ఒక టీచర్‌ పోస్టు.. ఆరు మలుపులు! | YS Jagan Questions Chandrababu Naidu Over DSC Irregularities: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఒక టీచర్‌ పోస్టు.. ఆరు మలుపులు!

Sep 14 2026 4:54 AM | Updated on Sep 14 2026 4:55 AM

YS Jagan Questions Chandrababu Naidu Over DSC Irregularities: Andhra Pradesh

 65 టెట్‌ మార్కులతోనే డీఎస్సీలో పోస్టు ఇచ్చారా?

ఏడు దశల్లో ఏం పరిశీలించారు? 

అనర్హుడని డీఈవో ఎలా తేల్చారు? 

ఉద్యోగం ఎలా వచ్చిందో అభ్యర్థికే తెలియదా?.. 2018 టెట్‌లో 77 మార్కులు అంటూ కొత్త వివరణ 

ఆ మార్కులను ముందే ఎందుకు పరిగణించలేదు? 

పేపర్‌–2బీతో ఎస్‌జీటీ అర్హత ఎలా? 

ఉద్యోగం వచ్చాక 2025లో మళ్లీ టెట్‌ ఎందుకు?.. ఇదేనా నిష్పాక్షిక, పారదర్శక నియామకం?.. డీఎస్సీ వ్యవహారంపై బాధ్యత వహించరా?

సాక్షి, అమరావతి: ఒక ఉపాధ్యాయ పోస్టు నియామకంపై అధికారుల వివరణలు మారుతున్నాయని, ప్రతి కొత్త వివరణ టీచర్‌ అభ్యర్థుల్లో మరిన్ని ప్రశ్నలు రేకెత్తిస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించా­రు. ఆ పోస్టుకు సంబంధించిన టెట్‌ మార్కులు, ఏడు దశల అర్హత పరిశీలన, డీఈవో ప్రకటన, అభ్యర్థి మళ్లీ టెట్‌ రాయడం వంటి అంశాలను వరుసగా ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’­లో ఆదివారం  వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు.

తొలి మలుపు: 65 మార్కులతో ఏడు దశల పరిశీలన 
అభ్యర్థికి 65 టెట్‌ మార్కులు ఉన్నట్లు చూపించి, ఏడు దశల పరిశీలన అనంతరం ఉపాధ్యాయ పోస్టు ఇచ్చారని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. అన్ని దశలు పూర్తయిన తర్వాతే నియామకం జరిగిందని చెబుతున్నప్పుడు, ఆ పరిశీలనలో అభ్యర్థి అర్హతను ఎలా నిర్ధారించారో వెల్లడించాలని ప్రశ్నించారు.  

రెండో మలుపు: అనర్హుడని డీఈవో ప్రకటన  
అదే అభ్యర్థి అనర్హుడని డీఈవో నిర్ధారించినట్లు వైఎస్‌ జగన్‌ తెలిపారు. అర్హత లేకపోతే ఏడు దశల పరిశీలనలో ఆ విషయం ఎందుకు బయటపడలేదని నిలదీశారు. ‘‘ఆ ఏడు దశల్లో అసలు ఏం వెరిఫై చేశారు?’’ అన్నది టీచర్‌ అభ్యర్థులకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న అని పేర్కొన్నారు.

మూడో మలుపు: ఉద్యోగం ఎలా వచ్చిందో అభ్యర్థికే తెలియదా? 
తనకు ఉద్యోగం ఎలా వచ్చిందో తెలియదని సదరు అభ్యర్థే చెప్పినట్లు వైఎస్‌ జగన్‌ ప్రస్తావించారు. నియామకం పొందిన అభ్యర్థి నుంచి కూడా అలాంటి సమాధానం వచ్చిందంటే, పోస్టు భర్తీ ప్రక్రియపై తలెత్తిన సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

నాలుగో మలుపు: తెరపైకి 2018 టెట్‌ 77 మార్కులు 
తాజాగా అధికారులు మరో వివరణ ఇచ్చారని, అభ్యర్థి 2018లో రాసిన టెట్‌లో 77 మార్కులు సాధించినట్లు ధ్రువీకరించారని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఆ మార్కులు అప్పటి నుంచే రికార్డుల్లో ఉంటే నియామక సమయంలో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. 77 మార్కులతో అర్హత ఉందని ఇప్పుడు చెబుతున్నప్పుడు ముందుగా అనర్హుడని డీఈవో ఎందుకు ప్రకటించారని అడిగారు. ఈ వివరణ ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఎందుకు వచ్చిందని నిలదీశారు.  

ఐదో మలుపు: ఎస్‌జీటీ పోస్టుకు ‘రాంగ్‌ పేపర్‌’? 
77 మార్కులు పేపర్‌ 2బీలో వచ్చినవిగా చెబుతున్నారని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. అది స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పేపర్‌ కాగా, ఎస్‌ జీటీ పోస్టుకు పేపర్‌–1ఏ అవసరమని గుర్తు చేశారు. ఈ పరిస్థితిలో అభ్యర్థి ఏడు దశల అర్హత పరిశీలనను ఎలా దాటారని ప్రశ్నించారు.

ఆరో మలుపు: ఉద్యోగం వచ్చాక మళ్లీ టెట్‌ ఎందుకు? 
ఉద్యోగం పొందిన తర్వాత కూడా అభ్యర్థి 2025లో మళ్లీ టెట్‌ రాసినట్లు వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 2018లో సాధించిన 77 మార్కులే ఎస్‌జీటీ పోస్టుకు అర్హత కల్పించాయని అధికారులు చెబుతున్నట్లయితే, అభ్యర్థి మరోసారి టెట్‌కు హాజరు కావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.  

చంద్రబాబు సమాధానం చెప్పాలి 
ఒకే పోస్టుపై వరుసగా వస్తున్న ఈ వివరణల మధ్య నియామక ప్రక్రియను నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగిందని ఎలా చెప్పగలరని సీఎం చంద్రబాబును జగన్‌ ప్రశ్నించారు. ఈ వ్యవహారం డీఎస్సీ కుంభకోణానికి దారితీయలేదా అని నిలదీస్తూ, దీనికి నైతిక బాధ్యత వహించరా అని నిలదీశారు. అభ్యర్థుల సందేహాలను తీర్చేలా మార్కులు, వర్తించే టెట్‌ పేపర్, అర్హత పరిశీలనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement