కుదేలైన ‘పొదుపు’! | Savings societies are in disarray under Chandrababu govt | Sakshi
Sakshi News home page

కుదేలైన ‘పొదుపు’!

Sep 14 2026 5:05 AM | Updated on Sep 14 2026 5:05 AM

Savings societies are in disarray under Chandrababu govt

చంద్రబాబు సర్కార్‌ నిర్వాకంతో పొదుపు సంఘాలు విలవిల

దేశంలోనే పటిష్టమైన వ్యవస్థకు రెండేళ్లలోనే బీటలు 

బ్యాంకు రుణాల్లో రూ.8,521 కోట్ల తగ్గుదల..రుణాలు తీసుకున్న సంఘాల్లోనూ భారీ క్షీణత 

చెల్లింపుల్లోనూ వెనుకబడి.. రెట్టింపైన మొండిబకాయిలు  

సంఘాల పొదుపు కూడా రూ.479 కోట్లు తగ్గుదల..  

పాత పొదుపునే ఖర్చు చేసుకుంటున్న మహిళలు 

రూ.10లక్షల వరకు సున్నావడ్డీ పథకాన్ని వర్తింపజేస్తామని బాబు హామీ 

అది లేకపోగా జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన పథకానికీ బ్రేక్‌  

ఆసరా, చేయూతకు దూరమైన మహిళలు.. ప్రభుత్వ సాయం లేక ఆర్థిక ఇబ్బందులు 

గతంలో కరోనా విపత్తులోనూ తగ్గిన మొండిబకాయిలు.. ఇప్పుడు పెరుగుతున్న పరిస్థితి

సాక్షి, అమరావతి: మహిళల ఆర్థిక స్వావలంబన విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ పొదుపు సంఘాల వ్యవస్థకు రెండేళ్లలోనే బీట­లు పడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ ప్రోత్సాకం కొరవడడం, పథకాల అమలు నిలిచిపోవడంతో సంఘాల ఆర్థిక పరిస్థితులు క్రమంగా దిగజారుతున్నాయి. బ్యాంకుల నుంచి కొత్తగా రుణాలు పొందుతున్న సంఘాల సంఖ్య భారీగా తగ్గడంతోపాటు.. సంఘాలకు అందుతున్న రుణాల పరిమా­ణమూ క్షీణించింది. మరోవైపు రుణాల మొండిబకాయిలు రెట్టింపుకుపైగా పెరిగాయి. చివరకు మహిళలు ప్రతి నెలా క్రమం తప్పకుండా చేసుకునే పొదుపు సైతం తగ్గిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గతంలో కరోనా వంటి తీవ్ర సంక్షోభ సమయాల్లోనూ నిలదొక్కుకున్న పొదుపు సంఘాలు.. ఇప్పుడు ప్రభుత్వ తోడ్పాటు కొరవడటంతో క్రమంగా కుంగిపోతున్నాయి. 

ఈ రెండేళ్లు అన్నింటా తిరోగమనమే.. 
మహిళలు నెలనెలా కట్టలేకపోయినా.. ఏడాది మొత్తంలో  రెండు మూడు నెలలే చెల్లించినా మొండిబకాయిలుగా మారేందుకు అవకాశమే లేని క్యాష్‌ అండ్‌ క్రెడిట్‌ (సీసీ) లోను విధానం అమలులోకి వచ్చాక కూడా మొండి బకాయిలు పెరిగాయి. చివరకు సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలు ప్రతి నెలా ఒకసారి సమావేశమవుతూ చర్చించుకుంటూ ఒక్కో  మహిళ నెలనెలా నిర్ణీత మొత్తం పొదుపు చేసుకోవాల్సి ఉండగా, ఆ పొదుపు సైతం తగ్గిపోయింది. నాబార్డు నివేదికల ప్రకారమే 2024 మార్చి నెలాఖరుకు రాష్ట్రంలో పొదుపు సంఘాలన్నింటి పేరిట రూ. 17,292 కోట్లు పొదుపు మొత్తం ఉండగా, 2025 మార్చి నెలాఖరు నాటికి ఆ మొత్తం రూ. 16,813 కోట్లకు అంటే రూ. 479 కోట్ల మేర పడిపోయింది. అంటే, నెలనెలా కొత్తగా పొదుపు చేసుకోవడానికి బదులు, అంతకు ముందు చేసుకున్న పొదుపు మొత్తాలను ఆయా సంఘ సభ్యులు వాడుకుంటున్నారని అధికారులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2023–24లో పొదుపు సంఘాలకు బ్యాంకులిచ్చిన రుణాలు రూ. 49,626 కోట్లు కాగా కూటమి ప్రభుత్వ హయాంలో 2025–26లో ఇవి రూ. 41,105 కోట్లకు తగ్గిపోయాయి. అంటే రూ. 8,521 కోట్ల మేర తగ్గిపోయాయి. బ్యాంకులిచ్చిన పాత రుణాలు పూర్తిగా చెల్లించి కొత్తగా రుణాలు తీసుకున్న సంఘాలు 2023–24లో 5.5 లక్షలుండగా 2025–26 నాటికి అవి 3.6 లక్షలకు పడిపోయాయి. పొదుపుసంఘాల మొండిబకాయిలు 2026 మార్చి నాటికి రూ. 487 కోట్లకు పెరిగాయి. 


జగన్‌ హయాంలో తగ్గిన మొండి బకాయిలు... 
గత జగన్‌మోహన్‌ ప్రభుత్వ హయాంలో కరోనా వంటి విపత్తు సమయంలోనూ పొదుపు సంఘాల పేరిట మహిళలు తీసుకున్న రుణాల్లో మొండి బకాయిలు తగ్గినట్టు అధికారులు పేర్కొంటున్నారు. కరోనా ప్రారంభమైన 2020 మార్చి నాటికి పొదుపు సంఘాల మొత్తం 30 వేల కోట్ల రుణాల్లో రూ. 341 కోట్లు మొండి బకాయిలు ఉండగా.. 2021 మార్చి నెలాఖరుకు రూ. 315 కోట్లకు తగ్గిపోయాయి. 2020 ఏప్రిల్‌ –2021 మార్చి మధ్య నెలల తరబడి లాక్‌డౌన్‌ కారణంగా జనజీవనమే స్థంభించిపోయిన విషయం తెలిసిందే. పనులన్నీ పక్కనపెట్టి ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైన సమయం. రోజు వారీ ఖర్చులకే పొదుపు డబ్బులను ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి సమయంలోనూ పొదుపు సంఘాల మహిళలు తమ రుణ కీస్తీలను సకాలంలో చెల్లించారని ఆ ఏడాది గణాంకాలే చెబుతున్నాయి.  

సున్నా వడ్డీ ఆగిపోయింది...!! 
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన హామీ అమలుకే నోచుకోలేదు. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చి.. తీరా ముఖ్యమంత్రి అయ్యాక గత రెండేళ్ల రెండు నెలలుగా ఆ ఊసే లేని పరిస్థితి. అదే  జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలనకు అతంత్య ప్రాధాన్యతనిచ్చింది. ఆ ఐదేళ్లు రుణాలను సకాలంలో చెల్లించే వారికి వడ్డీని ఏ ఏడాదికి ఆ ఏడాదే ప్రభుత్వమే భరించేది. అంటే పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని తుచ తప్పకుండా అమలు చేసింది. మహిళలను ఆదుకుంది. సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాలకు వైఎస్సార్‌  సున్నా వడ్డీ పథకం ద్వారా రూ. 4,969 కోట్ల మేర లబ్ధిని  చేకూర్చింది. 

ఆసరా, చేయూత లేవు... 
జగన్‌ ప్రభుత్వం 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 7.98 లక్షల స్వయం సహాయక పొదుపు సంఘాలలోని 78.94 లక్షల మంది మహిళలకు వైఎస్సార్‌ ఆసరా పథకం అమలు చేసింది. దీని ద్వారా రూ. 25,571 కోట్లను ప్రభుత్వమే నాలుగు వాయిదాల్లో చెల్లించింది. సున్నావడ్డీ, ఆసరా పథకాల ద్వారానే పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళలు తిరిగి చెల్లించ అవసరం లేని దాదాపు రూ. 30 వేల కోట్లకు పైబడి లబ్ది పొందారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో 45–65 ఏళ్ల మధ్య వయస్సు ఉండే మహిళలను వ్యాపార, చేతివృత్తి రంగాల్లో ప్రోత్సహించేందుకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా మరో రూ. 14,129 కోట్లను జగన్‌ ప్రభుత్వం అందజేసింది.  వీటికి తోడు ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండరును ప్రకటించి ఎప్పటికప్పుడు అన్ని సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో మహిళలకే నేరుగా పథకాలను అందజేసింది. దాదాపు రూ. 2.73 లక్షల కోట్ల మేర మహిళలు డీబీటీ విధానంలో లబ్దిపొందారు. దీంతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు దక్కాయి. తమ కాళ్లపై తాము నిలబడి కుటుంబానికి కూడా అండగా ఉన్నారు. అందుకే అంతటి కరోనా మహమ్మారి పొదుపు సంఘాల మహిళలను ఏమీ చేయలేకపోయింది. కుటుంబం రోజు వారీగా ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, అంతకు ముందు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మహిళలు సకాలంలో చెల్లించేశారు.  


సున్నా వడ్డీతో ఎంతో మేలు జరిగేది 
– పి.సుహాసిని, భారతి పొదుపు సంఘం, కర్నూలు 
నా పేరు సుహాసిని. కర్నూలు న్యూ క్రిష్ణనగర్‌లో నివసిస్తున్నా. 16 సంవత్సరాలుగా భారతి పొదుపు సంఘంలో సభ్యురాలిని. పొదుపు చేసుకుంటూ బ్యాంకు ద్వారా రూ.5 వేల రుణం తీసుకుంటూ వచ్చాం. ఇప్పుడు రూ.లక్ష వరకు రుణం తీసుకున్నా. ప్రతి నెల 10వ తేదీ లోపు రుణం కరెక్టుగా చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వంలో రుణం తీసుకున్నప్పటికీ ఎలాంటి వడ్డీ పడేది కాదు. గతంలో ఐదేళ్ల పాటు పొదుపు సంఘంలో తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీ ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించేది. దీనివల్ల అదనంగా భారం పడేది కాదు. ప్రస్తుతం రెండేళ్లుగా రుణం తీసుకుంటున్నా వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. అసలు, వడ్డీ కట్టాల్సి రావడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం.  

ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం లేదు.. 
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లవుతున్నా డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా తీవ్ర అన్యాయం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల మహిళలందరికీ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ పథకాల ద్వారా ఎంతో మేలు జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో మహిళలు డ్వాక్రా రుణాలు సైతం చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి.  
– సాయిల స్వాతి, డ్వాక్రా మహిళ, కామవరపుకోట  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement