మెంట్‌లో నీరు చేరి పునాది బలహీనపడిందని, అందుకే కుప్పకూలిందని స్థానికులు చెప్పారు. ప్రమాదం విషయం తెల్సి ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. భవనం కుప్పకూలి విద్యార్థులు మరణించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జీత్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు పోలీసులు వివరించారు. లోపల చిక్కుకున్న వారి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఘటనా స్థలంలో బీజేపీ ఎమ్మెల్యే అనిల్ చెప్పారు.
ఆదివారం కావడం వల్లే తక్కువ ప్రాణనష్టం
కూలిపోయిన భవనంలో దాదాపు 15 గదులు ఉండేవని, ఒక్కో గదిలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు కలిసి ఉండేవారని స్థానికులు తెలిపారు. ఆదివారం సెలవు కావడంతో చాలామంది విద్యార్థులు బయటకు వెళ్లినందున మరణాల సంఖ్య తగ్గిందని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఈ ప్రాంతంలోని ఇతర భవనాల పరిస్థితి, నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సత్య నికేతన ప్రాంతంలో భవనాలను ఐదు, ఆరు అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. చాలా ఇళ్లను బాలుర పీజీలుగా మార్చేసి, యజమానులు వేరే చోటికి తరలిపోతున్నారు. వారు తమ ఇళ్లకు పీజీలని పేరు పెట్టి, ఆన్‌లైన్‌లో అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. భవనాల నిర్వహణ ఎలా
ఉందో కూడా పట్టించుకోవడం లేదు’’ అని రెండు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రియాంక పేర్కొన్నారు.
ప్రధాని మోదీ సంతాపం
ఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. బాధితులకు సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు ఉంటున్న భవనం కూలిపోవడం చాలా బాధాకరమని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆప్తులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వివరించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రాణం విలువైనదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ప్రాణాలకు భరోసా కల్పించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ఈ ఘటనను అత్యంత హృదయ విదారకమైనది, ఆందోళనకరమైనదిగా అభి వరి్ణంచారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సరైన వసతి గృహాలు లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ‘నివారించదగిన విషాదం’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.
శిథిలాల కింద అరుపులు, ఆర్తనాదాలు
ఘటనా స్థలంలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల నుంచి పెద్ద ఎత్తున అరుపులు, ఆర్తనాదాలు వినిపించాయి. తమను కాపాడాలంటూ బాధితులు రోదిస్తూ వేడుకున్నారు. కొందరు ఫోన్లు సైతం చేశారు. లోపల చిక్కుకుపోయిన వారు అక్కడి దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించి మిత్రులకు పంపించారు. బాధితుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శిథిలాల కింద బాధితులు ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్లను జారవిడిచినట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది చెప్పారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక వాహనాలను మోహరించారు. ఈ ప్రాంతంలోని ఇరుకైన వీధుల్లో విద్యార్థుల కోసం హోటళ్లు, పీజీ వసతి గృహాలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న విద్యార్థుల్లో చాలామంది కేరళ, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని, వారు రోడ్డుకు అవతల ఉన్న కాలేజీల్లో చదువుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తుండగా స్థానికులు సహకరించారు. వారు తమ చేతులతో, అందుబాటులో ఉన్న సామగ్రితో బాధితుల కోసం గాలించారు. శిథిలాల కింద పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

కలచి వేసిన వీడియో
హాస్టల్ భవనం కూలిపోగా కాంక్రీటు దిమ్మెల కింద ఓ విద్యార్థి చిక్కుకుపోయి నరకయాతన అనుభవించిన దృశ్యం చూపరులను కలచివేసింది. అతడిపై దుమ్ము పేరుకుపోయింది. ముఖంపై రక్తపు చారలు కనిపించాయి. నుదుటి పక్క నుండి రక్తం కారుతోంది. ఈ వీడియోను ఆత్మరామ్ కాలేజీ విద్యార్థులు షేర్ చేశారు. శిథిలాల కింద నుంచి ‘సేవ్ మీ, సేవ్ మీ’ అనే అరుపులు చాలాసేపు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.


