టైటిల్: తత్వం
నటీనటులు: దినేష్ తేజ్ దాస్విక కింతాలి, సుక్కురెడ్డి, ఆనంద్ భారతీ, జబర్దస్త్ కృష్ణ, భోగిరెడ్డి శ్రీనివాస్, ప్రమోదిని తదితరులు
నిర్మాణ సంస్థ: త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎప్.కె. ప్రొడక్షన్స్
నిర్మాతలు: శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటీ
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫి: భరత్ పట్టి
ఎఢిటర్: విప్లవ్ నైషదం
విడుదల తేది: అక్టోబర్ 2, 2026
కథేంటంటే..
రామాపురం గ్రామంలో మూర్తి(సుక్కు రెడ్డి), నాగమణి జంట దారుణ హత్యకు గురవుతుంది. మతి స్థిమితం లేని కొడుకు సుధనే వారిని హత్య చేశాడని ఊరివాళ్లు భావిస్తారు. సుధను బంధించి పోలీసులకు ఫోన్ చేశారు. అదే రోజు కానిస్టేబుల్ కల్యాణ్(దినేష్ తేజ్) పెళ్లి చూపుల కోసం రామాపురం వెళ్తాడు. దీంతో ఎస్సై ఈ కేసును కల్యాణ్‌కి అప్పగిస్తాడు. రిపోర్ట్ రాసుకొని రమ్మని చెప్పడంతో రెండు రోజులు అక్కడే ఉంటాడు. పెళ్లి చూపులు చూసేందుకు వచ్చిన అమ్మాయి సౌమ్య(దాస్విక)..సుధ ఆ నేరం చేయకపోవచ్చని చెప్పడంతో తనదైన శైలీలో విచారణ ప్రారంభిస్తాడు.మరి కల్యాణ్ విచారణలో ఏం తేలింది? అసలు మూర్తి, నాగమణి జంటను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? సుధ నిజంగానే ఈ హత్యలు చేయలేదా? సౌమ్య సుధకు ఎందుకు మద్దతుగా నిలిచింది? చివరకు ఈ కేసుని కల్యాణ్ ఎలా ఛేదించాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
మూడనమ్మకంకు నమ్మకం మధ్య ఓ సన్నని గీత ఉంటుంది. దాని చుట్టూ తిరిగే మర్డర్ మిస్టరీ ఇది. పెళ్లి చూపులతో మొదలై.. హత్యకేసు ఇన్వెస్టిగేషన్‌తో ముగుస్తుంది. దర్శకుడు అర్జున్ కోలా ఎంచుకున్న పాయింట్, కథనం పలు మలయాళ సినిమాను గుర్తు చేస్తుంది. ఒక చిన్న పాయింట్ తీసుకొని దాని చుట్టు ఆసక్తికర సన్నివేశాలు అల్లుకొని ఆసక్తికరంగా కథను మలిచే ప్రయత్నం చేశాడు. హత్య చేసిందెవరు అనే విషయాన్ని చివరివరకు బయటపడకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన సన్నివేశాలు ఆసక్తికరంగా లేకపోవడంతో ఫస్టాఫ్ చాలా వరకు సాగదీతగా అనిపిస్తుంది.సెకండాఫ్ మాత్రం కాస్త వేగంగా సాగుతుంది. మర్డర్ వెనుక ఉన్నదెవరు అనేది సస్పెన్స్‌గా ఉంచుతూ..పలువురిపై అనుమానం కలిగించేలా చేస్తూ,మధ్యలో జంతువుల ఆక్రమ రవాణ ఎపిసోడ్‌ని యాడ్ చేసి..ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని పెంచేలా చేశారు. ఇక చివరిలో వచ్చే ట్విస్ట్ కూడా ఊహించలేం. ముగింపు రొటీన్‌గానే ఉంటుంది. రొటీన్ మర్డర్ మిస్టరీ కథే అయినా.. కథనం కాస్త కొత్తగా ఉంది. ఇన్వెస్టిగేషన్ సీన్లను ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఓపికతో చూస్తే ఈ సినిమా నచ్చేతుంది.
ఎవరెలా చేశారంటే..
కానిస్టేబుల్‌గా కల్యాణ్ పాత్రకి దినేష్ న్యాయం చేశాడు. పల్లెటూరి యువతి సౌమ్య పాత్రలో తెలుగమ్మాయి దష్విక బాగా చేసింది. అయితే నటనకు పెద్దగా స్కోప్ లేని పాత్ర ఆమెది. మానసిక స్థితి సరిగ్గా లేని పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ బాగా నటించాడు. ఒకటి రెండు సీన్లలో భయపెట్టాడు కూడా. ప్రమోదిని, కృష్ణ, ఆనంద్ భారతి, సుక్కు రెడ్డి, శరత్ బాబు.. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను తెరపై బాగా చూపించాడు.ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో చాలా సాగదీత సీన్లు ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.


