లంచాల కోసం ప్రజలను పీడిస్తున్న సీఐ
టీడీపీ నేత వీడియో వైరల్
సాక్షి, టాస్క్ ఫోర్స్: కంచే చేను మేసిన చందంగా ప్రజలను రక్షించాల్సిన పోలీస్ అధికారి భక్షకుడిగా మారి లంచాల పేరుతో జలగలా పీడిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారని కృష్ణా జిల్లా గన్నవరం సీఐ బీవీ శివప్రసాద్‌పై తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షుడు తాతేపాముల నాగయ్య రుషి ఆరోపించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గన్నవరం పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసులు, ఇతర వ్యవహారాల్లో దోచుకో, దాచుకో.. అన్నట్టుగా సీఐ శివప్రసాద్ వైఖరి ఉందని ఆ వీడియోలో పేర్కొన్నారు.
పేద, బడుగు, బలహీన వర్గాలు, దళితులు న్యాయం కోసం వెళ్తే కనీసం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సీఐగా ఇక్కడ చార్జ్ తీసుకున్న రెండేళ్లలోనే ఆయన రూ.20 కోట్లు దండుకున్నారని, సాక్ష్యాధారాలతో సహా అవినీతిని నిరూపిస్తానని ఆయన చాలెంజ్ విసిరారు. ఫోర్జరీ సంతకం విషయమై ముస్తాబాదకు చెందిన ఓ ఆడబిడ్డను సీఐ అన్యాయంగా బెదిరించి అవతలి వారికి న్యాయం చేసేలా వ్యవహరించారన్నారు.
చిక్కవరంలో ముగ్గురు బాలురు చెరువులో పడి మృతిచెందిన ఘటనలో బాధ్యులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించినా సీఐ పట్టించుకోలేదన్నారు. పిల్లల చావుకు కారణమైన వారి వద్ద సీఐ డబ్బులు తీసుకుని కథ ముగించేశారని ఆరోపించారు. ఆత్కూరులో ఓ వ్యక్తి దగ్గర బిల్డింగ్‌కు డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు.
అక్రమార్జనతో భారీ భవనాలు
అక్రమార్జనతో సీఐ కాకినాడ, నున్నలో భారీ బిల్డింగ్‌లు కడుతున్నారని, ఒక ఇల్లును కబ్జా చేశారని నాగయ్య రుషి తీవ్ర ఆరోపణలు చేశారు. న్యాయం కోసం స్టేషన్ మెట్లు ఎక్కిన పేదలను దోచుకుతింటున్న సీఐపై ఏసీబీ, సీబీసీఐడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశి్నంచారు. చిన్నచిన్న కేసుల్లో కూడా సీఐ ప్రజల నడుములు ఇరగ్గొడుతున్నారని, కానీ గత రెండేళ్లలో ఒక గంజాయి కేసునూ ఆయన నమోదు చేయలేదన్నారు. ఉండవల్లికి చెందిన సింగవరపు వెంకటేశ్వరరావు ప్రతిరోజు సీఐని ఎందుకు కలుస్తున్నాడని, ఇలాంటి గంజాయి విక్రయదారులకు సీఐ అండగా ఉంటున్నారని ధ్వజమెత్తారు.


