టీచర్‌.. మా నాన్నను చంపేశారు | Incident in Chowdepalle mandal of Annamayya district | Sakshi
Sakshi News home page

టీచర్‌.. మా నాన్నను చంపేశారు

Apr 7 2026 5:29 AM | Updated on Apr 7 2026 5:29 AM

Incident in Chowdepalle mandal of Annamayya district

అంగన్‌వాడీ టీచర్‌కు చెప్పిన ఐదేళ్ల బాలుడు 

బతుకుదెరువు కోసం తమిళనాడు నుంచి చౌడేపల్లికి వచ్చిన గాంధీ కుటుంబం 

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్యే హత్య చేయించినట్లు అనుమానం  

పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు

చౌడేపల్లె: ‘మా నాన్నను చంపేశారు..? రండి మేడం చూపిస్తా’ అని ఐదేళ్ల బుడతడు అంగన్‌వాడీ టీచర్‌కు చెప్పాడు. చిన్నారి మాటలు విన్న ఆమె ఖంగుతిని విషయాన్ని పోలీసులకు, స్థానికులకు చెప్పింది. పోలీసులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి చూడగా ఆ బాలుడి తండ్రి హత్యకు గురైన విషయాన్ని గుర్తించారు. సంచలనం కలిగించిన ఈ ఘటన అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో వెలుగు చూసింది. 

స్థానికుల కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంకు చెందిన గాందీ(35) రాసతి దంపతులు ఏడాది క్రితం చౌడేపల్లి మండలం ఊటూరు సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో కూలీ పనికి చేరారు. వీరికి సందీప్‌(5) కుమారుడు ఉన్నాడు. అయితే బోయకొండ వద్ద గల ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన నరసింహులుతో రాసతికి పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. గాందీకి ఈ విషయం తెలిసి పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు భార్యకు చెప్పాడు. ప్రయోజనం లేకపోవడంతో అతను సొంతూరు వెళ్లిపోయాడు. 

పది రోజుల క్రితం మళ్లీ ఆర్‌ఆర్‌ కాలనీకి వచ్చాడు. తనతో పాటు రావాలని భార్యను బతిమలాడినట్లు తెలిసింది. ఈక్రమంలో ఆదివారం ఇంటి వద్ద ఉన్న గాందీని కొందరు స్నేహితులు పక్షిరాజపురం సమీపంలోకి తీసుకెళ్లారు. అయితే తన తండ్రి గాందీని కొందరు కొట్టి చంపడం చూశానని బుడతడు సందీప్‌ అంగన్‌వాడీ టీచర్‌కు చెప్పడం.. ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హత్యగా నిర్ధారించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడి చేత రాసతినే చంపించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలానికి చేరుకుని గాంధీ శరీరంపై గాయాలను పరిశీలించారు. బాలుడితో మాట్లాడి కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరుకు తరలించారు. మృతుడి భార్య రాసతి పరారీలో ఉండగా ప్రియుడు, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాలుడికి ఐసీడీఎస్‌ శాఖ ఆధ్వర్యంలో రక్షణ కల్పించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement