breaking news
collapsed apartment
-
విద్యార్థుల ఆశలు సమాధి
న్యూఢిల్లీ: ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీలో హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్‌లోని ఓ హాస్టల్ భవనం ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద దాదాపు 20 మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అన్వేషణ, సహాయక బృందాలు అంచనావేశాయి. రద్దీగా ఉండే ఒక వీధిలోని 30 ఏళ్ల నాటి ఈ ఐదు అంతస్తుల భవనంలో ‘హాస్టల్ డేజ్’ పేరిట పేయింగ్ గెస్ట్(పీజీ) వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. భవన బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతుండగా ఆదివారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో కూలింది. తాజా వర్షాలతో బేస్మెంట్లో నీరు చేరి పునాది బలహీనపడిందని, అందుకే కుప్పకూలిందని స్థానికులు చెప్పారు. ప్రమాదం విషయం తెల్సి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. భవనం కుప్పకూలి విద్యార్థులు మరణించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జీత్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు పోలీసులు వివరించారు. లోపల చిక్కుకున్న వారి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఘటనా స్థలంలో బీజేపీ ఎమ్మెల్యే అనిల్ చెప్పారు. ఆదివారం కావడం వల్లే తక్కువ ప్రాణనష్టం కూలిపోయిన భవనంలో దాదాపు 15 గదులు ఉండేవని, ఒక్కో గదిలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు కలిసి ఉండేవారని స్థానికులు తెలిపారు. ఆదివారం సెలవు కావడంతో చాలామంది విద్యార్థులు బయటకు వెళ్లినందున మరణాల సంఖ్య తగ్గిందని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఈ ప్రాంతంలోని ఇతర భవనాల పరిస్థితి, నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సత్య నికేతన ప్రాంతంలో భవనాలను ఐదు, ఆరు అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. చాలా ఇళ్లను బాలుర పీజీలుగా మార్చేసి, యజమానులు వేరే చోటికి తరలిపోతున్నారు. వారు తమ ఇళ్లకు పీజీలని పేరు పెట్టి, ఆన్లైన్లో అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. భవనాల నిర్వహణ ఎలా ఉందో కూడా పట్టించుకోవడం లేదు’’ అని రెండు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రియాంక పేర్కొన్నారు. ప్రధాని మోదీ సంతాపం ఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. బాధితులకు సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు ఉంటున్న భవనం కూలిపోవడం చాలా బాధాకరమని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆప్తులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వివరించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రాణం విలువైనదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ప్రాణాలకు భరోసా కల్పించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ఈ ఘటనను అత్యంత హృదయ విదారకమైనది, ఆందోళనకరమైనదిగా అభి వరి్ణంచారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సరైన వసతి గృహాలు లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ‘నివారించదగిన విషాదం’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.శిథిలాల కింద అరుపులు, ఆర్తనాదాలు ఘటనా స్థలంలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల నుంచి పెద్ద ఎత్తున అరుపులు, ఆర్తనాదాలు వినిపించాయి. తమను కాపాడాలంటూ బాధితులు రోదిస్తూ వేడుకున్నారు. కొందరు ఫోన్లు సైతం చేశారు. లోపల చిక్కుకుపోయిన వారు అక్కడి దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించి మిత్రులకు పంపించారు. బాధితుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శిథిలాల కింద బాధితులు ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్లను జారవిడిచినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక వాహనాలను మోహరించారు. ఈ ప్రాంతంలోని ఇరుకైన వీధుల్లో విద్యార్థుల కోసం హోటళ్లు, పీజీ వసతి గృహాలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న విద్యార్థుల్లో చాలామంది కేరళ, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని, వారు రోడ్డుకు అవతల ఉన్న కాలేజీల్లో చదువుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తుండగా స్థానికులు సహకరించారు. వారు తమ చేతులతో, అందుబాటులో ఉన్న సామగ్రితో బాధితుల కోసం గాలించారు. శిథిలాల కింద పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. కలచి వేసిన వీడియోహాస్టల్ భవనం కూలిపోగా కాంక్రీటు దిమ్మెల కింద ఓ విద్యార్థి చిక్కుకుపోయి నరకయాతన అనుభవించిన దృశ్యం చూపరులను కలచివేసింది. అతడిపై దుమ్ము పేరుకుపోయింది. ముఖంపై రక్తపు చారలు కనిపించాయి. నుదుటి పక్క నుండి రక్తం కారుతోంది. ఈ వీడియోను ఆత్మరామ్ కాలేజీ విద్యార్థులు షేర్ చేశారు. శిథిలాల కింద నుంచి ‘సేవ్ మీ, సేవ్ మీ’ అనే అరుపులు చాలాసేపు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. -
గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన అపార్ట్మెంట్.. 9 మంది దుర్మరణం
మాస్కో: రష్యా ఐలాండ్ సఖాలిన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఐదు అంతస్తుల అపార్ట్మెంట్లోని ఓ బ్లాక్ కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. మరొకరు శిథిలాల కింద చిక్కుకున్నారు. అధికారులు అత్యవసర సేవలు చేపట్టారు. మిగిలిన వ్యక్తిని కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. అయితే అపార్ట్మెంట్లోని బ్లాక్‌లో 20 లీటర్ల వంటగ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. చదవండి: ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్! -
Ukraine-Russia war: ఉక్రెయిన్‌పై రష్యా రాకెట్ దాడి
కీవ్: రష్యా శనివారం రాత్రి ఉక్రెయిన్‌పై జరిపిన రాకెట్ దాడిలో 15 మంది చనిపోయారు. రాకెట్ దాడితో డొనెట్స్క్ ప్రావిన్స్ చాసివ్ యార్ పట్టణంలోని అపార్టుమెంట్ కుప్పకూలింది. శిథిలాల కింద మరో 20 మంది చిక్కుకుని ఉంటారని అధికారులు చెబుతున్నారు. దాడులకు రష్యా విరామం పాటిస్తుందని భావిస్తున్న క్రమంలో తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. జూన్ 21వ తేదీన క్రెమెన్‌చుక్‌లోని షాపింగ్ మాల్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 19 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. సైనిక సంబంధ లక్ష్యాలపైనే దాడులు చేపడుతున్నట్లు చెప్పుకుంటున్న రష్యా తాజా ఘటనపై ఎటువంటి ప్రకటన చేయలేదు. రష్యా అనుకూల వేర్పాటు వాదుల ప్రాబల్యమున్న డోన్బాస్ ప్రాంతంలోని లుహాన్స్క్ ప్రావిన్సుపై పట్టు సాధించిన రష్యా బలగాలు మరో ప్రావిన్స్ డొనెట్స్క్లో పాగానే లక్ష్యంగా కదులుతున్నాయి. ఇలా ఉండగా, ఎటువంటి పోరాట నైపుణ్యం లేని ఉక్రెయిన్ పౌరులతో కూడిన మొదటి బృందం బ్రిటన్‌కు చేరుకుంది. మొత్తం 10 వేల మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యమని యూకే తెలిపింది. -
బెంగళూరులో కూలిన భవనం
-
చూస్తూ ఉండగానే పేక మేడలా..
కర్ణాటక,శివాజీనగర: బెంగళూరులో ఒక భవనం క్షణాల్లో కుప్పకూలింది. మంగళవారం రాత్రి 9:15 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. అందరూ చూస్తూ ఉండగానే పేకమేడలా నేలరాలింది. ప్రమాదాన్ని ఊహించి జనం ముందే భవనాన్ని ఖాళీ చేయడంతో పెద్ద గండం తప్పినట్లయింది. వివరాల్లోకి వెళితే.. నగరం నడిబొడ్డున ఎస్సీ రోడ్డు, కపాలి థియేటర్ వెనుకభాగంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. థియేటర్‌ను కూల్చి కొత్త భవనం నిర్మాణ పనులు చేపట్టారు. పక్కనే నాలుగు అంతస్తుల భవనం ఉండగా దానిని లాడ్జ్, హోటల్‌గా ఉపయోగించేవారు. ఇటీవల భారీ వర్షాలు కురవడం, భవనం సమీపంలోనే కొత్త కట్టడానికి తవ్వకాలు జరుగుతుండడంతో ఈ పాత భవంతి కూలినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటనను కొందరు స్థానికులు తమ మొబైల్ఫోన్లలో చిత్రీకరించగా, వైరల్ అయ్యింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పక్క భవనం ఇంజనీర్ ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మేయర్ గౌతంకుమార్ జైన్ పరిశీలించారు. -
'నా భార్య కనిపించే వరకు పోరాడుతా'
తైవాన్: 'నేను నా భార్యకోసం చూస్తున్నాను. ఆమెను గుర్తించేవరకు అలసిపోను' ఇవి తైవాన్‌లో భూకంపం బారినపడి కుప్పకూలిపోయిన భవంతి శిథిలాలకింద తన భార్యను గాలిస్తున్న ఓ వ్యక్తి మాటలు. తైవాన్ లో భారీ భూకంపం సంభవించి ఓ పెద్ద భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ భవనం శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం కొన ప్రాణంతో తల్లడిల్లుతున్న ఓ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరో 130మంది శిథిలాల కిందే ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 24గంటలుగా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివారం హువాంగ్ కువాంగ్ వెయ్ అనే వ్యక్తిని బయటకు తీశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సైనికులు, స్వచ్ఛంద సేవకులు, స్థానికులు శిథిలాలను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ వ్యక్తి ఉద్వేగంగా మాట్లాడుతూ'ఆమె నా ఫోన్ కాల్స్ కు స్పందించడంలేదు. నేను నా ఎమోషన్స్‌ను నిలువరించుకొని స్తిమితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ఆమెను గుర్తించేవరకు నేను పోరాడుతునే ఉంటాను' అని తన భార్యను శిథిలాల కింద కోల్పోయిన ఓ వ్యక్తి భావోద్వేగంతో అన్నాడు.


