ముందస్తు టిప్ ఆప్షన్‌ను నిలిపివేయాలని కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: ‘కెప్టెన్ రూ. 60 చార్జీకి ఒప్పుకోవడం లేదు.. మరో రూ.10, రూ.20, లేదా రూ.30 పెంచి బుకింగ్ ట్రై చేయండి’.. ‘రేటు పెంచితే రైడ్ బుక్ అయ్యే అవకాశాలు మెరుగవుతాయి’.. అంటూ ర్యాపిడో సహా వివిధ అగ్రిగేటర్ యాప్‌లలో క్యాబ్ లేదా బైక్ బుక్ చేసుకునేవారికి పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సమస్యలపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం.. రైడ్ బుక్ చేసుకోవడానికి ముందే అనుసరిస్తున్న ఇలాంటి ముందస్తు టిప్ ఆప్షన్‌ను నిలిపివేయాలని క్యాబ్ అగ్రిగేటర్లను బుధవారం ఆదేశించింది.
ఈ విధానం తప్పుదోవ పట్టించేలా, అన్యాయంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినియోగదారుల వ్యవçహారాల కార్యదర్శి నిధి ఖరే పేర్కొన్నారు. క్యాబ్, బైక్ డ్రైవర్లకు ముందస్తు టిప్ ఆప్షన్‌ను అందించడంతో పాటు రకరకాల అక్రమ వ్యాపార విధానాలకు సంబంధించి బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ర్యాపిడోపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) రూ. 10 లక్షల జరిమానా విధించిన మర్నాడే కేంద్రం తాజా ఆదేశాలు వెలువడటం గమనార్హం.
ఈ విషయంలో క్యాబ్ అగ్రిగేటర్లపై జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వచ్చాయని.. దీంతో ఉబెర్, ఓలా వ్యాపార విధానాలను కూడా సీసీపీఏ నిశితంగా పరిశీలిస్తోందని, ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు ఖరే చెప్పారు. ముందుగానే ఎంతో కొంత టిప్ ఇవ్వకపోతే రైడ్ బుక్ కావడం లేదంటూ వినియోగదారుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడంతోనే, దీనిపై లోతుగా విచారణ జరిపి, నిలిపివేత ఆదేశాలిచ్చామని ఆమె వివరించారు. సీసీపీఏకు కూడా ఖరే సారథ్యం వహిస్తున్నారు. టిప్ అనేది పూర్తిగా స్వచ్ఛందమైన విషయమని, వినియోగదారులు తమకు సేవలు నచ్చితే రైడ్ పూర్తయ్యాక ఇచ్చే విధంగా వారి విచక్షణకే వదిలేయాలని కూడా ఆమె అభిప్రాయపడ్డారు.


