బాపూ జీవితంలో బా | Kasturba was born in Porbander in Gujarat 1869, 1882 Married to Gandhi | Sakshi
Sakshi News home page

బాపూ జీవితంలో బా

Oct 2 2026 4:29 AM | Updated on Oct 2 2026 4:29 AM

Kasturba was born in Porbander in Gujarat 1869, 1882 Married to Gandhi

నేడు గాంధీ జయంతి

పోర్‌బందర్‌లో పెళ్లి. అబ్బాయికి 14. అమ్మాయికి 13. అబ్బాయి గాంధీ. అమ్మాయి కస్తూర్‌బా. ఆ తర్వాత జీవితాంతం గాంధీ చేతిలో కనపడని  ఊతకర్ర అయ్యింది కస్తూర్బా. బతుకు అంటే ఏమిటో, పట్టుదల అంటే ఏమిటో, ప్రేమ ఎంత కఠినంగా ఉంటుందో గాంధీకి నేర్పింది కస్తూర్బా.  గాంధీ ఆమెను ‘బా’ అనేవాడు. ‘బా’ అంటే కేవలం భార్య కాదు, అమ్మ కూడా. గాంధీ జయంతి నాడు కస్తూర్బాను స్మరించడం గాంధీని స్మరించడమే.

జాతిని వెలుగులోకి నడిపించిన గాంధీజీకి చిన్నప్పుడు చీకటంటే చాలా భయంగా ఉండేది. పెళ్లినాటికి కూడా చిన్న పిల్లాడే కాబట్టి రాత్రయితే భయపడేవాడు. కాని కస్తూర్బాకు చీకటన్నా, దెయ్యాలన్నా, దొంగలన్నా భయం ఉండేది కాదు. ‘ఆమె ధైర్యాన్ని చూసి నేను సిగ్గు పడ్డాను. మెల్లగా చీకటంటే భయం వదిలేశాను’ అని గాంధీజీ రాసుకున్నారు. కస్తూర్బానే గాంధీజీ ధైర్యం.

పెళ్లయ్యాక దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ఉన్నప్పుడు గాంధీజీ స్వయంగా టాయిలెట్లు శుభ్రం చేసేవారు. తాము వాడే టాయిలెట్లు మాత్రమే కాకుండా తమ ఇంటికి వచ్చే అతిథులు, పనివారు వాడే టాయిలెట్లు ఆయనే శుభ్రం చేసేవారు. కస్తూర్బా చేత కూడా చేయించేవారు. ఒకరోజు ఆమె ఆ పని ఇష్టపడక కళ్లలో నీళ్లతో నిలబడి ఉండటం గాంధీజీ కంటపడింది. ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది. 

‘నీకు నా ఇంట్లోని పనులు చేయడం అంత కష్టంగా ఉంటే వెళ్లిపో’ అని చేయి పట్టుకొని మెయిన్‌ గేట్‌ వరకూ ఈడ్చుకెళ్లారు. కాని కస్తూర్బా ప్రతిఘటించింది. ‘నీకు సిగ్గుగా లేదు? నీ భార్యనైనందుకు నన్ను ఇంతలా హింసిస్తావా? నా పుట్టిల్లు ఇక్కడికి వేల మైళ్ల దూరంలో ఉంది. నేను ఎక్కడికి పోవాలి? ’ అని నిలదీసింది. ఆ క్షణంలోనే గాంధీజీలోని అహం కరిగిపోయింది. ఒకరిని బలవంతంగా లొంగదీసుకోలేం అని ఆయన తెలుసుకున్నాడు. ‘సహనంతో అవతలి వారిని మార్చడమే అసలైన సత్యాగ్రహం అనే పాఠాన్ని నేను తెలుసుకున్నాను. ఆమే నా తొలి అహింసా గురువు’ అని చెప్పారు గాంధీజీ. 

గాంధీజీ సమాజంలో మార్పు తేవాలనుకున్నప్పుడు ఆయనకు ఎదురైన మొదటి సవాలు కస్తూర్బాయే. అప్పటిదాకా ఆమె మనసులో ఉన్న పాతకాలపు నమ్మకాలను, వివక్షలను మార్చడం గాంధీజీకి అంత తేలిక కాలేదు. కానీ ఎప్పుడైతే కస్తూర్బా వాటన్నింటినీ వదులుకుని గాంధీజీ ఆశయాలను గుండెకు హత్తుకుందో అప్పుడే ఆయనకు బలం వచ్చింది. ‘నేను నా ఇంట్లోని కస్తూర్బానే మార్చగలిగితే, రేపు బాహ్య ప్రపంచాన్ని కూడా మార్చగలను’ అని గాంధీజీ నమ్మారు.

 గాంధీజీ ప్రభావంతో పరివర్తన చెందిన కస్తూర్బా దక్షిణాఫ్రికాలో సంప్రదాయ వివాహాలను రద్దు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో స్వచ్ఛందంగా పాల్గొంది. సరిహద్దు చట్టాలను ధిక్కరించి పీటర్‌ మారిట్జ్‌బర్గ్‌ జైలులో కఠిన కారాగార శిక్షను అనుభవించింది. ఆమె శారీరకంగా ఎంత సుకుమారమైనదో, మానసికంగా అంత వజ్రసంకల్పం కలది. ఒకసారి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినప్పుడు మత్తుమందు తీసుకునే పరిస్థితి లేకపోయినా క్లోరోఫామ్‌ లేకుండానే శస్త్రచికిత్సను భరించిన అసాధారణ నిబ్బరం ఆమెది.

ఆశ్రమంలో అందరూ ఆమెను ‘బా’ అనేవారు. గాంధీజీ కూడా. ‘బా’ అంటే అమ్మ. ఎవరికి జ్వరం వచ్చినా బా ఒడిలోకే. గాంధీ ఉపవాసం ఉంటే, ప్రపంచం ఆయన వైపు చూస్తే, బా మాత్రం ఆయన  పక్కనే కూర్చునేది. ‘నా జీవితం పెరిగే కొద్దీ నా భార్య నాలో లీనమై పోయింది’ అని చెప్పారు గాంధీ. 
ఆయన బ్రిటిష్‌ జైళ్లలో బందీ అయిన ప్రతిసారీ ఆమె బయటకు వచ్చి, మైకు పట్టుకుని, ఆయన ప్రతినిధిగా మారి ఉద్యమ జ్వాలను సజీవంగా ఉంచింది. చంపారన్‌ రైతుల దగ్గర, ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్‌ ఇండియాలో ఆమె మాట్లాడింది, నడిపించింది. 

1942 ఆగస్టు 9న గాంధీని ఆగాఖాన్‌ ప్యాలెస్‌లో నిర్బంధించారు. మరుసటి రోజే బాను కూడా అరెస్టు చేసి అదే ప్యాలెస్‌కు తెచ్చారు. అదే చివరి జైలు అని ఆమెకు తెలియదు. బ్రాంకైటిస్, నిమోనియాతో ఊపిరి ఆడడం లేదు. బ్రిటిష్‌ ప్రభుత్వం సరైన మందులు ఇవ్వలేదు. కొడుకు దేవదాస్‌ పెన్సిలిన్‌ తెచ్చినా ఫలితం లేకపోయింది. చివరి రెండు రోజులు గాంధీ ఆమె తలను ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు. ఆమె ఆ సాయంత్రం ప్రార్థన వింటూ, భర్త ఒడిలో తల పెట్టుకుని, కొడుకులు చుట్టూ ఉండగా కళ్ళు మూసింది. 

ఆ రోజు గాంధీ ‘బా లేని జీవితాన్ని ఊహించలేను’ అన్నారు. చరిత్ర పుటల్లో గాంధీజీ పేరు సువర్ణాక్షరాలతో వెలిగిపోతుంటే... ఆ వెలుగు వెనుక కరిగిపోయిన హారతిలా కస్తూర్బా జ్ఞాపకం ఎప్పటికీ నిలిచే ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement