బీసీ గర్జన పోస్టర్ ఆవిష్కరిస్తున్న చెల్లుబోయిన, మాజీ ఎంపీ మార్గాని, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు
ఉప ముఖ్యమంత్రిగా ఒక్క బీసీ దొరకలేదా?
సంక్షేమ పథకాల అమలులోనూ మోసమే
వైఎస్ జగన్ పాలనలోనే ఆ వర్గానికి రాజ్యాధికారం
జగన్‌ను మళ్లీ సీఎంను చేసేందుకు కృషి చేద్దాం
రాజమహేంద్రవరం బీసీ గర్జనలో వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేల పిలుపు
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: బీసీలను సీఎం చంద్రబాబు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ, వారికి వెన్నుపోటు పొడుస్తున్నారని వైఎస్సార్‌సీపీ బీసీ నేతలు ధ్వజమెత్తారు. వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన పేరిట రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ గర్జన పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడారు. బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను డైరెక్టర్లను నియమించారని గుర్తు చేశారు. అప్పటి వరకూ సామాన్యులకు అవకాశం దక్కని టీటీడీ బోర్డులో సైతం బీసీలను సభ్యులుగా నియమించారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా మెజార్టీ సీట్లు బీసీలకే ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ పాలనలోనే బీసీ వర్గానికి రాజ్యాధికారం దక్కిందని పేర్కొన్నారు.
వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా బీసీలకు ప్రాధాన్యమివ్వడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో ముగ్గురు బీసీలకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశమిస్తే, చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్కరికీ ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఒక్క బీసీ కూడా చంద్రబాబుకు దొరకలేదా అని నిలదీశారు. బీసీని డిప్యూటీ సీఎం చేసి పక్కన కూర్చోబెట్టుకునేందుకు చంద్రబాబు ఇష్టపడకపోవడం దారుణమన్నారు.
రిజర్వేషన్ పేరిట కొత్త డ్రామా
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ పేరిట డ్రామాకు తెరలేపారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. వైఎస్ జగన్ 34 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు గతంలో ప్రయతి్నస్తే, కోర్టుకెళ్లి టీడీపీ నేతలు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ 45 శాతం పైగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశమిచ్చిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేసేందుకు కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు. 20 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్లు ఇస్తామని మోసం చేశారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో బీసీలకు జరిగిన మేలును ఇంటింటికీ వెళ్లి వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన పేరిట భారీ సదస్సును రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోనే నిర్వహించనున్నామని, ఈ సదస్సులో బీసీలకు ఏం కావాలో చర్చించి, వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, కవురు శ్రీనివాస్, రమేష్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నవుడు వెంకటరమణ, రాజమహేంద్రవరం వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల బీసీ సెల్ అధ్యక్షులు అల్లి రాజబాబు, కొండపల్లి దుర్గారావు, మట్టపర్తి నాగేంద్ర, నెరుసు చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.


