ఒకప్పుడు పాలకులు మతం గురించి పదే,పదేమాట్లాడే వారు కారు.మూఢ విశ్వాసాలను ప్రోత్సహించేవారు కారు. బాణామతి,చేతబడి వంటి వాటిని అరికట్టడానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకునేవారు. మతం,దైవ భక్తి అన్నవి వ్యక్తిగత విషయాలుగానే భావించేవారు.కాని కాలం మారింది. శాస్త్రీయ దృక్ఫధం స్థానంలో మతాల ప్రస్తావన అధికంగా వస్తోంది. ప్రజలు భక్తిని, మతాన్ని ఆచరించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అలాగే ఆయా ఉత్సవాలలో, మతపరమైన కార్యక్రమాలలో ప్రజలకు ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పించడాన్ని ఎవరూ ఆక్షేపించరు. కాని ఇప్పుడేం జరుగుతోంది. వాటిని కూడా రాజకీయాలకు వాడుకోవడానికి నేతలు పోటీ పడుతున్నారు.
తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే రాజకీయం ఇలా తయారవుతోందేమిటా అన్న ఆవేదన కలుగుతుంది. రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ బిఆర్ఎస్‌పై చేతబడుల విమర్శ చేశారు. 'పదేళ్లు అధికారంలో ఉన్నవారు, పాతికేళ్లు తెలంగాణలో రాజకీయం చేసినవారు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ,ప్రజలకు వ్యతిరేకంగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చేతబడులు ,అఘోరా పూజలు చేయించడం అత్యంత దుర్మార్గం "అని రేవంత్ వ్యాఖ్యానించారు. బుద్ది సరిగా లేకపోతే ఆ క్షుద్ర పూజలు తిరగబడతాయి అని ,అదే కనుక జరిగితే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా అష్టదిగ్భందనం చేస్తాయి అని ఆయన హెచ్చరించారు.
'ఎల్ నిలో ప్రభావంతో రాష్ట్రం ఎండిపోవాలని,కరువు వచ్చి జనాలు అల్లాడిపోవాలని ప్రభుత్వం బదనాం కావాలని అఘోరా పూజలు చేశారు "అని ఆయన ఆరోపించారు. అయితే దేవుడు ,అదృష్టం తమ వైపే ఉన్నాయని, తమ సంకల్పం మంచిది కాబట్టి ఈ సమయంలోను వర్షాలు కురిశాయని రేవంత్ చెప్పారు. తమకు దేవుడి దయ, ప్రజల ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఎందుకు వచ్చింది? కొద్దికాలం క్రితం బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీష్ రావు కర్నాటకలో కొన్ని గుడులను సందర్శించారు. అది ఆయన వ్యక్తిగత స్వేచ్చ. నమ్మకం.
కాని కాంగ్రెస్ అధికార ప్రతినిది సామా రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ హరీష్ రావు క్షుధ్రపూజలు చేయించడానికి గుడులకు వెళ్లారని ఆరోపించారు. దీనిపై హరీష్ రావు మండిపడ్డారు. తాను అలాంటివి చేయలేదని, ఇలా మాట్లాడిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపుతున్నట్లు ప్రకటించారు. అయినా కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ వివాదంలోకి వచ్చి, తన వద్ద ఆధారాలు ఉన్నాయని హరీష్‌పై మళ్లీ ఆరోపణలు చేశారు. తదుపరి ఏకంగా ముఖ్యమంత్రి రేవంతే ఈ అభియోగం మోపారు. ఇలాంటివి చెబుతున్నారంటే వీటిని వీరు నమ్ముతున్నారనే కదా! వ్యక్తిగతంగా ఎలాంటి విశ్వాసం అయినా పెట్టుకోవచ్చు. కాని ప్రజలలో మాట్లాడడానికి ముందు వీటి ప్రభావం గురించి ఆలోచించుకోవాలి.
ఒకప్పుడు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో బాణామతి అనే అంధ విశ్వాసం ఉండేది. బాణామతి, చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో కొందరిపై దాడి జరిగేది. కొంతమంది ఈ క్రమంలో హత్యలకు కూడా గురైన సందర్భాలు ఉండేవి.క్షుధ్రపూజలు చేస్తున్నారన్న సందేహంతో నోటిలోని పళ్లు కూడా పీకేసిన కేసులు కూడా నమోదయ్యేవి.హైదరాబాద్ నగరం విస్తృతం అవడం,శాస్త్ర విజ్ఞానం పెంపొందడంతో ఇవి ఇటీవలికాలంలో బాగా తగ్గాయి.ఈ తరుణంలో సి.ఎమ్.స్థానంలో ఉన్నవారు ఈ క్షుద్రపూజల గురించి మాట్లాడడం వల్ల రాజకీయంగా ఆయనకు ఎంత లబ్ది చేకూరుతుందో కాని,ప్రజలలో మాత్రం మూఢ విశ్వాసాలు మరింత పెరగడానికి దోహద పడతాయి. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశంలో శాస్త్రీయ దృక్ఫధం పెరగాలని వాంచించారు. ఇందుకోసం ఐఐటి వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలను నెలకొల్పారు. అలా అని ఆయనకు మతపరమైన విశ్వాసాలు లేవని కాదు. తను మరణించిన తర్వాత చితాభస్మాన్ని పవిత్రమైన నదులులో కలపాలని కోరుకున్నారు.
తదుపరి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కంప్యూటర్ వినియోగాన్ని ప్రోత్సహించారు.పివి నరసింహారావు ప్రదానిగా ఉన్నప్పుడు చంద్రస్వామి అన్న తాంత్రికుడు చక్రం తిప్పేవారని ప్రచారం జరిగేది. అయినా ఆయన మత విశ్వాసాలు ఎలా ఉన్నా, బాబ్రి మసీదు కూల్చివేసిన ఘటనపై తీవ్రంగా ఆవేదన చెందారు. నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డితో సహా ఆయా ముఖ్యమంత్రులకు కొందరు జ్యోతిష్కులపైన, పండితులపైన నమ్మకాలు ఉండేవి. అయినా వారు ఆ నమ్మకాలను ప్రజలపై రుద్దాలని భావించలేదు. బహిరంగ సభలలో వాటి గురించి పెద్దగా ప్రస్తావన తెచ్చేవారు కారు.
భారతీయ జనతా పార్టీ దేశంలో విస్తృతం అయ్యే కొద్ది ఈ మతపరమైన విశ్వాసాలు పెరుగుతూ వచ్చిన మాట నిజమే.కాని అదే పార్టీకి చెందిన కొందరు నేతలు మూడ విశ్వాసాలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడేవారు.కరువు పరిస్థితులు ఇప్పుడే కాదు.గతంలో కూడా వచ్చేవి.అప్పుడు కూడా కొందరు ముఖ్యమంత్రులు వరుణ యాగాలు చేయించారు.కొద్ది రోజుల క్రితం రేవంత్ కూడా సాగర్ వద్ద వరుణ యాగం నిర్వహించారు. గత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయా సందర్భాలలో యాగాలు, యజ్ఞాలు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు రాజకీయాలలోకి వచ్చాక ,మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ వంటివారు స్వామిజీ అని సంభోధించేవారు.అయినా ఎన్.టి.ఆర్.తను నటించిన పలు సినిమాలలో ఈ మూఢ విశ్వాసాలకు , మతం పేరుతో మోసాలు చేసేవారికి వ్యతిరేకంగా పలు సన్నివేశాలు పెట్టేవారు.ప్రభుత్వంలో ఉన్నప్పుడు మతపరమైన అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.అలా అని ఆయనకు దైవం పై నమ్మకం లేదని కాదు.ప్రస్తుత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు పెద్దగా మతపరమైన రాజకీయాలు చేసేవారుకారు. బిజెపికి వ్యతిరేకంగా ఉన్న రోజుల్లో ఆ పార్టీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించేవారు.రాజకీయంగా తనకు లాభం జరుగుతుందనుకున్నప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకునేవారు. ఒకరకంగా చెప్పాలంటే అవకాశవాద రాజకీయాలు చేయడంలో ఆయనకు సాటి లేరనుకోవవచ్చు.
2019లో ఓటమి ఎదురైన తర్వాత అప్పటి వైసిపి ప్రభుత్వాన్ని ,ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ను ఓడించాలంటే మతపరమైన విమర్శలు చేయాలని తలపెట్టేవారు. కొత్త పూజారికి పంగనామాలు ఎక్కువ అన్న సామెత ఉంది. దానికి అనుగుణంగా ఉన్నవి, లేనివి ఆరోపణలు చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఎక్కడా సంకోచించలేదన్న అభిప్రాయం ఉంది.2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దోరణి మరింతగా పెరిగింది. తిరుమల స్వామివారి ప్రసాదంపై వివాదం సృష్టించి దానిని జగన్ కు ఆపాదించడం వరకు వెళ్లారు.జగన్ ఆలయాలకు వెళ్లడాన్ని కూడా ఆక్షేపించేవరకు వెళ్లి మీ దేవుడు,మా దేవుడు అంటూ వ్యాఖ్యలు చేసే దశకు చేరుకున్నారు.బహిరంగ సభలలో ఇలాంటి ప్రసంగాలు చేయడం అలవాటుగా చేసుకున్నారు.
అమరావతి దేవత రాజధాని అంటూ కొత్త నినాదం చేబూని ప్రజలను ఆకర్షించే పనిలో ఉంటున్నారు.రాజధానిలో జరిగే అక్రమాలు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు ఇలా మతాన్ని,దేవుడిని అవసరం ఉన్నా,లేకపోయినా ప్రస్తావిస్తున్నారని ఆయన ప్రత్యర్ధులు విమర్శిస్తుంటారు. ఇక ఈ మధ్య మరో అడుగు ముందుకేసి శ్రీవెంకటేశ్వర స్వామి వద్దకు వర్చువల్ గా వెళ్లానని అంటున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం సజావుగా సాగాలని ప్రార్ధించానని ఆయన చెబుతున్నారు.ఎల్లో మీడియా గతంలో జగన్ ఆత్మలతో మాట్లాడానని చెబుతున్నారంటూ ఒక తప్పుడు కధనాన్ని సృష్టించి ప్రచారం చేసింది.
ఇప్పుడు చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలను మాత్రం పెద్దగా కనిపించకుండా జాగ్రత్తపడడం గమనించదగ్గ అంశం.చివరిగా ఒక మాట చెప్పాలి. ప్రముఖ ఆధాత్మిక వేత్త,ఎపి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్న చాగంటి కోటేశ్వరరావు ఒక వ్యాఖ్య చేశారు.రాజు ధర్మాన్ని పాటించకపోతే వర్షాలు కురవవని ఆయన తన ధార్మిక ప్రసంగంలో చెప్పారు. వర్షాలు పడకపోవడానికి ఎల్ నిలో కారణమని నమ్మమంటారా?లేక చాగంటి అభిభాషించినట్లుగా రాజు ధర్మంగా లేకపోవడం వల్లనే అని అనుకోమంటారా?అంటే ముఖ్యమంత్రులు ఏమి చెబుతారు.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


