నీలవేణి (ఫైల్)
భార్య కళ్లెదుటే రైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భర్త, అతడి ప్రియురాలు ఘటన
హైదరాబాద్, అడ్డగుట్ట: ఈ నెల 7న శబరి ఎక్స్‌ప్రెస్‌లో భార్య కళ్ల ముందే భర్త, అతని ప్రియురాలు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, గురువారం నీలవేణి(36) మృతి చెందినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని చప్రా గ్రామానికి చెందిన నీలవేణికి భర్త, 16, 18 సంవత్సరాల ఇద్దరు కుమారులు ఉన్నారు.
రెండు నెలల క్రితం కుటుంబసభ్యులతో కలిసి నగరానికి వచ్చి మూసాపేటలో నివాసముంటున్నారు. అదే గ్రామానికి చెందిన శిరీష్ అనే వ్యక్తితో నీలవేణికి వివాహేతర సంబంధం ఏర్పడింది. నెల రోజుల క్రితం ఇద్దరూ కొయంబత్తూరుకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. ఆచూకీ తెలుసుకున్న శిరీష్ భార్య సులోచన వారిని పట్టుకొని ఈ నెల 7న భర్త, నీలవేణితో కలిసి సికింద్రాబాద్‌కు శబరి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరింది.
ఈ క్రమంలో రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో సులోచన కళ్లెదుటే శిరీష్, నీలవేణిలు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రికి తరలించగా, రెండ్రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నీలవేణి గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శిరీష్ పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


