టీచర్ అంటే క్లాస్ రూమ్‌లో పాఠాలు చెప్పడం, స్ట్రిక్ట్‌గా ఉండటం మాత్రమే కాదు... విద్యను వ్యాపారంగా మార్చాలనుకుంటే నిలదీస్తాం అంటున్నారు సిల్వర్ స్క్రీన్ టీచర్స్. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా త్వరలో తెరకు రానున్న కొన్ని టీచర్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం.
ప్రొఫెసర్ పాఠాలు
యాక్షన్ మోడ్‌లో స్క్రీన్ పై ప్రభాస్ ఎలా కనిపిస్తారో చాలా సినిమాల్లో చూశాం. కానీ ‘మిర్చి, మిస్టర్ పర్‌ఫెక్ట్’ వంటి సినిమాల్లో ప్రభాస్ క్లాస్‌గానూ కనిపించారు. తాజా సినిమా ‘స్పిరిట్’లో కూడా కొన్ని సీన్స్‌లో క్లాస్‌గా కనిపిస్తారట. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్, డాన్, కాలేజీ ప్రొఫెసర్... ఇలా మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారట. ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో ప్రభాస్ పాల్గొనగా కీలక సన్నివేశాలను తీశారు. ప్రొఫెసర్‌గా ప్రభాస్ నటించిన సన్నివేశాలనే ఆ షెడ్యూల్‌లో చిత్రీకరించారనే ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది. త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఓబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తండ్రి గురువు... కుమార్తె శిష్యురాలు
నిజ జీవితంలో తండ్రీ కూతుళ్ళు అయిన షారుక్ ఖాన్ –సుహానా ఖాన్‌లు ‘కింగ్’ సినిమాలో గురు–శిష్యులుగా కనిపించనున్నారని తెలిసింది. కాకపోతే ఈ చిత్రంలో గురువుగా సుహానాకు షారుక్ కాలేజీ పాఠాలు చెప్పరు. జీవిత పాఠాలు నేర్పుతారు. తనకు అన్యాయం చేసిన వారి భరతం పట్టే పాత్రలో సుహానా నటిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో ఆమె కొన్ని రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయాల్సి ఉంది. ఆన్‌సెట్స్‌లో ఈ రిస్కీ ఫైట్స్ చేయడానికి షారుక్ సహాయం చేస్తున్నారట. అలాగే సినిమాలోనూ యాక్షన్ గురువుగా కనిపిస్తారని టాక్. ఈ సినిమా డిసెంబరు 24న విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకోన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
చాక్‌పీస్... తుపాకీ
‘హిస్టరీ లెసన్స్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి’ అంటూ ఆ మధ్య ‘టీచర్’ చిత్రాన్ని ప్రకటించారు దర్శకుడు బాలు శర్మ. ఈ సినిమా టైటిల్ లోగోలో చాక్‌పీస్ మాత్రమే కాదు... తుపాకీ కూడా కనిపించడం చర్చనీయాంశమైంది. యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఊహించవచ్చు. టీచర్‌గా ప్రముఖ నటి సిమ్రాన్ నటిస్తున్నారు. క్లాస్ రూమ్‌లో పాఠాలు చెప్పడంతో పాటు దుష్టుల పని పట్టే టీచర్‌గా ఆమె కనిపించనున్నారని కోలీవుడ్ టాక్. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది.
దబాంగ్ టీచర్
ఆమె కోటీశ్వరురాలు... కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి, టీచర్‌గా చేరుతుందట. అది కూడా ట్రైనీ టీచర్‌గా... ‘దబాంగ్ టీచర్’ పేరుతో రూపొందుతున్న సిరీస్‌లో కనికా కపూర్ ఈ పాత్రను చేస్తున్నారు. ఆత్మవిశ్వాసం, న్యాయం కోసం పోరాటం, విలక్షణమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే టీచర్ నైనా పాత్ర కోసం తాను సుష్మితా సేన్, ఆలియా భట్‌లను స్ఫూర్తిగా తీసుకున్నానని, వారి బాడీ లాంగ్వేజ్ టీచర్ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా ఉంటుందని కనికా పేర్కొన్నారు. షకేబ్ సయ్యద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ డిజిటల్ వేదికగా త్వరలో వీక్షకుల ముందుకు రానుంది.


