సాక్షి, స్పెషల్ డెస్‌్క: దేశ సరిహద్దులో ఉన్న సింఘాబాద్ రైల్వే స్టేషన్ మనదేశంలో చివరి రైల్వేస్టేషన్‌గా పేరు తెచ్చుకుంది. ఇది వెస్ట్‌బెంగాల్, మాల్టా జిల్లా, హబీబ్‌పూర్‌కు సమీపంలో ఉంది. ఒకప్పుడు కోల్‌కతా–ఢాకాల మధ్య వచ్చే పోయే రైళ్లతో, ప్రయాణికులతో కళకళలాడిన ఈ స్టేషన్ ఇప్పుడు ఒక చారిత్రక జ్ఞాపకంగా మారింది.
ఉద్యోగులున్నారు.. కౌంటర్ తెరవరు! : బ్రిటిష్ కాలంలో నిర్మించిన సింఘాబాద్ రైల్వేస్టేషన్ ఇప్పటికీ అదే కళతో ఉంది. 1947లో దేశానికి స్వాతంత్య్రం రావడం, దేశవిభజన ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. ఈస్ట్ బెంగాల్ భౌగోళికంగా మనదేశం నుంచి విడిపోయి పాకిస్తాన్‌లో భాగమైంది. ప్రయాణికుల రైళ్ల రాకపోకలు అప్పుడు ఆగిపోయాయి. నేపాల్‌తో 2011లో కుదిరిన ఒప్పందం మేరకు సరిహద్దుల గుండా సరుకు రవాణా చేసే గూడ్స్ రైళ్లు ప్రయాణిస్తాయి. అందుకే స్టేషన్ ఉంది, ఉద్యోగులున్నారు. టికెట్ కౌంటర్ తెరిచే పని లేదన్నమాట.
బ్రిటిష్ ఆర్కిటెక్చర్ కోసం: ఈ స్టేషన్ ‘దేశంలో చివరి రైల్వేస్టేషన్’అనే బోర్డు పెట్టి మరీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. బ్రిటిష్ కాలపు నిర్మాణాన్ని చూడాలనే ఆసక్తితో ఆర్కిటెక్చర్ విద్యార్థులు వస్తుంటారు. చివరి రైల్వేస్టేషన్‌లో టీ తాగుదామనే సరదాతో పర్యాటకులు వస్తారు. ఉత్తరాఖండ్‌లో టిబెట్ సరిహద్దులో ఉన్న మాణాను చివరి గ్రామంగా పర్యాటకశాఖ ప్రచారం కల్పించింది. బెంగాల్ ఆ స్థాయిలో ప్రచారం చేయలేదు, కానీ సింఘాబాద్ స్టేషన్‌కు ప్రాధాన్యం మాత్రం పెరిగింది. నిర్మాణంలోనే కాదు సాంకేతికత కూడా బ్రిటిష్ కాలానిదే. 19వ శతాబ్దం నుంచి నేటికీ పని చేయడం విశేషం.


