దేశవ్యాప్తంగా సమన్వయ వ్యూహం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి
పణజి: డ్రగ్స్ రహిత యువశక్తితోనే 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్య సాధన సాధ్యమని ప్రధాని విశ్వసిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రధాని సంకల్పం మేరకు 2029 నాటికి భారత్‌ను డ్రగ్స్ రహిత దేశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రోడ్‌మ్యాప్ సిద్ధం చేసిందని తెలిపారు. నక్సలిజం, ఉగ్రవాద ముప్పును అంతం చేయడానికి మోదీ సర్కార్ ఎంతగానో కృషి చేసిందని, అదే తరహాలో ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే స్వప్నాన్ని సాకారం చేసేందుకు కట్టుబడి ఉందని వివరించారు.
ఇందులో భాగంగానే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను నిర్మూలించేందుకు దేశవ్యాప్తంగా సమన్వయంతో కూడిన వ్యూహాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలియజేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఆదివారం గోవాలోని పణజిలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
2014కు ముందు డ్రగ్స్‌పై పోరాటం చాలావరకు ఒంటరిగానే సాగిందన్నారు. దర్యాప్తు ఏజెన్సీలు తరచుగా చిన్నపాటి నిందితులను పట్టుకోవడంతోనే సంతృప్తి చెందేవని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఈ పోరాటాన్ని జాతీయ ప్రాధాన్యత గల అంశంగా పరిగణిస్తోందని స్పష్టంచేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమన్వయంతో కూడిన చర్యలను చేపట్టేందుకు 2019లో కార్యనిర్వాహక, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ‘మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక జాతీయ సమన్వయ కమిటీ’ అనే నాలుగు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.


