భారత చారిత్రక డాక్యుమెంట్‌కు ఇంతటి ధర పలకడం ఇదే తొలిసారి
న్యూఢిల్లీ: సత్యం, అహింస, సేవ మొదలు మతం, బ్రహ్మచర్యందాకా పలు అంశాలపై లోతైన అవగాహనతో గాందీజీ స్వదస్తూరీతో రాసిన 688 అరుదైన రాతప్రతులు ఒక వేలంపాటలో రికార్డు ధర పలికాయి. గాం«దీజీకి ఆప్తుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఆనంద్ టి.హింగోరానీ తన భార్య విద్య 1944లో చనిపోయాక శోకసంద్రంలో మునిగారు. దీంతో ఆనంద్‌కు ఓదార్పుగా ఉంటాయనే ఉద్దేశంతో ఆయన కోసం గాందీజీ పలు అంశాలపై తన అభిప్రాయాలను గుదిగుచ్చుతూ రోజూ చిన్నపాటి లేఖలు, సందేశాలు, రచనలు పంపించారు.
ఇలా రెండేళ్లపాటు రోజూ సందేశాలు ఆనంద్‌కు వెళ్లాయి. వీటికి సంబంధించిన లేఖలు, రాతప్రతులు, ఫొటోలు, గాం«దీజీకి సంబంధించిన వ్యక్తిగత వస్తువులు కలిపి మొత్తంగా 86 భాగాల చారిత్రక డాక్యుమెంట్లను తాజాగా ‘సాఫ్రాన్‌ఆర్ట్’సంస్థ వేలంవేయగా ఏకంగా రూ.16.20 కోట్ల ధర పలికాయి. వీటిని భారత్‌లోని అజ్ఞాత వ్యక్తి ఒకరు కొనుగోలుచేశారని, ఈ అరుదైన సంకలనాలు దేశంలోనే ఉంటాయని వేలంసంస్థ స్పష్టంచేసింది.
సత్యం, అహింసా, బ్రహ్మచర్యం, అలౌకికానందం, ధైర్యం, మతసామరస్యం, అంటరానితనం, ప్రార్థన, రామయణం, సేవ, కర్తవ్యం, ఆకలి, బాధ్యత, స్వరాజ్యం, నైతిక బాధ్యత, మౌనం, ఆధ్యాత్మికత, ఆత్మశోధన, దైవశోధన తదితర అంశాలపై గాందీజీ రోజూ రాసిన రాతప్రతులను వేలంలో విక్రయించారు. భారత స్వాతం్రత్యోద్యమంలో గాందీజీ మమేకమైన విధానంతోపాటు తనకు వ్యక్తిగత సహాయకులు, ఆప్తులతో గాం«దీజీ మెలిగిన వైనాల తాలూకు వివరాలూ వీటిల్లో ఉన్నాయి.
‘‘గాం«దీజీ జీవితం, ఆలోచనల తాలూకు జ్ఞాపకాలను వేలంపాట ద్వారా మరోసారి ప్రపంచంముందుకు తెచ్చే అదృష్టం మాకు దక్కింది. మిత్రులు, వ్యక్తిగత బంధాలకు గాం«దీజీ ఎంతటి విలువ ఇచ్చారో ఆయన రచనలతో తెల్సిపోతుంది’’అని సాఫ్రాన్‌ఆర్ట్ సహ వ్యవస్థాపకుడు దినేశ్ వాజీరాని అన్నారు. ఈ రచనల ప్రతులను వాస్తవానికి గతంలోనే ‘ఏ థాట్ ఫర్ ది డే’ పేరిట సంకలనంగా ముద్రించగా ఇప్పుడు నిజప్రతులను ‘గాందీ: ఫ్రమ్ ది కలెక్షన్ ఆఫ్ ఆనంద్ టి. హింగోరానీ’పేరిట వేలంవేశారు.
దైవం, భగవద్గీత అంశాలపై గాందీజీ ఆలోచనల సమాహారమైన ‘మెసేజ్ ఆన్ గాడ్’ప్రతులను విడిగా వేలంవేయగా రూ.1.68 కోట్లకు అమ్ముడుపోయాయి. నూలు వడకడంలో తనకున్న ఆసక్తిని కనబరుస్తూ రాసిన రెండు లేఖలతోపాటు చెక్కపెట్టెలో ఉండే చర్ఖాను వేలంవేయగా రూ.1.02 కోట్ల ధరకు అమ్ముడుపోయాయి. గాంధీ సంతకం ఉన్న ఆయన ఫొటో రూ.78 లక్షలకు అమ్ముడుపోయింది. ఆర్థిక స్వాతంత్య్రంపై ఆయన రాసిన ఇంకొన్ని లేఖలు, టెలిగ్రామ్‌లు, పోస్ట్‌కార్డ్‌లు రూ.57.60 లక్షలకు అమ్ముడుపోయాయి.


