మమతకు రితబ్రత వర్గం కౌంటర్
‘అసలైన’టీఎంసీ మాదేనంటూ ప్రకటన
పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా విప్లవ్
కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జావేద్ ఖాన్
ఎన్నికల సంఘానికి ఆధారాల సమర్పణ
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వర్గపోరు తారస్థాయికి చేరింది. టీఎంసీ పార్టీపై పట్టు కోసం మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అసమ్మతి నేత రితబ్రత బెనర్జీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. తాజాగా మమతా బెనర్జీకి సవాల్ విసురుతూ రితబ్రత వర్గం పార్టీకి సమాంతర నాయకత్వాన్ని ప్రకటించింది.
తామే ’అసలైన’తృణమూల్ కాంగ్రెస్ అని ప్రకటిస్తూ సీనియర్ నేత, మాజీ మంత్రి విప్లవ్ మిత్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. ఇటీవల చంద్రిమా భట్టాచార్య తన పదవికి రాజీనామా చేసిన అనంతరం మమతా బెనర్జీ తనను తాను టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రకటించుకున్నారు. దీనికి దీటుగా బదులివ్వాలని నిర్ణయించుకున్న రితబ్రత వర్గం కోల్‌కతాలోని తప్సియాలో ఉన్న ఒక హోటల్‌లో సుదీర్ఘ సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో పార్టీ సమాంతర కమిటీలను ఖరారు చేసింది. ఇందులో భాగంగా విప్లవ్ మిత్రకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.
.కస్బా ఎమ్మెల్యే జావేద్ ఖాన్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. మమతా బెనర్జీ నాయకత్వాన్ని ధిక్కరిస్తూ తమదే అసలైన పార్టీ అని నిరూపించుకునే ఉద్దేశంతోనే ఈ నియామకాలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది. ఈ కమిటీల నియామకాలకు ముందు రితబ్రత బెనర్జీతో పాటు ఆయన మద్దతుదారులు ప్రధాన ఎన్నికల అధికారిని కలిశారు. టీఎంసీ పార్టీ తమదేనని వాదిస్తూ అందుకు మద్దతుగా పలు కీలక పత్రాలను ఎన్నికల సంఘానికి సమరి్పంచారు. అనంతరం సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై తమ వర్గంతో సుదీర్ఘంగా చర్చించారు.
21న అమరవీరుల దినోత్సవం
21వ తేదీన జరగనున్న టీఎంసీ ప్రతిష్టాత్మక కార్యక్రమం అమరవీరుల దినోత్సవం(షహీద్ దివస్) నిర్వహణపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విక్టోరియా హౌస్ ఎదుట కార్యక్రమం నిర్వహించేందుకు యంత్రాంగం అనుమతి నిరాకరించడంతో గాంధీ విగ్రహం వద్ద సభను నిర్వహించేందుకు అనుమతి కోరినట్లు రితబ్రత బెనర్జీ వెల్లడించారు. ప్రతి ఏటా నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది తమ వర్గం అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుందని, అధికారుల నుంచి అనుమతి లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


