బీసీ మహిళలపై టీడీపీ నేత దాష్టీకం | TDP Leaders Overaction Against BC Woman | Sakshi
Sakshi News home page

బీసీ మహిళలపై టీడీపీ నేత దాష్టీకం

Sep 14 2026 5:35 AM | Updated on Sep 14 2026 5:35 AM

TDP Leaders Overaction Against BC Woman

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్న కట్టశింగన్నపాలేనికి చెందిన బీసీలు

భర్తలకు అప్పులు ఇచ్చి భార్యలతో అసభ్య ప్రవర్తన 

పనుల కోసం వలస వెళ్లి పండగకు వస్తే తీవ్రంగా వేధిస్తున్నాడు 

దర్శి డీఎస్పీకి కట్టశింగన్నపాలెం గ్రామ బీసీ మహిళల ఫిర్యాదు

దర్శి: అధికారం అండతో టీడీపీ నాయకుడు తమను దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ప్రకాశం జిల్లా దర్శి మండలం కట్టశింగన్నపాలెం గ్రామానికి చెందిన బీసీ మహిళలు ఆదివారం దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. కట్టశింగన్నపాలేనికి చెందిన సుమారు 50 కుటుంబాలకు చెందిన బీసీ మహిళలు ఉదయాన్నే దర్శి చేరుకుని డీఎస్పీ, సీఐ కాళ్లకు నమస్కరించి తమ ఆవేదనను వివరించారు. తమకు న్యాయం చేయాలని సాయంత్రం వరకు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. 

ఈ సందర్భంగా బాధిత మహిళలు మాట్లాడుతూ... కట్టశింగన్నపాలెం గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడు నాదెండ్ల అంజయ్య వద్ద తమ భర్తలు కుటుంబ అవసరాల కోసం గతంలో రూ.50 వేలు, రూ.60 వేలు అప్పుగా తీసుకుని తిరిగి ఇస్తున్నారని చెప్పారు. 

అంజయ్య నూటికి పది రూపాయలు వడ్డీలు తీసుకుంటారని తెలిపారు. ఎన్ని డబ్బులు కట్టినా తమ అప్పులు తీరడం లేదన్నారు. బాకీలు ఉన్న తమ ఇళ్ల వద్దకు మద్యం తాగి వచ్చి మగవాళ్లు లేనప్పుడు వచ్చి ‘మీ మొగుళ్లు ఎక్కడికి పోయారే..’ అంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మీ నోట్లు మీకు ఇస్తా.. మా డబ్బులు మీరు పడుకుని చెల్లిస్తారా’ అంటూ చెప్పుకోలేని భాషలో అసభ్యంగా మాట్లాడుతున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు.

తాము బయట ప్రాంతాలకు వెళ్లి కూలి పనులు చేసుకుని వస్తుంటామని, పండగకు గ్రామానికి వస్తే తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. మూడు రోజులుగా పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా ఇక్కడ అధికారులు స్పందించడం లేదని డీఎస్పీతో చెప్పారు. న్యాయం జరగకుండా మాపై ఇలానే వేధింపులకు గురిచేస్తే పోలీస్‌స్టేషన్‌ ఎదుట పురుగు మందు తాగి చనిపోతామని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో డీఎస్పీ బాలమురళీకృష్ణ వెంటనే గ్రామానికి వెళ్లి విచారణ చేయాలని ఎస్‌ఐ ఏడుకొండలును ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement