IND vs AUS: భారత్‌తో రెండో టెస్టు.. ఆసీస్‌ ఆలౌట్‌ | IND A Vs AUS A 2nd Unofficial Test Day 2, Harper Century Helps Australia A Post 358 Before All Out, Check Details Inside | Sakshi
Sakshi News home page

IND vs AUS: భారత్‌తో రెండో టెస్టు.. ఆసీస్‌ ఆలౌట్‌

Sep 30 2026 12:46 PM | Updated on Sep 30 2026 1:28 PM

IND A vs AUS A 2nd Unofficial Test Day 2:  Harper Century Aus All out

PC: CApondicherry X

భారత్‌- ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో ఆస్ట్రేలియా- ‘ఎ’ టీమ్‌ మిడిలార్డర్‌ మెరుగ్గా రాణించింది. ఫలితంగా కంగారూలు తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరుకు ఆలౌట్‌ అయ్యారు. పుదుచ్చేరి వేదికగా రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య మంగళవారం రెండో మ్యాచ్‌ మొదలైంది.

టాపార్డర్‌ విఫలం
టాస్‌ గెలిచిన ఆసీస్‌ జట్టు కెప్టెన్‌ పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, భారత బౌలర్ల ధాటికి టాపార్డర్‌ కుదేలు కావడంతో కంగారూ జట్టు కష్టాల్లో పడింది. ఓపెనర్లు సామ్‌ కొన్‌స్టాస్‌ (2), జోష్‌ ఫిలిప్‌ (5) పూర్తిగా విఫలం కాగా.. నాథన్‌ మెక్‌స్వీనీ (34) కూడా నిరాశపరిచాడు.

ఇక హ్యాండ్స్‌కోంబ్‌ డకౌట్‌ కాగా.. జేసన్‌ సంఘా (46), లియామ్‌ స్కాట్‌ (34) మెరుగైన ఆట తీరుతో ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. అయితే, ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సామ్‌ హార్పర్‌ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ గతినే మార్చివేశాడు. తొలి రోజు ఆటలో అజేయ శతకంతో క్రీజులో నిలిచాడు హార్పర్‌.

ఆదుకున్న హార్పర్‌
ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా అన్షుల్‌ కాంబోజ్‌ బౌలింగ్‌లో కుమార్‌ కుశాగ్రాకు క్యాచ్‌ ఇవ్వడంతో హార్పర్‌ సెంచరీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 223 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 128 పరుగులు సాధించాడు.

ఆసీస్‌ ఆలౌట్‌
మిగిలిన వారిలో టాడ్‌ మర్ఫీ (33), జై రిచర్డ్‌సన్‌ (31) అతడికి సహకారం అందించారు. కోరే రొచిసియోలి 16 పరుగులతో అజేయంగా నిలవగా.. లియామ్‌ హాచర్‌ (0) పదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 116.3 ఓవర్లు ఆడి 358 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

భారత బౌలర్లలో స్పిన్నర్లలో షమ్స్‌ ములాని మూడు, ఆల్‌రౌండర్‌ తనుశ్‌ కొటియాన్‌ ఒక వికెట్‌ తీయగా.. పేసర్లు అన్షుల్‌ కాంబోజ్‌, నచికేత్‌ భూటే చెరో మూడు వికెట్లు పడగొట్టారు. కాగా తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఆసీస్‌ను 162 పరుగుల తేడాతో చిత్తుగా చేసింది. 

చదవండి: కోహ్లి కచ్చితంగా పశ్చాత్తాప పడతాడు: టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement