సాక్షి, అమరావతి: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం శ్రీకాకుళం జిల్లా మెట్టక్కివలసలో 3.4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో 3.3, నరసన్నపేటలో 3.2, విజయనగరం జిల్లా మల్లంపేటలో 3.1, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 3.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కృష్ణా జిల్లా పెనమలూరులో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో 9.7, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 9.4, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 9, బాపట్ల జిల్లా మార్టూరులో 9, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో 8.9, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 8.8, ప్రకాశం జిల్లా అద్దంకిలో 8.5, అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో 8.4, గుంటూరులో 8.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
కొనసాగుతున్న అల్పపీడనం
మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వచ్చే 24 గంటల్లో ఇది రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ–వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.


