పసిఫిక్ మహాసముద్రంపై ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభం
భారత వాతావరణ శాఖ ధ్రువీకరణ
వచ్చే నెలలో సానుకూల ఐఓడీ ఏర్పడితే తగ్గనున్న ప్రభావం
న్యూఢిల్లీ: ఎల్‌నినో ముప్పు ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంపై ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న నైరుతి రుతుపవన కాలంలో ఈ ఎల్‌నినో ప్రభావం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు 2026 జూన్‌కు సంబంధించిన నివేదికను తాజాగా విడుదల చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడాన్ని ఎల్‌నినోగా పరిగణిస్తారు.
మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్‌నినో పరిస్థితులకు అవసరమైన పరిమితిని దాటిపోయినట్లు ఐఎండీ పేర్కొంది. సముద్రం వేడెక్కడంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. సముద్ర–వాతావరణ అనుసంధాన వ్యవస్థ ఇప్పుడు ఎల్‌నినో స్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. మాన్సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్(ఎంఎంసీఎఫ్‌ఎఫ్) అంచనాల ప్రకారం.. రుతుపవన కాలం గడుస్తున్న కొద్దీ ఎల్‌నినో తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. మధ్య ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్‌నినో పరిమితిని దాటాయి.
ఉపరితలం కింద బలమైన ఉష్ణోగ్రత వ్యత్యాసాలు
ఎల్‌నినో పరిస్థితిని గణించడానికి ఉపయోగించే ‘నియో 3.4’సూచీకి సంబంధించిన తాజా మూడు నెలల సగటు విలువ +0.5 సెంటీగ్రేడ్ స్థాయిని దాటింది. ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమయ్యాయని దీన్నిబట్టి చెప్పొచ్చు. పసిఫిక్ మహాసముద్రంలోని చాలా భాగాల్లో ఉపరితలం కింద కూడా బలమైన ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.
రాబోయే రోజుల్లో కిందిభాగంలోని వేడి నీరు ఉపరితలానికి చేరుకోవడం కొనసాగుతుందని, దాంతో ఎల్‌నినో ఉధృతి మరింత పెరుగుతుందని స్పష్టంచేసింది. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం.. జూన్–ఆగస్టు నెలల్లో మధ్య పసిఫిక్ అంతటా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వ్యత్యాసాలు కొనసాగుతాయి. జూలై నుంచి మధ్య, తూర్పు పసిఫిక్ ఎల్‌నినో పరిస్థితులు విస్తరించి, మరింత బలపడతాయి. నైరుతి రుతుపవనాల కాలంలో ఎక్కువ భాగం మితమైన, బలమైన ఎల్‌నినో పరిస్థితులు ఉంటాయని తాజా అంచనాలు సూచిస్తున్నాయి.
సానుకూల ఐఓడీతో..
ఎల్‌నినో కారణంగా భారతదేశంలో బలహీనమైన రుతుపవన వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, సుదీర్ఘ పొడి వాతావరణ పరిస్థితులు, కరువు ముప్పు పెరగడం వంటివి తలెత్తే అవకాశం ఉంది. అయితే, దేశంలో రుతుపవనాలను ప్రభావితం చేసే అంశం కేవలం ఎల్‌నినో మాత్రమే కాదని ఐఎండీ స్పష్టంచేసింది. ప్రస్తుతం హిందూ మహాసముద్రంపై తటస్థ ఇండియన్ ఓషియన్ డైపోల్(ఐఓడీ) పరిస్థితులు నెలకొని ఉన్నాయని, రుతుపవన కాలమంతటా ఇవి కొనసాగే అవకాశం ఉందని తెలియజేసింది.
తటస్థ ఐఓడీ అంటే, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావాలను ఇది గణనీయంగా తీవ్రతరం చేయడం లేదా సమతుల్యం చేయడానికి జరిగే అవకాశం తక్కువ అని అర్థం. జూన్ 11న ఎల్‌నినో ఆరంభమైనట్లు జపాన్ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఇండియా విషయంలో ఒక సానుకూల అంశాన్ని కూడా ప్రస్తావించింది. జూలైలో సానుకూల ఐఓడీ ఏర్పడే అవకాశం ఉందని, ఇది దేశంలోని రుతుపవన వర్షపాతంపై ‘సూపర్ ఎల్‌నినో’చూపే ప్రతికూల ప్రభావాలను కొంతవరకు తగ్గించడంలో సహాయపడవచ్చని పేర్కొంది. రుతుపవన కాలం కొనసాగుతున్న కొద్దీ, పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తూ, నెలవారీ తాజా సమాచారాన్ని జారీ చేస్తామని ఐఎండీ తెలిపింది.


