ఇప్పటికీ మగ బిడ్డే కావాలని కోరుకోవడం దురదృష్టకరం  | Bombay High Court Denies Bail To Grandfather In Infant Girl Murder Case | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ మగ బిడ్డే కావాలని కోరుకోవడం దురదృష్టకరం 

Sep 19 2026 6:23 AM | Updated on Sep 19 2026 6:23 AM

Bombay High Court Denies Bail To Grandfather In Infant Girl Murder Case

బాంబే హైకోర్టు వ్యాఖ్య 

మనవరాలిని చంపిన వ్యక్తికి బెయిల్‌ నిరాకరణ

ముంబై: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతున్నప్పటికీ మగ బిడ్డే కావాలని మన సమాజంలో ఇప్పటికీ కోరుకుంటుండటం దురదృష్టకరమని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ కుటుంబంలో మరో ఆడ శిశువు వద్దంటూ నెల వయస్సున్న మనవరాలిని పొట్టనబెట్టుకుని జైలు పాలైన ఓ వ్యక్తికి బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. జస్టిస్‌ ఎంఎం నెర్లికర్‌ సారథ్యంలోని హైకోర్టు నాగ్‌పూర్‌ ధర్మాసనం ఈ నెల 9వ తేదీన ఈ మేరకు తీర్పు ప్రకటించింది. 

గడ్చిరోలి జిల్లాకు చెందిన గోపీనాథ్‌ జంకు ప్రధాన్‌ కుమారుడికి 2023లో రెండోసారి కూడా కుమార్తె పుట్టింది. అది ఇష్టం లేని ప్రధాన్‌ నెల వయస్సున్న పసికందును నీళ్ల తొట్టిలో ముంచి చంపేశాడు. ఈ ఘోరంలో శిశువు తల్లి కూడా పాలుపంచుకుంది. అయితే, ఆమెకు కోర్టు బెయిలిచ్చింది. 

తెలియకనే తాను అప్పట్లో ఆ దారుణానికి పాల్పడ్డానని, కోడలికి ఇచ్చినట్లే తనకు కూడా బెయిలివ్వాలని హైకోర్టులో ప్రధాన్‌ పిటిషన్‌ వేశాడు. విచారణ చేపట్టిన జస్టిస్‌ నెర్లికర్‌.. స్వాతంత్య్రం వచ్చిన 80 ఏళ్లకు కూడా మన సమాజంలో మగ శిశువే కావాలన్న కోరిక బలంగా ఉండటం అత్యంత దురదృష్టకరమన్నారు.

 ‘ఈ కేసులో నిందితులుగా ఉన్న కుటుంబ సభ్యులంతా కలిసి, ఆ పసికందును ఎవరో చంపేశారంటూ హడావుడి చేశారు. ఏదో జంతువు ఆ బిడ్డను ఎత్తుకెళ్లి ఉండవచ్చంటూ నాటకమాడారు. పసికందు అంత్యక్రియలను కూడా అంతే వేగంగా ముగించేశారు’అని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై అనుమానం వచ్చిన స్థానికుడొకరు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదైంది. అనంతరం చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించగా, నీళ్లలో మునిగి శ్వాస ఆడక మరణించినట్లు వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement