ఫిల్మ్‌నగర్‌లో ఓ కారు ప్రమాదం కలకలం రేపింది. అదుపుతప్పి వాహనం నటుడు ధర్మ మహేష్ ఇంట్లోకి దూసుకెళ్లడం ఘటన చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో.. అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫిల్మ్‌నగర్ పరిధిలో నటుడు ధర్మ మహేష్ నివాసం ఉంది. అయితే గత అర్ధరాత్రి దాటాక ఓ కారు అదుపుతప్పి ఆ ఇంటి ప్రాంగణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గేటు, ప్రహారీ గోడ ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం తప్పింది. కారు వేగం ఎక్కువగా ఉండటంతో నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది.
మద్యం మత్తులోనా?..
ప్రమాద సమయంలో కారులో కొందరు యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. కారు నడిపిన తీరు అనుమానాస్పదంగా ఉందని పేర్కొంటూ ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు నటుడి కుటుంబం సమాచారం అందించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం వాళ్లను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు
ప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు వేగం, డ్రైవర్ పరిస్థితి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపారా? అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, చట్టపరమైన చర్యలపై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ధర్మ మహేష్ (కాకాని ధర్మ) తెలుగు సినీ నటుడు. అసలు పేరు కాకాని ధర్మ సత్య సాయి శ్రీనివాస మహేష్. విజయవాడకు చెందిన మహేష్.. ఇంజినీరింగ్ (బీటెక్) పూర్తి చేసిన తర్వాత నటనపై ఆసక్తితో విశాఖపట్నంలోని సత్యానంద్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత ‘సింధూరం’ (2023), ‘డ్రింకర్ సాయి’ (2024)చిత్రాల్లో నటించాడు. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు. ఆ మధ్య వ్యక్తిగత వివాదాలతోనూ ధర్మ మహేష్ వార్తల్లోకి ఎక్కాడు.


