చంపినా.. చావనంటోంది! | Sea cucumber tissue survives for years in open water, study finds | Sakshi
Sakshi News home page

చంపినా.. చావనంటోంది!

Jun 7 2026 4:48 AM | Updated on Jun 7 2026 4:48 AM

Sea cucumber tissue survives for years in open water, study finds

గోడ మీది బల్లి తోక తెగిపోతే...  తోక మళ్లీ పెరుగుతుంది. ఇది మనకు తెలుసు. 
కానీ.. తెగిన తోకలోంచి సరికొత్త బల్లి పుట్టుకొస్తే? 
అట్లాంటిక్‌ మహా సముద్రం అట్టడుగున ఈ అద్భుతమే ఆవిష్కృతమైంది!! 

కెనడాలోని మెమోరియల్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అ మధ్య అట్లాంటిక్‌ మహా సముద్రంలో కొన్ని అన్వేషణలు జరిపారు. మంచుముద్దల అడుగున చాలా లోతులో వారికి ఓ సముద్రపు దోస దొరికింది. దోస అంటే ముళ్ల దోసకాయ వంటి రూపమున్న జీవి. శాస్త్రీయ నామం సోలస్‌ ఫాబ్రిచీ. సరే... దీనిపై పరిశోధనలు చేద్దామనుకున్నారు వాళ్లు. ల్యాబ్‌కు తీసుకొచ్చి ఒక ముక్క కత్తిరించి సముద్రపు నీటిలోనే పాతి పెట్టారు. కుళ్లి, కృషించి పోవడానికి ఎంత టైమ్‌ పడుతుందో చూద్దామనుకున్న ఆ శాస్త్రవేత్తలకు భారీ షాకే తగిలింది. 

ఎందుకంటే.. రోజులు, వారాలు, గడుస్తున్నా ఆ ముక్క చావనంటోంది. పైగా గాయం మానిపోవడం మొదలైంది. కణాలు చురుకుగానే ఉన్నాయి. రోగ నిరోధక వ్యవస్థ కూడా పని చేయడం మొదలైంది. కొన్ని నెలల తరువాత గమనిస్తే... కత్తిరించిన ముక్క కంటే పెద్దది అయిపోయింది. మూడేళ్లు గడిచాయి. ఆ ముక్కలో జీవం తొణికిసలాడుతూనే ఉంది. సముద్రపు నీటిలోంచి పోషకాలు పీల్చేసుకుని ఎంచక్కా బతికేస్తోంది. పునరుత్పత్తి జరగలేదు కానీ.. కత్తిరించినా అది ఇంకో జీవిలా బతికేసింది అన్నమాట! 

ఎందుకో.. ఏమో... 
ప్రకృతిలో ఎన్నో వింతలు ఉంటాయి కానీ ఇలాంటిది మాత్రం ఇదే మొదటిది అంటున్నారు రేచల్‌ సైప్లర్‌ అనే మెరీన్‌ బయోజియోకెమిస్ట్‌. బల్లి తోకలు మళ్లీ పెరిగినట్లే కొన్ని ఇతర జీవజాతుల్లోనూ అవయవాల పునరుత్పత్తి జరుగుతూంటుంది. సాల్మాండర్స్‌లో కీళ్లు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూంటాయి. అలాగే జెల్లీఫిష్‌ వృద్ధాప్యం నుంచి యవ్వన స్థితికి వెళ్లిపోగలదు. ఒక కీటకం రెండుగా విడిపోయి కూడా బతకగలదు. కానీ ఇలా అస్సలు చావని శరీర భాగాన్ని మాత్రం గతంలో ఎక్కడ చూడలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. తెగిపోయిన ఒక భాగం ఇలా చావకుండా ఏళ్లపాటు ఉంటే మనకేంటి ప్రయోజనం? చాలానే అంటున్నారు శాస్త్రవేత్తలు. 

కణజాలాన్ని పెంచడం, సూక్ష్మజీవుల సాయంతో గాయాలు మాన్పడం వంటివి ఈ సముద్రపు దోసపై పరిశోధనలు చేయడం ద్వారా సాధ్యం కావచ్చునని అంచనా. సుదూర భవిష్యత్తులోనైనా తెగిన చేతులను మళ్లీ మొలిపించవచ్చునేమో??? వెన్నెముక లేని జీవజాతి అకశేరుకాలకు చెందిన ఈ సముద్రపు దోసపై ఎలాంటి నైతిక, న్యాయపరమైన నియంత్రణలు లేకుండా పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉంది. తద్వారా జీవం విషయంలో సరికొత్త విషయాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెమోరియల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూడేళ్ల తరువాత తమ పరిశోధనలు నిలిపివేశారు. ఇటీవలే సైన్స్‌ అడ్వాన్స్‌లో వివరాలు ప్రచురితమయ్యాయి. కొసమెరుపు ఏమిటంటే.. ఆ ముక్క ఇప్పటికీ చురుకుగానే అంటే జీవంతోనే ఉండటం! 
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
 
Advertisement
Advertisement