భారతదేశంలో కురిసే నైరుతి రుతుపవనాల వర్షంలో దాదాపు 25 శాతం (నాలుగో వంతు) వర్షపు నీరు అసలు నేలను తాకకముందే గాలిలోనే ఆవిరైపోతోందని పుణేలోని ఐఐటీఎం (ఇండియన్ ఇన్‌నిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ) శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. వర్షపు చుక్కలు గాల్లోనే ఆవిరైపోయే పరిమాణాన్ని శాస్త్రవేత్తలు ప్రత్యక్ష పరిశీలనల ద్వారా కచ్చితంగా అంచనా వేయడం ఇదే మొదటిసారి. (IITM Pune Study)
దశాబ్ద కాలపు పరిశోధన.. ఎలా గుర్తించారు?
జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే రుతుపవనాలపై శాస్త్రవేత్తలు సుదీర్ఘంగా పరిశోధనలు చేశారు.
డేటా విశ్లేషణ: పదేళ్లుగా సేకరించిన వర్షపాతం, వాతావరణంలోని ఐసోటోప్ డేటాను క్షుణ్ణంగా విశ్లేషించి శాస్త్రవేత్తలు ఈ ముగింపునకు వచ్చారు.
ప్రాంతాన్ని బట్టి మారుతున్న ఆవిరి శాతం
ఈ వర్షపు నీటి ఆవిరీకరణ (Evaporation) దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులను బట్టి ఇది మారుతూ ఉంటుంది:
పశ్చిమ కనుమలు: ఇక్కడ తేమ ఎక్కువగా ఉండటం వల్ల కేవలం 4 నుంచి 6 శాతం వర్షం మాత్రమే గాల్లో ఆవిరవుతుంది.
వాయవ్య భారతదేశం: రాజస్తాన్ వంటి పొడి వాతావరణం ఉండే ప్రాంతాల్లో ఇది గరిష్టంగా 40 శాతం వరకు ఉంటోంది.
ఇలా ఎందుకు జరుగుతోంది?
వర్షపు చినుకులు మేఘాల నుంచి పడుతున్న సమయంలో.. వాటి చుట్టూ ఉండే వేడి, పొడి గాలి కారణంగా కొంత నీరు నేలను తాకకుండానే గాలిలోకి ఆవిరి రూపంలో కలిసిపోతుంది. ముఖ్యంగా పరిమాణంలో చిన్నవిగా ఉండే చినుకులు ఇలా ఎక్కువగా ఆవిరైపోతుంటాయి.
ఈ పరిశోధన వల్ల ఉపయోగం ఏంటి?
ఈ సరికొత్త ఆవిష్కరణ వాతావరణ శాస్త్రంలో చాలా కీలకం కానుంది.
కచ్చితమైన అంచనాలు: రుతుపవనాల గమనాన్ని, వర్ష సూచనలను మరింత కచ్చితంగా అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది.
విపత్తుల నిర్వహణ: మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా... దేశంలో వచ్చే వరదలు, కరువు పరిస్థితులను ముందే ఊహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ పరిశోధన శాస్త్రవేత్తలకు ఎంతో తోడ్పడుతుంది.
- సాక్షి స్పెషల్ డెస్క్


