breaking news
Monsoon progression
-
ట్రేడింగ్ ట్రెండ్: సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరే చాన్స్
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు ఈ వారంలో జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. రుతుపవనాల వార్తలు మినహా దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ఇతర అంశాలేవీ లేనందున అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ధోరణికి అనుగుణంగానే కదలాడతాయని చెబుతున్నారు. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు కొనసాగడంతో గతవారం సూచీలు దాదాపు ఒక శాతానికి పైగా ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 759 పాయింట్లు, నిఫ్టీ 263 పాయింట్లు పుంజుకున్నాయి. వారాంతం రోజైన శుక్రవారం మునుపెన్నడూ లేనివిధంగా సరికొత్త రికార్డు స్థాయిలో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ జీవితకాల గరిష్ట స్థాయి (63,583)కి 198 పాయింట్లు, నిఫ్టీ ఆల్‌టైం హై (18,888)కి 62 పాయింట్లు చేరువులో ఉన్నాయి. సరికొత్త రికార్డు స్థాయిల నమోదు ఇప్పుడు నామమాత్రమే. సరికొత్త రికార్డులు సృష్టించిన తర్వాత ర్యాలీ కొనసాగుతుందా..? లేక గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగి వెనక్కి వస్తుందా అనేది వేచి చూడాల్సి అంశం. ఒకవేళ మొమెంటమ్ కొనసాగితే నిఫ్టీ 19,000 స్థాయికి చేరవచ్చు. అమ్మకాలు జరిగితే దిగువ స్థాయిలో 18,676 వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది’’ అని ఏంజెల్ వన్ టెక్నికల్, డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ సమీత్ చవన్ తెలిపారు. ప్రపంచ పరిణామాలు యూరోజోన్ నిర్మాణ ఉత్పాదక, కరెంట్ అకౌంట్ డేటా, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మంగవారం వెలువడనున్నాయి. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా కాంగ్రెస్ ఎదుట బుధవారం (జూన్ 21న) అమెరికా దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ (టెస్టిమోనీ) ఇవ్వనున్నారు. పావెల్ వ్యాఖ్యలను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ వర్గాలు నిశితంగా గమనించే వీలుంది. అదే రోజున జపాన్ కేంద్ర బ్యాంక్ పాలసీ సమావేశ నిర్ణయాలు, బ్రిటన్ మే ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. గురువారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లు వెల్లడవుతాయి. వారాంతం రోజున యూఎస్ తయారీ, సర్వీసు రంగ గణాంకాలు, జపాన్ ద్రవ్యోల్బణ, బ్రిటన్ రిటైల్ అమ్మకాలు విడుదల కానున్నాయి. వర్షపాత వార్తలపై దృష్టి స్టాక్ మార్కెట్ కదలికపై నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపే అవకాశం ఉంది. రుతుపవనాల విస్తరణలో మరికొంత జాప్యం జరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నైరుతి రుతుపవనాల ఆలస్యం, ఎల్‌నినో ప్రభావం వర్షపాతంపై ఉండదని, దేశంలో సాధారణ వర్షపాతం నమోదవ్వొచ్చంటున్నారు. సాధారణ రుతుపవనాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎఎంసీజీ, ఎరువులు, వ్యవసాయం, వినియోగ, ఆటో రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. రెండు వారాల్లో రూ.16,405 కోట్లు భారత మార్కెట్లోకి విదేశీ నిధుల వెల్లువ కొనసాగుతోంది. గత మూడు నెలలుగా భారత ఈక్విటీలపై ఆసక్తి కనబరుస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ జూన్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. ఇప్పటి వరకు (116 తేదీల మధ్య) రూ.16,405 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ, వృద్ధిపై పలు రేటింగ్ ఏజెన్సీల సానుకూల ప్రకటనల అంశాలు ఎఫ్‌పీఐల కొనుగోళ్లకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. -
గ్రీసు, రుతుపవనాల ఆధారంగా ట్రెండ్
న్యూఢిల్లీ : దేశంలో రుతుపవనాల గమనం, అంతర్జాతీయంగా గ్రీసు దేశపు రుణ సంక్షోభ సమస్యల ఆధారంగా ఈ వారం మార్కెట్ ట్రెండ్ వుంటుందని విశ్లేషకులు అంచనావేశారు. దేశీయంగా కీలకమైన అంశమేదీ లేనందున, రుతుపవనాల గమనం మార్కెట్లో స్వల్పకాలిక ట్రెండ్‌ను నిర్దేశిస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అన్నారు. ఇప్పటివరకూ దేశంలో వర్షాలు సగటుకంటే అధికంగానే కురిశాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో గతవారం దేశీయ మార్కెట్ పుంజుకుంది. జూలై, ఆగస్టు నెలల్లో రైతులు పంటలు వేయనున్నందున, ఇకముందు రుతుపవనాల కదలికలు ప్రధానమని ఆయన చెప్పారు. ఇక అంతర్జాతీయపరంగా గ్రీసు రుణ సంక్షోభ పరిష్కారానికి జరుగుతున్న ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను ప్రభావితం చేస్తుందని ఆయన చెప్పారు. ఈ నెలాఖరుకల్లా గ్రీసు ఐఎంఎఫ్‌కు ఇవ్వాల్సిన మొత్తం చెల్లించకపోతే, ఆ దేశం దివాలా తీసినట్లవుతుంది. దాంతో స్టాక్, బాండ్ మార్కెట్లు అతలాకుతలమవుతాయని అంచనా. అయితే గ్రీసుకు అవసరమైన నిధులిచ్చే అంశమై యూరోపియన్ యూనియన్ ఈ సోమవారం జరపనున్న సమావేశం కీలకం కానుందని అగర్వాల్ వివరించారు. జూన్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ గురువారం ముగియనున్న నేపథ్యంలో మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని మరోవైపు నిపుణులు హెచ్చరించారు. గతవారం మార్కెట్.. గతవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వంలో ర్యాలీ జరిగిన ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు 3-3.5 శాతం మధ్య పెరిగాయి. సెన్సెక్స్ 891 పాయింట్లు లాభపడి 27,316 పాయింట్ల వద్దకు చేరింది. నిఫ్టీ 242 పాయింట్ల లాభంతో 8,225 పాయింట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 12 శాతం పెరగ్గా, ఓఎన్జీసీ, మహీంద్రా, హిందుస్థాన్ యూనీలీవర్‌లు 5 శాతంపైగా ఎగిసాయి.