తుకారాం ముండేకు బిగ్‌ షాక్‌.. జరిమానా | Tukaram Mundhe Led FDA Faces HC Heat As Bombay High Court Orders ₹5 Lakh Compensation, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

తుకారాం ముండేకు బిగ్‌ షాక్‌.. జరిమానా

Aug 18 2026 10:05 AM | Updated on Aug 18 2026 10:26 AM

Tukaram Mundhe FDA Faces HC Heat Over Going Overboard

నిబంధనలు పాటించని ఆహార దుకాణాలపై చర్యలు తీసుకోవడం వరకు బాగానే ఉంది.. కానీ నిబంధనలు పాటించిన తర్వాత కూడా లైసెన్స్‌ పునరుద్ధరించకుండా ఆ వ్యాపారాన్ని అడ్డుకోవం ఎంత వరకు సబబు?. ఈ వ్యవహారాన్ని బాంబే హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.  ఇది అతిగా వ్యవహరించడమేనని పేర్కొంటూ మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు జరిమానా విధించింది.

తుకారాం ముండే మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ దూకుడు చూస్తున్నదే. నిత్యం ఏదో ఒక రెయిడ్‌తో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారాయన. అయితే.. పుణెలోని ఓ స్వీట్స్‌ దుకాణం లైసెన్స్‌ను 98 శాతం నిబంధనలు పాటించినట్లు రీ-ఇన్‌స్పెక్షన్‌లో తేలింది. అయినప్పటికీ పునరుద్ధరించకపోవడంపై మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA)కు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.

యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ రవీంద్ర ఘుగే, జస్టిస్‌ గౌతమ్‌ అంఖడ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లు, తినుబండారాల లైసెన్సులను సస్పెండ్‌ చేయడం FDA అనుసరిస్తున్న విధానంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ‘వింతైన, విపరీతమైన విధానం’గా అభివర్ణించింది.

98 శాతం కంప్లయన్స్‌ ఉన్నా..
పుణెలోని గురునానక్‌ డెయిరీ అండ్‌ స్వీట్స్‌పై ఆహార కలుషితానికి సంబంధించిన ఫిర్యాదు రావడంతో FDA అధికారులు జూన్‌ 12న తనిఖీలు నిర్వహించారు. దుకాణంలోని పారిశుద్ధ్యం, సిబ్బంది పరిశుభ్రతకు సంబంధించి పలు లోపాలను గుర్తించారు. అదే రోజు దుకాణం లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దుకాణ యాజమాన్యం FDA కమిషనర్‌కు అప్పీల్‌ చేయడంతో పాటు లోపాలను సరిచేసినట్లు పేర్కొంటూ కంప్లయన్స్‌ రిపోర్ట్‌ సమర్పించింది.

దీనిపై జూలై 13న FDA అధికారులు మరోసారి దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈసారి దుకాణం 98 శాతం నిబంధనలు పాటిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయినప్పటికీ లైసెన్స్‌ సస్పెన్షన్‌ను ఎత్తివేయలేదు. లైసెన్స్‌ను పునరుద్ధరించాలని యాజమాన్యం FDAకి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో చివరకు బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

లక్షల ఆదాయం కోల్పోయామని..
లైసెన్స్‌ సస్పెన్షన్‌ కారణంగా జూన్‌లో దుకాణం మూసివేసినప్పటి నుంచి రూ.8.74 లక్షల ఆదాయాన్ని కోల్పోయామని యాజమాన్యం కోర్టుకు తెలిపింది. కేసును విచారించిన ధర్మాసనం దుకాణాన్ని తిరిగి తెరిచి వ్యాపారం చేసుకునేందుకు అనుమతించింది. అంతేకాకుండా దుకాణ యజమానులకు నెల రోజుల్లోగా రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని మహారాష్ట్ర FDAను ఆదేశించింది.

‘మీరు హద్దులు దాటుతున్నారు’
FDA ఉద్దేశం మంచిదేనని, ఆహార భద్రత విషయంలో ఒక విభాగం కనీసం చర్యలు తీసుకుంటోందని ప్రశంసించిన ధర్మాసనం.. అదే సమయంలో అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. 98 శాతం నిబంధనలు పాటిస్తున్నట్లు రీ-ఇన్‌స్పెక్షన్‌లో తేలిన వెంటనే లైసెన్స్‌ సస్పెన్షన్‌ను ఎత్తివేయాల్సిందని స్పష్టం చేసింది. అలా చేయకుండా దుకాణాన్ని కొనసాగనివ్వకపోవడం సరికాదని పేర్కొంది.

కోర్టు ఉత్తర్వులు పరిశీలిస్తా: FDA కమిషనర్‌
బాంబే హైకోర్టు ఆదేశాలపై మహారాష్ట్ర FDA కమిషనర్‌ తుకారాం ముండే స్పందిస్తూ.. ముందుగా కోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తానని తెలిపారు. ఆ తర్వాతే స్పందిస్తానన్నారు. FDA చట్టం, నిర్దేశిత విధానాల ప్రకారమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. చట్టం, ప్రక్రియలను అనుసరిస్తూ వాటిని అమలు చేస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement